ముఖ్యమంత్రి పీఠం దిశగా లోకేష్ వ్యూహాత్మక అడుగు!…మరి పవన్ భవితవ్యమేమిటీ?

టిడిపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ 2029లో కూటమి ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని,…

 ముఖ్యమంత్రి పీఠం దిశగా లోకేష్ వ్యూహాత్మక అడుగు!…మరి పవన్ భవితవ్యమేమిటీ?

టిడిపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ 2029లో కూటమి ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని, తెలుగుదేశం పార్టీకి చెందిన నేతే సిఎం పదవిని చేపడతారని చేసిన వ్యాఖ్య ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన మళ్లీ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పదవి చేపడతారని స్పష్టంగా చెప్పకపోవడం ఇక్కడ గమనార్హం. ఇప్పటికే షాడో ముఖ్యమంత్రిగా అధికారం చెలాయిస్తున్న యువనేత నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, పార్టీపై పట్టు సాధించి ముఖ్యమంత్రి పీఠం వైపునకు వ్యూహాత్మకంగా ఒక అడుగు వేసినట్లుగా భావిస్తున్నారు. తండ్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడి కౌటిల్య రాజకీయ శైలికి భిన్నంగా ఆయన తనయుడు యువనేత లోకేష్ సొంత కోటరీని ఏర్పాటు చేసుకుని దూకుడుగా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. యువగళం పేరిట రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టిన లోకేష్ రాజకీయాల్లో రాటుదేలి, మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై పప్పు అనే పేరును క్రమంగా పోగొట్టుకున్నారు. లోకేష్ వైఖరి టిడిపిలోని ఒక సామాజిక వర్గానికి, ఆయన కోటరీకి కూడా బాగా నచ్చుతోంది. లోకేష్ టిడిపి జాతీయ కార్యవర్గంలో కూడా సానా సతీష్, కె రామ్మోహన్ నాయుడు, కిలారు రాజేష్ వంటి తన వర్గీయులకు తగిన స్థానం కల్పించుకున్నారు.

ఈఏడాది జనవరి 23న లోకేష్ జన్మదినం వేళ ఎల్లో మీడియాతో సహా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కోరస్ గా లోకేష్ ను ఏకంగా ముఖ్యమంత్రిని చేయాలని, కనీసం ఉప ముఖ్యమంత్రిని చేయాలని గట్టిగా కోరస్ వినిపించాయి. ఒక టిడిపి నాయకుడు అదే సమయంలో జరిగిన దావోస్ పర్యటనలోనే భావి ముఖ్యమంత్రి లోకేషే అని ఘంటాపథంగా ప్రకటించారు. అయితే ఈప్రచారాన్ని మిత్రపక్షాలైన జనసేన, బిజెపి పెద్దగా ఇష్టపడకపోవడంతో సిఎం లోకేష్ అనే నినాదం అప్పట్లో సద్దుమణిగింది. తాజాగా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సిఎం పదవి వైపు వ్యూహాత్మక అడుగు వేశారు. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా లోకేష్ కు ఫుల్ పేజీ ప్రకటనలతో టిడిపి శ్రేణులు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశాయి.
చంద్రబాబునాయుడు వారసుడిగా లోకేష్ సిఎం పదవిని చేపట్టాలని కోరుకోవడంలో తప్పులేదు. ప్రాంతీయ పార్టీల్లో వారసత్వ రాజకీయాలు సాధారణంగా మారిపోయాయి. చంద్రబాబునాయుడుతో సమానంగా సిఎంగా పనిచేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కరుణానిధి, ఫారుఖ్ అబ్దుల్లా, శిబు సోరెన్ వారసులే ఆయా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. తమిళనాడు సిఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా స్టాలిన్ వారసుడిగా సిద్ధమవుతున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈనేపథ్యంలో వయస్సు (76ఏళ్లు) మీదపడిన చంద్రబాబు తప్పుకుని, లోకేష్ కు అవకాశం కల్పించాలని టిడిపి శ్రేణులు, ఎల్లో మీడియా భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
అయితే ఇతర రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు వేరు, ఎపిలో వేరు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ మద్దతు లేకపోతే కూటమి అధికారంలోకి వచ్చేదే కాదన్నది కాదనలేని వాస్తవం. దీంతో తప్పనసరి పరిస్థితుల్లో పవన్ కు ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. ఆయన కూడా గత ఉప ముఖ్యమంత్రుల్లా కాకుండా కాస్త క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. టిడిపి పార్టీ శ్రేణుల డిమాండ్ మేరకు లోకేష్ సిఎం అయితే పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్ ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. లోకేష్ కు డిప్యుటీగా ఆయన పనిచేస్తారా?. కాపు సామాజిక వర్గీయుల్లో కూడా పవన్ కల్యాణ్ ను భావి సిఎం గా భావిస్తున్నారు. మరో 15ఏళ్ల పాటు కూటమి బీటలు వారదని పవన్ పదేపదే చెబుతున్నా లోకేష్ సిఎం పదవి చేపడితే కూటమి బీటలు వారే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Leave a Reply