దొడ్డి గుమ్మం నుంచి టిక్కెట్లు తీసుకున్నారు…నాయకులుగా ఎదిగారు!
రాజమహేంద్రవరం 1994లో నగరపాలక సంస్థగా ఆవిర్భవించగా, 2002 లో తొలిసారిగా నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగాయి. నాటి ఎన్నికలకు నేడు జరుగుతున్న నగరపాలక సంస్థ ఎన్నికలకు కొన్ని…
రాజమహేంద్రవరం 1994లో నగరపాలక సంస్థగా ఆవిర్భవించగా, 2002 లో తొలిసారిగా నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగాయి. నాటి ఎన్నికలకు నేడు జరుగుతున్న నగరపాలక సంస్థ ఎన్నికలకు కొన్ని పోలికలు ఉన్నాయి. నాడు మేయర్ స్థానాన్ని ఎస్సీలకు కేటాయించగా, ఇప్పడు కూడా అదే సామాజిక వర్గానికి సీటు కేటాయించారు. తొలిసారి ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు జరగ్గా, ఈసారి కూడా మేయర్ స్థానానికి ప్రత్యక్ష పద్దతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. 2002 జనవరిలో ఎన్నికలు జరగాయి. 2003లో గోదావరి పుష్కరాలు వచ్చాయి. ఈసారి కూడా గోదావరి పుష్కరాలకు ఏడాది ముందు నగరపాలక సంస్థ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే నేడున్నంత ధన ప్రభావం ఉండేది కాదు. తాజా ఎన్నికల్లో రూ. 25-40లక్షలు చూపిస్తేనే కూటమి సీటు ఖరారు చేశారన్న ప్రచారం జోరుగా సాగుతుండటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ ప్రాభవంలో ఉన్న 2002లో ఎన్నికల్లో మేయర్ , సహా కార్పొరేటర్ సీట్ల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. స్థానిక జాంపేటలో ఉండే కాంగ్రెస్ కార్యాలయంలో కార్పొరేటర్ల సీట్ల కోసం కార్యకర్తలు భారీగా తరలిరావడం…కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్య విధానాల వల్ల కార్యకర్తలు సీట్ల పంపిణీ సందర్భంగా గలాటా ఏర్పడింది. దీంతో నాడు పరిశీలకులుగా కాంగ్రెస్ నేత కోదండరెడ్డి, దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు జాంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వెనుక గుమ్మం నుంచి కాంగ్రెస్ టిక్కెట్లు పంపిణీ చేయాల్సి వచ్చింది. 2002లో 44 డివిజన్లకు గాను మెజార్టీ 23 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే తొలి మేయర్ గా తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా తెరపైకి వచ్చిన విశాఖపట్నంనకు చెందిన దివంగత ఎంఎస్ చక్రవర్తి కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎంపి జివి హర్షకుమార్ పై విజయం సాధించారు. టిడిపి తరుపున మేయర్ రేసులో విద్యుత్ శాఖ డిఇ నక్కపల్లి శామ్యూల్, తలారి భగవాన్ పేర్లు కూడా వినిపించాయి. కాంగ్రెస్ తరుపున గుమ్మడి సమర్పణరావు, దివంగత ఖండవల్లి అరుణ్ కుమార్ వంటి వారి పేర్లు వినిపించగా, చివరకు హర్షకుమార్ పేరు ఖరారైంది.
నాడు కార్పొరేటర్లుగా విజయం సాధించిన శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం, పంతం కొండలరావు, బుడ్డిగ శ్రీనివాస్, బర్రే కొండబాబు, మింది నాగేంద్ర, కొల్లేపల్లి శేషయ్య, పొలసానపల్లి హనుమంతరావు, పోలు విజయలక్ష్మి, వాసంశెట్టి గంగాధరరావు, ప్రసాదుల హరినాధ్, ఇసుకపల్లి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వర్రే శ్రీనివాసరావు, బట్లంకి ప్రకాష్, వాసిరెడ్డి రాంబాబు, నక్కా చిట్టిబాబు, ద్వారా పార్వతిసుందరి వంటి వారు తిరుగులేని నాయకులుగా, నగర ప్రముఖులుగా ఎదిగారు. తమ కుటుంబ సభ్యులను గెలిపించుకున్నారు. వీరిలో శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం, పంతం కొండలరావు వంటి వారు కింగ్ మేకర్లుగా మారారు. 2014లో ఎన్నికల్లో కొండలరావు తన సతీమణిని మేయర్ గా గెలిపించుకున్నారు. తరువాతి ఎన్నికల్లో వీరిలో కొంతమంది మరోసారి విజయం సాధించగా, మరికొందరు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులను గెలిపించుకున్నారు. వర్రే శ్రీనివాసరావు, వాసిరెడ్డి రాంబాబు, ద్వారా పార్వతి సుందరి, అయితే 2002 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపి జివి హర్షకుమార్ స్వల్ప తేడాతో ఓడిపోయారు. పోలింగ్ రోజున హర్షకుమార్ జేబులో బయటపడిన తుపాకీ ఫొటో కలకలం సృష్టించింది. సుబ్బారావు అనే ఫొటోగ్రాఫర్ తీసిన ఈఫొటోను టిడిపి జిరాక్స్ లు తీయించి, విస్తృతంగా పంపిణీ చేసింది. తుపాకీ ఫొటోతో పాటు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా హర్షకుమార్ చేపలకు మేత వేసే ఫొటోలు ఎన్నికల్లో ప్రభావం చూపించాయన్న చర్చ ఇప్పటికీ సాగుతోంది. చక్రవర్తి బొట్టు పెట్టుకుని మంచి బాలుడిలా కనిపించడం కలిసి వచ్చిందని చెబుతారు.
ఇక 2007లో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని బిసి మహిళలకు కేటాయించగా, నాడు తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పిన సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సన్నిహితుడిగా వ్యవహరించి, తరువాత ప్రత్యర్థిగా మారిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సతీమణి వీరరాఘవమ్మ మేయర్ గా విజయం సాధించారు. మేయర్ పదవి కోసం నాడు కాంగ్రెస్ పార్టీలో కూడా తీవ్రమైన పోటీ నెలకొంది. కుడిపూడి విజయలక్ష్మి, డాక్టర్ పద్మలత వంటి వారు మేయర్ పదవిని ఆశించారు. ఈమేరకు అధికారులను మేనేజ్ చేసి కాంగ్రెస్ నాయకులు డివిజన్ల సరిహద్దులు, రిజర్వేషన్లు కూడా మార్పించేశారన్న ప్రచారం ఉంది. తెలుగుదేశం పార్టీలో డిప్యుటీ మేయర్ పదవి కోసం వర్రే శ్రీనివాసరావు, బాక్స్ ప్రసాద్ పోటీ పడగా, గోరంట్ల బాక్స్ ప్రసాద్ వైపు మొగ్గు చూపడంతో ఆనంద్ రీజెన్సీలో జరిగిన సమావేశంలో సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ బాక్స్ ప్రసాద్ ను డిప్యుటీ మేయర్ గా ప్రకటించారు. ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా మేయర్ రేసులో దిగిన అజ్జరపు వాసు ఆనాడే పోరాట పటిమన ప్రదర్శించారు. తనకు టిడిపి సీటు కేటాయించలేదని ఆగ్రహంతో విక్రమహాలు వద్ద గోరంట్లకు వ్యతిరేకంగా ఆందోళన చేయడంతో పాటు, పార్టీ జెండాను కూడా తగులబెట్టి, ఇండిపెండెంట్ గా గెలిచి, నాయకుడిగా నిరూపించుకున్నారు. తనకు టిక్కెట్టు దక్కలేదన్న కసితో నక్కా చిట్టిబాబు అనుచరులు టిడిపి స్థూపాన్ని ధ్వంసం చేయడం సంచలనం సృష్టించింది. ఈఎన్నికల్లో ఇసుకపల్లి శ్రీనివాస్ కాంగ్రెస్ టిక్కెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు. బాక్స్ ప్రసాద్ తో పాటు, గొర్రెల సురేష్, నండూరి రమణ, అజ్జరపు వాసు, కురగంటి సతీష్, రెడ్డి మణి వంటి వారు నాయకులుగా ఎదిగారు. అయితే 2002 నాటి పాలకవర్గమే ఇప్పటికీ ఆదర్శవంతమైనదిగా చెప్పుకుంటారు. నాడు కౌన్సిల్ లో అభివృద్ధి, ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చలు జరిగేవి. రానురాను ప్రమాణాలు దిగజారుతున్నాయన్న విమర్శలున్నాయి.