అంబటి పరామర్శకు భరత్ ఎందుకు దూరంగా ఉన్నారు?!

ముఖ్యమంత్రి చంద్రబాబును దుర్భాషలాడిన కేసులో అంబటిని గతనెల 31న అరెస్టు చేసి, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. చంద్రబాబును దూషించడంతో టిడిపి శ్రేణులు అంబటి…

 అంబటి పరామర్శకు భరత్ ఎందుకు దూరంగా ఉన్నారు?!

ముఖ్యమంత్రి చంద్రబాబును దుర్భాషలాడిన కేసులో అంబటిని గతనెల 31న అరెస్టు చేసి, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. చంద్రబాబును దూషించడంతో టిడిపి శ్రేణులు అంబటి ఇంటిపైకి దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. ఈసంఘటనపై జగన్ తీవ్రంగా స్పందించారు. గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లి అంబటి కుటుంబాన్ని పరామర్శించారు. ఈసందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబును కాపు ఐకానిక్ గా అభివర్ణిస్తూ…ఎపిలో కాపు నాయకులను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని వైఎస్సార్సీపి అధినేత వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న అంబటిని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో పాటు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, తోట త్రిమూర్తులతో పాటు, మాజీ మంత్రి బిసి సామాజిక వర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు పరామర్శించారు. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆయన సోదరుడు జక్కంపూడి గణేష్ జైలు వద్దే ఉండి, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
అయితే రాజమహేంద్రవరంలోనే ఉండే మాజీ ఎంపి భరత్ జైలు వైపు కన్నెత్తి చూడకపోవడం చర్చనీయాంశంగా మారింది. వైసిపి ఎంపి మిధున్ రెడ్డి జైలులో ఉన్నప్పుడు పలుసార్లు జైలుకు వచ్చిన భరత్ అంబటికి దూరంగా ఉండటం ఏమిటన్నది అంతుబట్టడం లేదు. ఒకవైపు పార్టీ అధినేత జగన్ కాపులను వేధిస్తున్నారని చెబుతుండగా, ఆపార్టీకే చెందిన జాతీయ అధికార ప్రతినిధి అయిన భరత్ అంబటిని పరామర్శించి, కనీసం ఖండించకపోవడంపై కాపు నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాపులంటే ఆయనకు ఇష్టం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు అంబటి రాంబాబు అరెస్టును ఖండిస్తూ జక్కంపూడి రాజా, గణేష్ సోదరులు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అనూహ్యంగా మార్గాని భరత్ తో భేటీ రాజకీయం విఫలం కావడంతో గణేష్ రాజకీయంగా కొంతకాలం స్తబ్దుగా ఉన్నారు. అంబటి అరెస్టు తరువాత ఆందోళనలతో రియాక్ట్ అయ్యారు. అంబటి అరెస్టు తరువాత వారు జైలు వద్ద ములాఖత్ లకు వచ్చే నాయకులకు ఏర్పాట్లు, సమన్వయ బాధ్యతలు రాజా సోదరులు చూస్తున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే భరత్ అంబటి పరామర్శకు దూరంగా ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు. జైలు వద్దకు వస్తే తనకు రాజకీయంగా బద్ధ శత్రువులైన జక్కంపూడి రాజా సోదరులను కనీసం మర్యాదపూర్వకంగానైనా పలకరించాల్సిన ఇబ్బందికర పరిస్థితి ఉంటుందనే భరత్ అంబటి ములాఖత్ కు దూరంగా ఉండి ఉంటారని భావిస్తున్నారు. అలాంటి పరిస్థితిని ఊహిస్తే ఇతర ప్రాంతాల నాయకులతో కలిసి అంబటిని పరామర్శించవచ్చు కదా అన్న చర్చ కూడా సాగుతోంది.

Leave a Reply