- May 15, 2026
ప్రమాదానికి కారణమైన ప్రహారీ గోడను తొలగిస్తారా?…చెన్నై సంస్థకు గోదావరి పుష్కరాల్లో రద్దీ నియంత్రణ బాధ్యత!..
2015 గోదావరి పుష్కరాల తొలిరోజే తొక్కిసలాట జరిగి 29 మంది మరణించిన నేపథ్యంలో 2027 గోదావరి పుష్కరాల్లో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ముందుగానే భక్తుల…
2015 గోదావరి పుష్కరాల తొలిరోజే తొక్కిసలాట జరిగి 29 మంది మరణించిన నేపథ్యంలో 2027 గోదావరి పుష్కరాల్లో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ముందుగానే భక్తుల రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. గోదావరి పుష్కరాల్లో రద్దీ నియంత్రణను తమిళనాడు ప్రభుత్వ సంస్థ చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్టు అథారిటీకి(సియుఎంటిఏ) అప్పగించింది. సియుఎంటిఏ చెన్నైలోని రవాణా వ్యవస్థను సమన్వయం చేయడానికి, పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన ఒక కీలకమైన ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ. చెన్నైలో బస్సులు, మెట్రో రైళ్లు, ఇతర రైళ్లు, వంటి వివిధ రవాణా వ్యవస్థలను, పార్కింగ్ సదుపాయాలను ఈఏజెన్సీ పర్యవేక్షిస్తుంది.
గత అనుభవాల దృష్ట్యా ఈసంస్థ ఏడాది ముందుగానే గోదావరి పుష్కరాల్లో రద్దీ నియంత్రణపై దృష్టిసారించింది. సంస్థ ప్రతినిధుల బృందం పుష్కరాలు జరిగే ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రధాన స్నానఘట్టాలు, రోడ్ల విస్తరణ, పార్కింగ్, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భక్తుల రవాణా మార్గాలు వంటి వాటిని పరిశీలించి, జూన్ 10 నాటికి పలు సూచనలు, సలహాలతో జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పిస్తుంది. ఈసంస్థ సూచనల ప్రకారం గోదావరి పుష్కరాల్లో ట్రాఫిక్ నియంత్రణ, రవాణా, పార్కింగ్ సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. ఇరుకుగా మారిన పుష్కరాలరేవును, ఇతర రేవులను మరింత విస్తరించాలని ప్రతినిధులు సూచించారు. ఏ ఘాట్‌లో ఎంత రద్దీ ఉందో రియల్‌టైమ్ సమాచారం ద్వారా భక్తులను ఇతర ఘాట్లకు మళ్లించే విధంగా యాప్ ఆధారిత వ్యవస్థను అమలు చేయాలని ప్రతిపాదించారు. అయితే గత పుష్కరాల్లో పుష్కరాలరేవు వద్ద జరిగిన దుర్ఘటనకు చుట్టూ గోడ ఉండటం కూడా ఒక కారణంగా విశ్లేషిస్తున్నారు. పుణ్యస్నానాల కోసం లోపలికి ప్రవేశించిన వారికి మరోవైపు నుంచి బయటకు వచ్చే మార్గం లేకుండా పోయింది. పుష్కరాలరేవు ముందు వైపు గోడ, పక్కనే జల్లు స్నానఘట్టం ఉండటంతో లోపలికి వెళ్లిన భక్తులు బయటకు వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. లోపల కూడా ఇరువైపులా మంచినీటి రిజర్వాయర్ వంటి నిర్మాణాలు ఉన్నాయి. 2015 దుర్ఘటన అనంతరం ఘాట్ ను కొంత మేరకు విస్తరించినా ముందు వైపు ఉన్న ప్రహారీగోడ భక్తుల రాకపోకలకు అడ్డుగా మారే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గోడను పూర్తిగా తొలగించి, స్వేచ్చగా రాకపోకలు సాగించే విధంగా ఘాట్ ను తీర్చిద్దిదాల్సి ఉంది. దీనిపై సియుఎంటిఏ ప్రతినిధులు ఏ విధమైన సలహాలు, సూచనలు ఇచ్చారు…ప్రజాప్రతినిధులు, అధికారులు ఏం ఆలోచిస్తున్నారన్నది తెలియరాలేదు.