మహిళా రిజర్వేషన్లకు బిల్లే కావాలా?

మహిళలకు రిజర్వేషన్ల విషయంలో ఏపార్టీకి చిత్తశుద్ధి లేదన్నది సుస్పష్టం. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టమే చేయాల్సిన అవసరం లేదని, ఆయా పార్టీల అధిష్టానాలు తల్చుకుంటే ఆమేరకు…

 మహిళా రిజర్వేషన్లకు బిల్లే కావాలా?

మహిళలకు రిజర్వేషన్ల విషయంలో ఏపార్టీకి చిత్తశుద్ధి లేదన్నది సుస్పష్టం. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టమే చేయాల్సిన అవసరం లేదని, ఆయా పార్టీల అధిష్టానాలు తల్చుకుంటే ఆమేరకు సీట్లు కేటాయిస్తే ఎవరు కాదంటారు. కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న మహిళా బిల్లు మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33% (మూడింట ఒక వంతు) సీట్లు కేటాయించే నారీశక్తి వందన్ అదినియమ్ పేరిట మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. ఈబిల్లు ద్వారా ఎస్సీ, ఎస్టీ మహిళలకు కేటాయించిన సీట్లలోనే ఉప-రిజర్వేషన్ వర్తిస్తుంది. ఈబిల్లుకు నాడు అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించడం గమనార్హం. అయితే నాడు ఎన్డీఏ సర్కారు నియోజకవర్గాల పునర్విభజన, జనగణన తర్వాతే ఈ రిజర్వేషన్లు అమలులోకి వస్తుందని మెలిక పెట్టింది. నిజంగా ఎన్డీఏ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే యథాతధంగా నాడే ఈబిల్లును అమలు చేసి ఉండవచ్చు. తమకు లబ్ది చేకూరే విధంగా డీ లిమిటేషన్ బిల్లు మాటున ప్రవేశపెట్టడం అనుమానాలు రేపింది.

మహిళా బిల్లు, డీ లిమిటేషన్ బిల్లు వీగిపోవడం అధికార బిజెపితో పాటు, ఎన్డీఏ పక్షాలు, బిల్లులకు మద్దతిచ్చిన ఎపిలోని టిడిపి, వైసిపిలతో పాటు మహిళలను కూడా డీలా పరిచాయి. మరోవైపు నియోజకవర్గాలు పెరిగితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్న మహిళా అభ్యర్థులు, ఆశావహులను నిరాశ పరిచింది. నియోజకవర్గాల పునర్విభజన చట్టం అమల్లోకి వస్తే ఎపిలో ప్రస్తుతం ఉన్న 175 సీట్లు దాదాపు 225కు పెరిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో సీట్లు దక్కని ప్రధాన పార్టీల నేతలంతా ఈబిల్లుపై ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. బిల్లు వీగిపోవడంతో ఆశావహతులతో పాటు, మహిళా బిల్లుతో కలిపి డీ లిమిటేషన్ బిల్లును ఆమోదించుకుని ఒక్కదెబ్బకు రెండు పిట్టలు కొట్టాలన్న ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ద్వయం వ్యూహం బెడిసికొట్టింది. కాస్త రాజకీయాలు తెలిసిన…చదువుకున్న ఆలోచనపరులెవరికీ ఇప్పటికే ఆమోదించిన మహిళా బిల్లు మాటున లోపాయికారీగా డీ లిమిటేషన్ బిల్లు ఎందుకు ప్రవేశపెట్టారన్న విషయం అర్థమైంది.

ఇప్పటికే హాట్రిక్ విజయాలతో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి 2029 జమిలి ఎన్నికల నాటికి మరింత బలోపేతం చేసుకుని, మరోసారి అధికారంలో రావాలన్న వ్యూహం ఈబిల్లు వెనుక కనిపిస్తోంది. ఉత్తరాదికి చెందిన పార్టీగా గుర్తింపు పొందిన బిజెపికి సహజంగానే ఉత్తరాదిలోనే ప్రాభవం ఎక్కువ. కర్నాటకలో మినహా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా ఆపార్టీ అధికారాన్ని చేపట్టలేకపోయింది. మొన్నటి ఎన్నికల్లో కర్నాటకలో కూడా అధికారాన్ని కోల్పోయింది. డీలిమిటేషన్ బిల్లును వర్తింపజేస్తే ప్రస్తుతం ఉన్న 543 లోక్ సభ స్థానాలు 50శాతం చొప్పున దాదాపు 850కి పెరుగుతాయి. ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు కూడా 50శాతం పెరుగుతాయి. నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని ప్రయోగించి 2029 జమిలి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని భావించింది. అయితే జనాభా నియంత్రణను అమలు చేస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య 23.76నుంచి 24శాతం మాత్రమే పెరుగుతుంది. అంటే కేవలం 0.14శాతం మాత్రమే సీట్లు పెరుగుతాయి. పునర్విభజన చట్ట ప్రకారం తమిళనాడులో 20, కేరళలో 10, తెలంగాణలో 9, ఆంధ్రప్రదేశ్‌లో 13 సీట్లు అదనంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అధికంగా ఉన్న అదే ఉత్తరాదిలో సీట్ల సంఖ్య మరింత పెరుగుతుంది. ఇప్పటికే యుపి, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపికే ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. అందుకే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వంటి వారు పునర్విభజన బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని డీ లిమిటేషన్ బిల్లు మాటున తెచ్చిన మహిళా బిల్లు ద్వారా రాజకీయ లబ్ది పొందాలని బిజెపి ఎత్తుగడ వేసింది. బిల్లు వీగిపోతే ఇండియా కూటమిని యాగీ చేయాలని, గెలిస్తే తమ ఘనతగా చెప్పుకోవాలని బిజెపి భావించింది.
బిల్లు వీగిపోయిన వెంటనే ప్రధాని నరేంద్రమోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ కారణంగానే మహిళా బిల్లు వీగిపోయిందని, కాంగ్రెస్ పార్టీ మహిళా ద్రోహి అని అభివర్ణించారు. ఎపిలో కూటమి పార్టీలతో పాటు, వైసిపి కూడా ఈబిల్లుకు మద్దతు ఇచ్చి, బిజెపి తోక పార్టీగా పేరును సార్థకం చేసుకుంది. బిల్లు వీగిపోవడంతో కూటమి పార్టీలు కనీసం నిరసన ర్యాలీలు చేస్తున్నాయి. వైసిపికి మాత్రం ఏమి చేయాలో పాలుపోవడం లేదు. అయితే ఈబిల్లులను వ్యతిరేకించిన ఇండియా పక్షాలు మహిళా వ్యతిరేకులన్న కూటమి పార్టీల ప్రచారాన్ని ప్రజలు పెద్దగా విశ్వసించడం లేదన్నది మాత్రం వాస్తవం. మహిళా బిల్లు మాటున తెచ్చిన నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని మూకుమ్మడిగా వ్యతిరేకించడం ద్వారా ఇండియా కూటమి పక్షాలు ఏకతాటిపై ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. బిల్లు వీగిపోయినా మహిళా రిజర్వేషన్ బిల్లు పేరిట సాగిన ఈరాజకీయ చదరంగంలో మహిళలే ఓడిపోయారన్నది కాదనలేని వాస్తవం.

Leave a Reply