గోదావరి పుష్కర నిధులు..పనులపై గందరగోళం…ఆమోదం వచ్చాక పనులు ప్రారంభిస్తాం

మరో ఏడాదిలో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో పుష్కర నిధులు…పనులపై గందరగోళం నెలకొంది. ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. పుష్కరాలకు ప్రతిపాదించిన పనులకు సంబంధించి…

 గోదావరి పుష్కర నిధులు..పనులపై గందరగోళం…ఆమోదం వచ్చాక పనులు ప్రారంభిస్తాం

మరో ఏడాదిలో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో పుష్కర నిధులు…పనులపై గందరగోళం నెలకొంది. ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. పుష్కరాలకు ప్రతిపాదించిన పనులకు సంబంధించి కూడా స్పష్టత లేకపోవడం గమనార్హం. గోదావరి పుష్కరాల నిర్వహణ, తదితర అంశాలపై రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా దివాకరమ్ న్యూస్ తో ముఖాముఖీ మాట్లాడారు. ఆసమయంలోనే మాజీ ఎంపి మార్గాని భరత్ రామ్ వివాదాస్పద గౌతమీసూపర్ బజార్ అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని కోరేందుకు కమిషనర్ ను కలిసి చర్చించడం గమనార్హం.
గోదావరితీరాన అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్న రాజమహేంద్రవరంలో పనిచేయడం ఆనందంగా ఉందని కమిషనర్ రాహుల్ మీనా చెప్పారు. రాజమహేంద్రవరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ, డ్రెయిన్ల అభివృద్ధి వంటి మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గోదావరి పుష్కరాలను నగరాభివృద్ధికి వేదికగా మార్చుకోనున్నట్లు చెప్పారు. గోదావరి పుష్కరాలకు ఎన్ని పనులు, ఎంత మొత్తం నిధులతో చేపట్టనున్నారన్న విషయాన్ని ఆయన స్పష్టం చేయకపోవడం గమనార్హం. ఇప్పటికే ప్రతిపాదిత పనులను పురపాలకశాఖ ఆమోదం కోసం పంపామని, ఆమోదం లభించగానే తెలియజేస్తామన్నారు. ప్రస్తుతం దేవాదాయశాఖ, ఇరిగేషన్, ఆర్అండ్ బి శాఖల పనులు జరుగుతున్నాయన్నారు.
ఘాట్లలో యాత్రికుల ప్రవేశంపై పరిమితి… ప్రైవేటు వాహనాలకు నో ఎంట్రీ

గత అనుభవాల దృష్ట్యా స్నానఘట్టాల్లో ఘాట్లలో భారీ రద్దీ ఏర్పడకుండా పరిమిత సంఖ్యలోనే యాత్రికుల ప్రవేశం కల్పిస్తామని కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. చదరపు మీటరుకు ముగ్గురు చొప్పున మాత్రమే యాత్రికులు ఉండే విధంగా ఎఐ, సిసి కెమెరాల ద్వారా నియంత్రిస్తామని వివరించారు. పరిమితికి మించితే భక్తులకు ఇతర ఘాట్లకు మళ్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. యాత్రికుల రద్దీకి అనుగుణంగా ఘాట్ల సంఖ్యను పెంచడంతో పాటు, రోడ్లను విస్తరిస్తామన్నారు. అయితే రాజమహేంద్రవరంలో ఎక్కడెక్కడి, ఎన్ని రోడ్లను విస్తరిస్తారన్న విషయంపై కమిషనర్ స్పష్టతనివ్వలేదు. పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు పుష్కరనగర్లను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో యాత్రికులను స్నానఘట్టాలకు తరలిస్తామని వివరించారు. ప్రైవేటు వాహనాలను నగరంలోకి అనుమతించమని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు ఎఐ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే అస్త్రం పేరిట ప్రత్యేక పోలీసు బృందం పనిచేస్తుందన్నారు. 2015 పుష్కరాల రేవులో జరిగిన దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని నగర శివార్లలో కాతేరులో జాతీయ రహదారికి అనుకుని ఉన్న గామన్ వంతెన వద్ద విఐపి ఘాట్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, గోదావరి లంకలో కూడా విఐపి ఘాట్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామన్నారు. స్నానఘట్టాల్లో యాత్రికులు జారిపోని విధంగా ధ్రువీకరించిన పింక్ శాండ్ టైల్స్ ను వినియోగిస్తామన్నారు.
ఎన్నికలు…గౌతమీ సూపర్ బజార్ అంశం కోర్టు పరిధిలో ఉంది
వివాదాస్పద గౌతమీ సూపర్ బజార్ అక్రమ కట్టడాలపై మాజీ ఎంపి భరత్ రామ్ ఫిర్యాదు చేసిన అంశాన్ని ప్రస్తావించగా, వారు భవన క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారని, బిపిఎస్ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని రాహుల్ మీనా చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దాడుల్లో భాగంగానే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎసిబి సోదాలు జరిగాయన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో దరఖాస్తుల ఆమోదంలో జాప్యాన్ని గుర్తించామన్నారు. అక్రమ కట్టడాలను గుర్తించామని, అయితే దాదాపు 3వేల మంది బిపిఎస్ కు దరఖాస్తు చేసుకున్నారని, ఇది కోర్టు పరిధిలో ఉండటంతో కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. వర్షాకాలంలో నగరం ముంపునకు గురికాకుండా మేజర్ డ్రెయిన్ల నిర్మాణాన్ని చేపట్టడంతో పాటు, పూడికతీత పనులు చేపడుతున్నామన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల గురించి, ప్రశ్నించగా, ఈఅంశం కోర్టు పరిధిలో ఉందని, కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. రాజమహేంద్రవరం రూరల్ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న రాహుల్ మీనా గ్రామ పంచాయితీల్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందన్నారు. అయినా నిరంతర పర్యవేక్షణతో గ్రామాల్లో పారిశుద్ధ్యం, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జనాభా, నివాసాల గణనపై 555 మందితో పాటు, అదనంగా 10శాతం మంది సిబ్బందికి ప్రస్తుతం శిక్షణ జరుగుతోందని, మే 1వ తేదీ నుంచి నివాసాల గణన, ఆతరువాత జనాభా గణన జరుగుతాయన్నారు. ఈసందర్భంగా సిబ్బంది 33 ప్రశ్నలు అడుగుతారని, వాటికి సమాధానాలు చెప్పి ప్రజలు సహకరించాలని రాహుల్ మీనా విజ్ఞప్తి చేశారు.

Leave a Reply