- September 2, 2026
పవనిజం నుంచి….పవరిజం వరకు..
అన్న సాధించలేని అధికారాన్ని…తమ్ముడు సాధిస్తాడా.?..జనసేనాని, ఎపి ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో పవన్ కల్యాణ్ పై ఇదే అంచనాలతో, ఎన్నో ఆశలతో అభిమానులు, కాపు సామాజిక వర్గీయులు…
అన్న సాధించలేని అధికారాన్ని…తమ్ముడు సాధిస్తాడా.?..జనసేనాని, ఎపి ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో పవన్ కల్యాణ్ పై ఇదే అంచనాలతో, ఎన్నో ఆశలతో అభిమానులు, కాపు సామాజిక వర్గీయులు ఉన్నారు. పవనిజం అంటూ అభిమానుల్లో ఏకంగా ఒక సిద్ధాంతాన్నే సృష్టించారు. పవనిజం అంటే ఆయన మాటల్లోనే “ పవనిజం అంటే అదో అందమైన అభిమానుల ప్రపంచం. నా అభిమానులు నాకోసం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద ఫంక్షన్లు చేయనక్కర్లేదు. నన్ను అభిమానించే అభిమానుల ప్రతి ఒక్కరి కళ్ళలోనూ చెరగని ఆనందాన్ని చూడాలనుకుంటాను. వాళ్ళు సమాజం పట్ల భాద్యత కలిగిన ఒక పౌరుడిగా తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలనేది మాత్రమే వారి నుంచి ఆశిస్తున్నానని’ ఆయన చెప్పుకున్నారు. లక్షలాది పుస్తకాలు చదివానని, పవనిజాన్ని ప్రవచించిన పవన్ కల్యాణ్ వైఖరిలో మార్పు కనిపిస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు. అధికారాన్ని, అందులోని మజాను ఆస్వాదిస్తున్న పవన్ దాన్ని ఇప్పట్లో వదులుకునేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన ఉపముఖ్యమంత్రి హోదాలో ఉండగా, ఆయన సోదరుడు నాగబాబు ఎపి గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా కేబినెట్ హోదాను అనుభవిస్తున్నారు. ఈనేపథ్యంలో మరో 15ఏళ్ల పాటు తెలుగుదేశం, బిజెపి, జనసేన కూటమి కలిసే ఉంటాయని పదేపదే ప్రకటించడం ఆయనలోని పవరిజాన్ని సూచిస్తోందని విశ్లేషిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంకను కిరాతకంగా కారుతో తొక్కించిన హత్య చేసిన ఘటన, కాకినాడలో ఏఇ నూకరాజు కుటుంబాన్ని బలి తీసుకున్న సాధిక్ ఖాన్ లవ్ జిహాద్ సంఘటనపైనా ఆయన స్పందనలు గతానికి భిన్నంగా ఉండటం గమనార్హం. పవన్ వైఖరి తెలుగుదేశం పార్టీకి వంతపాడుతన్నట్లుగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ ప్రకటనల తీరు గత ఎన్నికల్లో కూటమికి ముఖ్యంగా జనసేన పోటీ చేసిన అన్ని చోట్ల ఓట్లు వేసి గెలిపించిన కాపు సామాజిక వర్గీయుల్లో నిరాశ కలిగిస్తోంది. కాపులు పల్లకీమోతకే పరిమితం కావాలా అన్నది వారి ఆవేదన. పవన్ కల్యాణ్ చొరవతోనే కూటమి అధికారంలోకి వచ్చిందన్నది నిర్వివాదాంశం. అయితే మరో 15ఏళ్ల పాటు కూటమితోనే ఉన్నా…మళ్లీ అధికారంలోకి వచ్చినా పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కాలేరన్నది కాపులు, ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 75 ఏళ్లు నిండిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్థానంలో ఆయన తనయుడు నారా లోకేష్ పవర్ సెంటర్ గా మారి సిఎం కుర్చీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్ లక్షలాది మంది వీర మహిళలు, జనసైనికులతో ఒక రాజకీయ శక్తిని నిర్మించుకున్నారు. రానున్న రోజుల్లో అన్న సాధించలేని అధికారాన్ని తమ్ముడు పవన్ సాధిస్తారేమోనని అభిమానులు ఆశ….విశ్లేషకుల అంచనా. అయితే మరో 15ఏళ్లు కూటమితో కలిసే పనిచేస్తామన్న ప్రకటనతో అభిమానుల ఆశ నిరాశగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ వ్యూహాన్ని మారిస్తే తప్ప ఎన్నేళ్లు గడిచినా పవన్ పల్లకీ మోతలోనే ఉంటుందని విశ్లేషిస్తున్నారు. మెంబర్ షిప్ నుంచి లీడర్ షిప్ స్థాయికి కార్యకర్తలను తీసుకెళ్తానన్న పవన్ తాను రాష్ట్ర ప్రధాన లీడర్ గా ఎప్పుడెదుగుతారన్నదే అభిమానుల ప్రశ్న.
సెప్టెంబర్ 2 పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా
———————
మా వార్తలు నచ్చిన పాఠకులు వెబ్ సైట్ కు అడ్వర్టైజ్ మెంట్లు వచ్చే వరకు ఒక్కో వార్తకు కేవలం రూ. 2/ 9491659287 నెంబర్ కు ఫోన్ పే చేసి ప్రోత్సహించగరమని మనవి.
If our news items liked you please send only Rs 2/ by phone pay to 9491659287 for Encourage. until we get Adv.