- May 5, 2026
వీధుల నుంచి…వినువీధుల్లో వీనుల విందైన సంగీత ప్రస్థానం
సంగీత, సాహిత్య, కళా, సాంస్కృతిక, మనదైన హరికథల రంగాల ప్రోత్సాహానికి శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితిని ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో స్థాపించారు. ఈసంగీత సంస్థ…
సంగీత, సాహిత్య, కళా, సాంస్కృతిక, మనదైన హరికథల రంగాల ప్రోత్సాహానికి శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితిని ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో స్థాపించారు. ఈసంగీత సంస్థ ప్రతీ ఏటా ఎంతో మంది లబ్దప్రతిష్టులైన గాయకులు, కళాకారులు , వాద్యకారులతో గత కొన్ని దశాబ్దాలుగా గోదావరితీర ప్రాంత సంగీత ప్రియులను ఏటా వీనుల విందైన మనో రంజకమైన సంగీతంలో ఓలలాడిస్తోంది. సుప్రసిద్ధ వాగ్గేయకారుడు దివంగత డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సహా ఎంతో మంది సంగీత, వాద్య విద్వాంసులు ప్రదర్శనలు ఇచ్చి, గోదావరితీర వాసులను రంజింపజేశారు. పైగా వారు ఇక్కడ ప్రదర్శన ఇవ్వడం ఒక గౌరవంగా భావించడం ఈసంస్థ ఔన్నత్యానికి తార్కాణం.
శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి 2026లో 75వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈసందర్భంగా మే 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 18 రోజుల పాటు ప్లాటినం జూబ్లీ(అమృతోత్సవం) వేడుకలను రాజమహేంద్రవరంలోని గోదావరితీరాన ఉన్న త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. త్యాగరాజ నారాయణదాస సేవాసమితి ప్రస్థానం తొలుత ఇన్నీసుపేట వీధుల నుంచి ప్రారంభమైంది. సంగీత ప్రియులు, వదాన్యుల ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగింది.
రాజమహేంద్రవరం లోని ఇన్నీసుపేటలో 1952లో కీ.శే. బుగ్గా పాపయ్య శాస్త్రి స్థాపించిన ఈ సంస్థ సంగీత, సాహిత్య, కళా, సాంస్కృతిక రంగాల ప్రోత్సాహానికి, మనదైన హరికథల ఆదరణకు విశేష కృషి చేస్తోంది. కీ.శే. జోస్యుల సూర్యనారాయణ, కీ.శే. వక్కలంక సత్యనారాయణ మూర్తి ద్వయం పాపయ్య శాస్త్రి అండగా ఉండేవారు. న్యాయవాది చేబియ్యం వెంకట్రామయ్య, ఆడిటర్ వాడ్రేవు వెంకట రమణ రావు, ఎ.పి. పేపర్ మిల్స్ ఉన్నతాధికారి సి.ఎస్. వెంకట్రావు, ముత్తంగి బుచ్చి రామయ్య, కీ.శే. మద్దూరి శివానంద కుమార్ తదితరులు ఆ వారసత్వాన్ని కొనసాగించారు. దివంగత సుప్రసిద్ధ వాగ్గేయకారుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సమితికి శాశ్వతనిధి సమకూర్చాలన్న సంకల్పంతో వ్యవస్థాపక అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. తొలి నాళ్ళలో ఇన్నీసుపేట వీధుల్లో, అటు తరువాత హిందూ సమాజంలో ఏటా వార్షిక సంగీత సభలు నిర్వహించేవారు. నాలుగు దశాబ్దాల క్రితం గోదావరి గట్టున కరెంట్ ఆఫీసు ఎదురుగా శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి సొంత ప్రాంగణం సమకూర్చుకున్నది. ఆడిటర్ విశ్వనాథం భాస్కర రామ్ సారధ్యంలో సర్వ హంగులతో ఏ.సి. మ్యూజిక్ ఆడిటోరియం నిర్మించారు. దక్షిణ భారతాన శాస్త్రీయ సంగీతం కార్యక్రమాల నిర్వహణకు సకల హంగులతో అత్యంత అనువైన ఆడిటోరియంలలో అగ్రగామిగా ఈ ప్రాంగణం ప్రఖ్యాతిగాంచి, సంగీతజ్ఞుల ప్రశంశలందుకుంది. భారతదేశంలోను, విదేశాల్లోను ఎనలేని కీర్తి ప్రతిష్టలు గాంచిన మహామహులెందరో ఈ వేదికపై ప్రదర్శనలిచ్చారు. అంతేగాక వేద వేదాంగ వేత్తలు, శాస్త్ర పండితులు, సంగీతజ్ఞులకు నెలవైన రాజమహేంద్రవరంలో తమ ప్రదర్శనలు ఇవ్వడం జీవిత కాలపు గౌరవంగా భావించిన వారెందరో. అమృతోత్సవ వేళ సమితి చైర్మన్ గా సి.ఎస్.వెంకట్రావు, ఉపాధ్యక్షులుగా జూపూడి రమణ రావు, ముత్తంగి బుచ్చి రామయ్య, కార్యదర్శులుగా శ్రీమతి జోస్యుల సరస్వతి, వక్కలంక శ్రీరామచంద్రం, విశ్వనాథం భాస్కర రామ్, కోశాధికారిగా శ్రీమతి వి.కృష్ణకుమారి వ్యవహరిస్తున్నారు. ప్లాటినం జుబ్లీని పురస్కరించుకుని సంగీత, కళాప్రియులను రంజింపజేసేందుకు దేశ దేశాల్లో పేరొందిన శాస్త్రీయ సంగీత విద్వాంసుల కచేరీలను నిర్వహిస్తున్నారు. భాస్కర్ రామ్ నేతృత్వంలో అమృతోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.