ఆదిరెడ్డికి బంపర్ ఆఫర్….వచ్చే ఎన్నికల్లోనూ టిక్కెట్ ఖరారు?!…మరి వారికి?!
టిడిపి వర్గాలు భావి ముఖ్యమంత్రిగా భావిస్తున్న ఎపి ఐటి, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ రాజమహేంద్రవరం పర్యటన పలుసార్లు వాయిదాపడింది. చివరకు డిసెంబర్ 19వ తేదీన రాజమహేంద్రవరంలో…
టిడిపి వర్గాలు భావి ముఖ్యమంత్రిగా భావిస్తున్న ఎపి ఐటి, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ రాజమహేంద్రవరం పర్యటన పలుసార్లు వాయిదాపడింది. చివరకు డిసెంబర్ 19వ తేదీన రాజమహేంద్రవరంలో పర్యటించారు. లోకేష్ పర్యటనను విజయవంతం చేసేందుకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ కన్నా ఎక్కువ హడావుడి చేశారు. లోకేష్ పర్యటన సందర్భంగా వాసు భారీ జనసమీకరణ చేసి, అడగడుగునా ఘన స్వాగతం లభించేలా ఏర్పాట్లు చేశారు. లోకేష్ సొంత మీడియా, భద్రతా సిబ్బంది కూడా అంతన్నా ఎక్కువ చేసి, మీడియాను కూడా దరిదాపుల్లోకి రానివ్వలేదు. మరుసటి రోజున పవన్ కల్యాణ్ నిడదవోలు నియోజకవర్గ పర్యటనకు భారీగా జనం తరలివచ్చినా వారంతా స్వచ్చందంగా వచ్చిన వారే కావడం గమనార్హం.
మద్యం సిండికేట్ వంటి అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని ఇటీవల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదిరెడ్డి వాసుకు లోకేష్ పర్యటనను విజయవంతం చేసినందుకు బంపర్ ఆఫర్ తగలడం విశేషం. పార్టీ కార్యకర్తల సమావేశంలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ యువనేత, తెలుగుదేశం పార్టీ వర్గాలు భావి ముఖ్యమంత్రిగా భావించే మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి కన్నా ఎక్కువ మెజార్టీ సాధించేందుకు కృషిచేస్తానని, ఆదిరెడ్డి వాసు సవాల్ విసిరారు. ఈ సవాల్ ను లోకేష్ స్వీకరించడం ద్వారా వచ్చే 2029 ఎన్నికల్లో ఆదిరెడ్డి వాసుకు దాదాపు అసెంబ్లీ సీటును ఖరారు చేసినట్టేనని భావిస్తున్నారు. అంటే దాదాపు మరో పదేళ్ల వరకు వాసు రాజకీయ భవిష్యత్ కు ఢోకా లేనట్టే. లోకేష్ భరోసా ఆదిరడ్డి వాసుతో పాటు, ఆయన వర్గీయుల్లో ఉత్సాహాన్ని నింపే అంశమే. మరోవైపు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని ఆనుకుని ఉన్న రూరల్ నియోజవర్గానికి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోకేష్ టీమ్ లో ఉన్న గోరంట్ల రాజకీయ వారసుడు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ కూడా వచ్చే ఎన్నికల్లో సీటును ఆశిస్తున్నారు. అలాగే ఇటీవలే టిడిపి రాజమహేంద్రవరం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన రాజానగరం టిడిపి ఇన్చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి రాజానగరం సీటును, కాకినాడ సీటును జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్, ఇతర యువనేతలు సీట్లు ఆశిస్తున్నారు. వీరంతా లోకేష్ టీమ్ సభ్యులే కావడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో వీరికి కూడా సీట్లు లభిస్తాయా లేదా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే అప్పటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే అంచనా వేయలేం. రాజానగరం వంటి చోట్ల మిత్రపక్ష పార్టీలతో పేచీ వచ్చే ప్రమాదం ఉంది.
మరోవైపు సొంత టీమ్ ను గెలిపించుకుని ముఖ్యమంత్రి కావాలని లోకేష్ బలంగా ఆకాంక్షిస్తున్నారు. .టిడిపి, కమ్మ సామాజిక వర్గంలోనూ లోకేష్ ను సిఎంగా చూడాలన్న ఆకాంక్ష బలంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీలోనూ…ప్రభుత్వంలోనూ లోకేష్ మాటే చెల్లుబాటవుతోందన్నదన్నది రాజకీయ వర్గాల్లో అందరికి తెలిసిన విషయమే. రెడ్ బుక్ రాజ్యాంగం కూడా లోకేష్ ఆలోచనే. తెలుగుదేశం పార్టీలో నూతనోత్సాహం తెచ్చేందుకు తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే పోరాడుతున్నానని చెప్పుకుంటున్న లోకేష్ కు మిత్రపక్షమైన జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నుంచే పోటీ ఎదురవుతోంది. మరో 15ఏళ్ల వరకు కూటమి ప్రభుత్వంలోనే కొనసాగుతామని పవన్ చెబుతున్నా….సుదీర్ఘ కాలం పాటు టిడిపి పల్లకీ మోసేందుకు కాపు సామాజిక వర్గీయులు ఆమోదిస్తారా అన్నది కూడా చర్చనీయాంశమే.