కోలమూరులో కూటమికి బీటలు….కాపులు సీతానగరం ఫలితానికి ప్రతీకారం తీర్చుకుంటారా?!

రాజమహేంద్రవరం నగరంలోని దాదాపు 5-6 డివిజన్లకు సమానమైన ఓటర్లు కలిగి మండల స్థాయి కలిగిన నగర శివార్లలో ఉన్న కోలమూరు గ్రామపంచాయితీ ఎన్నికలు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.…

 కోలమూరులో కూటమికి బీటలు….కాపులు సీతానగరం ఫలితానికి ప్రతీకారం తీర్చుకుంటారా?!

రాజమహేంద్రవరం నగరంలోని దాదాపు 5-6 డివిజన్లకు సమానమైన ఓటర్లు కలిగి మండల స్థాయి కలిగిన నగర శివార్లలో ఉన్న కోలమూరు గ్రామపంచాయితీ ఎన్నికలు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి బలపరిచిన, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి అత్యంత సన్నిహితులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా ఈశ్వరుడు పోటీ చేస్తున్నట్లు గోరంట్ల వీడియో ముఖంగా ప్రకటించారు. ఈశ్వరుడికి ప్రత్యర్థిగా జనసేన నాయకుడు, ఎపి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సన్నిహితుడు మాజీ ఎంపిపి చెరుకూరి రామారావు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నారు. పిన్నమరెడ్డి ఈశ్వరుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా, రామారావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. మరోవైపు బిసి సామాజిక వర్గానికి చెందిన మాజీ సర్పంచ్ అత్తిలి భీమశంకరం కూడా పోటీలో నిలిచారు. దీంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారడంతో పాటు, జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈఎన్నికలు అభ్యర్థులతో పాటు, గోరంట్ల బుచ్చయ్యచౌదరికి, కందుల దుర్గేష్ కు కూడా ప్రతిష్టాత్మకంగా మారాయి. సీతానగరం తరహాలోనే ఇక్కడ కూడా కమ్మ-కాపు ఫీలింగ్ మొదలైందన్న ప్రచారం సాగుతోంది. ఈనేపథ్యంలో చెరుకూరి రామారావుకు మద్దతుగా పనిచేస్తున్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన టిడిపి నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు గోరంట్ల ప్రకటించడం గమనార్హం. కోలమూరులో కూటమిలో భాగస్వామ్యంలో ఉన్న టిడిపి, జనసేన పార్టీలతో పాటు, సీతానగరం తరహాలో కాపు, కమ్మల్లో కూడా విభజనవాదం వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది.
ఈనేపథ్యంలో
మొన్న సీతానగరం జెడ్పీటీసి ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గీయులంతా కలిసి కాపు సామాజిక వర్గానికి చెందిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మిని ఓడించిన సంఘటనను ఈసందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు. సీతానగరంలో జెడ్పీటీసి ఎన్నికలు పార్టీ గుర్తులతో జరిగినా.. టిడిపి నేతలంతా వైసిపితో కుమ్మక్కై ఆపార్టీ అభ్యర్థిని గెలిపించారన్న ప్రచారం ఉంది. పార్టీ రహితంగా జరిగే కోలమూరు పంచాయితీ ఎన్నికల్లో కాపులు సీతానగరం ఫలితానికి ప్రతీకారం తీర్చుకుంటారా లేదా అన్న చర్చ సాగుతోంది. కూటమి మధ్య విభేదాలను తనకు అనుకూలంగా మలుచుకోవాల్సిన ప్రతిపక్ష వైసిపి ప్రేక్షకపాత్ర వహించడం విమర్శలకు తావిస్తోంది. బిసి సామాజిక వర్గానికి చెందిన అత్తిలి భీమశంకరంకు అదే సామాజిక వర్గానికి చెందిన వైసిపి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మద్దతు ప్రకటించకపోవడాన్ని బిసిలు తీవ్రంగా నిరసిస్తున్నారు.

Leave a Reply