మేయర్ సీటు నాది…కాదు మాది..రేసులో ఉరుకులు…పరుగులు!
దాదాపు ఏడేళ్ల తరువాత జరిగే అవకాశం ఉన్న రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ సీటును దక్కించుకునేందుకు కూటమి పార్టీల నాయకులు హడావుడి చేస్తున్నారు. సీటు కోసం…
దాదాపు ఏడేళ్ల తరువాత జరిగే అవకాశం ఉన్న రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ సీటును దక్కించుకునేందుకు కూటమి పార్టీల నాయకులు హడావుడి చేస్తున్నారు. సీటు కోసం కూటమి నాయకుల మధ్య పోటీ కనిపిస్తోంది. నాదంటే కాదు మాది అంటున్నారు. తమకు తాము మేయర్ రేసులో ఉన్నామని ప్రకటించుకుంటున్న నాయకులు కూటమి నాయకులు, నగర ప్రముఖులు, సామాజికవర్గ నాయకులతో పాటు, ప్రత్యర్థి పార్టీల నాయకులను కలిసి తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. సీనియర్ టిడిపి నేత గన్ని కృష్ణ గతంలోనే ఒక రౌండు నాయకులందరినీ కలుసుకుని మద్దతు కోరగా…తాజాగా మరో సీనియర్ నాయకుడు యర్రా వేణుగోపాలరాయుడు, టిడిపి నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, జనసేన రాజమహేంద్రవరం నియోజకవర్గ ఇన్చార్జి అత్తి సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వై శ్రీనివాస్ లు కూడా అదే బాటలో నాయకులను కలిసే పనిలో బిజీగా మారిపోయారు. గత మూడురోజులుగా రాజమహేంద్రవరంలో మేయర్ అభ్యర్థుల మద్దతుయాత్రల సందడి కనిపిస్తోంది. ఎలాగైనా మేయర్ సీటును కైవసం చేసుకోవాలని రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. కూటమిలో భాగస్వామ్య పక్షమైన బిజెపి మేయర్ సీటుపై పెద్దగా ఆసక్తి కనపర్చడం లేదు. ప్రతిపక్ష వైసిపి అయితే అసలు పోటీలో ఉన్నట్లే కనిపించడం లేదు. మరోవైపు రిజర్వేషన్లు, కూటమి సమీకరణలు మారితే రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశాలున్నాయి. అసలు ఎన్నికలే జరగకపోతే…
మేయర్ రేసులో ఉన్న నాయకుల అభిప్రాయాలను దివాకరమ్ న్యూస్ సేకరించింది. ఒకవైపు సిండికేట్ వ్యవహారాలు, మరోవైపు అప్పుడే మేయర్ అయిపోయినంతగా కనీసం మాట్లాడేందుకు కూడా సమయం లేనంత బిజీగా మారిపోయిన మజ్జి రాంబాబుతో మాత్రం మాట్లాడే అవకాశం దొరకలేదు.

అదృష్టం ఉంటే మేయరవుతా…సీటు కోసం పదేపదే దేబరించను – గన్ని కృష్ణ
రాజమహేంద్రవరంలో ఏ నాయకుడికి ఏమాత్రం బలముందో…ప్రజల్లో అభిమానం ఉందో సర్వే చేసి, పార్టీ అధిష్టానం సీటు కేటాయిస్తుందని గన్ని కృష్ణ స్పష్టం చేశారు. పదేపదే నాయకులను కలిసి సీటు కోసం దేబరించలేనని, తనకు ఆత్మగౌరవం ప్రధానమన్నారు. తాను ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు జరిగితే తాను మేయర్ రేసులో ఉంటానని గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, యువనేత లోకేష్ తో పాటు, నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఆయన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎంపి దగ్గుబాటి పురందేశ్వరి తదితరులను కలిసి చెప్పానని, తన అభ్యర్థిత్వం పట్ల వారంతా సానుకూలత వ్యక్తం చేశారన్నారు. ఆదిరెడ్డి వాసు అయితే మీరు మేయర్ అభ్యర్థి అయితే అంతకన్నానా అని కూడా వ్యాఖ్యానించారని గుర్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల పట్ల గన్ని ఒకింత నిర్వేదం వ్యక్తం చేశారు. సమయం వచ్చినపుడు అందరి బట్టలు ఊడదీసే విధంగా బండారాలు బయటపెడతానని హెచ్చరించారు. తనను మేయర్ గా గెలిపిస్తే అవినీతిరహిత అభివృద్ధిని చేసి చూపిస్తానన్నారు. తాను కుల రాజకీయాలకు దూరమని స్పష్టం చేశారు.
————-

మేయర్ అభ్యర్థికి నేనే అత్త్యుత్తమ ఎంపిక నేనే—యర్రా వేణు
రాజమహేంద్రవరం మేయర్ అభ్యర్థిగా తాను నూరుశాతం ఉత్తమ ఎంపికని, తనకన్నా అర్హులెవరూ లేరని టిడిపి సీనియర్ నాయకుడు యర్రా వేణుగోపాలరాయుడు అభిప్రాయపడ్డారు. టిడిపి ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నానని, విద్యార్థి విభాగం స్థాపకుల్లో తాను ఒకరినని చెప్పారు. రాజమహేంద్రవరం అణువణువూ తనకు తెలుసునని, నగర ఎదుగుదలపై పూర్తి అవగాహన ఉన్నవాడినని చెప్పారు. మేయర్ అభ్యర్థిగా తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా పోటీదారులైన గన్ని కృష్ణ, మజ్జి రాంబాబు ఇతర నాయకులను కలుస్తున్నానన్నారు. ఎవరికీ సీటు వచ్చినా పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించామన్నారు. ఒకవేళ బిసి అయితే మజ్జి రాంబాబు పోటీలో ఉంటారన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఆయన తండ్రి అప్పారావుతో పాటు, పార్టీ నాయకులందరి మద్దతు తనకు ఉందన్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా తన అభ్యర్థిత్వంపై సానుకూల సంకేతాలు ఇచ్చారని వేణుగోపాలరాయుడు వివరించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగరపాలక సంస్థ ఎన్నికలు వాయిదా వేయిస్తున్నారన్న ప్రచారాన్ని తాను నమ్మనని స్పష్టం చేశారు. తన మిత్రుడు, జనసేన పార్టీకి చెందిన మంత్రి కందుల దుర్గేష్ తన అభ్యర్థిత్వానికి, గెలుపునకు కూటమి పరధిలో సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ ఎన్నికలు జరుగుతాయని, సీటు తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని వేణుగోపాలరాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలు మారినట్లు తనపై జరుగుతున్న దుష్ర్పచారంపై ఆయన వివరణ ఇస్తూ తెలుగుదేశం పార్టీలో లక్ష్మీపార్వతి సంక్షోభంతో 1998లో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పిలుపు మేరకు కొద్దికాలం బిజెపిలో పనిచేశానన్నారు. తరువాత చిరంజీవిపై అభిమానంతో ప్రజారాజ్యంలో చేరానని వివరణ ఇచ్చారు. నేటి రాజకీయాల్లో పార్టీలు మారడం గ్లామర్ గా మారిందని వ్యాఖ్యానించారు. టిడిపి ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, బండారు సత్యానందరావు వంటి వారికి లేని అభ్యంతరాలు తనకే ఎందుకని ప్రశ్నించారు.
—————-

సీటు జనసేనదే….అభ్యర్థినిని నేనే! అత్తి సత్యనారాయణ
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ సీటు న్యాయంగా జనసేనకే కేటాయించాలని జనసేన నియోజకవర్గ ఇన్చార్జి అత్తి సత్యనారాయణ స్పష్టం చేశారు. సిటీ, రూరల్ ఎమ్మెల్యే సీట్లు, రుడా చైర్మన్ పదవి తెలుగుదేశం పార్టీకి, ఎంపి, ఎమ్మెల్సీ పదవులు బిజెపి కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఈసారి మేయర్ సీటు కచ్చితంగా జనసేన పార్టీకే దక్కుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈవిషయం జనసేనాని పవన్ కల్యాణ్ దృష్టిలో కూడా ఉందన్నారు. జనసేన పార్టీ తరుపున తానే మేయర్ అభ్యర్థినని స్పష్టం చేశారు. 2009 నుంచి మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో తనకు అనుబంధం ఉందన్నారు. జనసేన తరుపున అసెంబ్లీకి పోటీ చేయడంతో పాటు, రాజమహేంద్రవరంలో జనసేన పార్టీ ప్రాచుర్యానికి కృషిచేస్తున్నానని చెప్పారు. వ్యాపారపరంగా నష్టపోయినా పవన్ కల్యాణ్ వెంటే నడిచానని, ఆయన మాటే శిరోధార్యమన్నారు.
———–

జనసేన తరుపున నేనూ రేసులో ఉన్నా…వై శ్రీనివాస్
జనసేన పార్టీ తరుపున తాను కూడా మేయర్ రేసులో ఉన్నానని ఆపార్టీ నగర అధ్యక్షుడు వై శ్రీనివాస్ వెల్లడించారు. సీటు ఆశించడంలో తప్పేమిటని, ఒక పార్టీ నుంచి ఎంతమందైనా ఆశించవచ్చని వ్యాఖ్యానించారు. చిరంజీవి అభిమానిగా, ప్రజారాజ్యం పార్టీ నాటి నుంచి మెగా ఫ్యామిలీతో తనకు సన్నిహిత అనుబంధం ఉందన్నారు. జనసేన వ్యవస్థాపక సభ్యుల్లో తానొకరినని చెప్పారు. సీటు ఆశించడానికి ఇంతకన్నా అర్హతేమిటని ప్రశ్నించారు. అయితే సీటు కేటాయించాలా వద్దా అనేది అధిష్టానం ఇష్టమన్నారు. సీటు విషయంలో అత్తి సత్యనారాయణ తనకు పోటీ కాదని, ఆయన సామాజికవర్గం వేరు తనది వేరని స్పష్టం చేశారు. పార్టీ ఆయనకే టిక్కెట్టు కేటాయిస్తే పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన గెలుపునకు కృషిచేస్తానని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం మేయర్ సీటు జనసేనకే కేటాయించే అవకాశాలు ఉన్నాయన్నారు. 2018లో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాత తన వెంట నడవాలని కోరుకున్నారని, పార్టీ సస్పెండ్ చేసిన వ్యక్తితో తామెలా నడుస్తామని, అక్కడే తామిద్దరికీ విభేదాలు పొడసూపాయని వివరించారు. నాటి నుంచి ఆయన ఆధ్వర్యంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని, అందుకే తాను కూడా వెళ్లడం లేదన్నారు.
————————-
మా వార్తలు నచ్చిన పాఠకులు వెబ్ సైట్ కు అడ్వర్టైజ్ మెంట్లు వచ్చే వరకు ఒక్కో వార్తకు కేవలం రూ. 2/ 9491659287 నెంబర్ కు ఫోన్ పే చేసి ప్రోత్సహించగరమని మనవి.
If our news items liked you please send only Rs 2/ by phone pay to 9491659287 for Encourage. until we get Adv.