కార్పొరేటర్ అభ్యర్థలకూ ఆశాభంగం….నిరాశ పరిచిన ఎమ్మెల్యే!
తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి సీట్ల పంపకాలు…మొన్న ఔత్సాహిక మేయర్లకు ఆశాభంగం కలిగించగా… తాజాగా డివిజన్ల రిజర్వేషన్లు ఔత్సాహిక కార్పొరేటర్ల ఆశలు గల్లంతయ్యాయి. రెండురోజుల పాటు రాజమహేంద్రవరం…
తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి సీట్ల పంపకాలు…మొన్న ఔత్సాహిక మేయర్లకు ఆశాభంగం కలిగించగా… తాజాగా డివిజన్ల రిజర్వేషన్లు ఔత్సాహిక కార్పొరేటర్ల ఆశలు గల్లంతయ్యాయి. రెండురోజుల పాటు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిఏ ప్రసాద్ నగరపాలక సంస్థ సిటీ ప్లానర్ గదిలో కూర్చుని గంటల తరబడి మంతనాలు సాగించారని కార్పొరేషన్ వర్గాలు చెబుతున్నాయి. ఆతరువాత వెలువడిన నగరపాలక సంస్థ డివిజన్ రిజర్వేషన్ల జాబితాలో సీట్లు ఖరారైన ఔత్సాహిక కార్పొరేటర్ అభ్యర్థుల సీట్లకు సంబంధించిన రిజర్వేషన్లు తారుమారయ్యాయి. తన సామాజిక వర్గానికే చెందిన సిటీప్లానర్ జవిఎస్ మూర్తితో కలిసి డివిజన్ రిజర్వేషన్లను ఎమ్మెల్యే తారుమారు చేయించారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. రిజర్వేషన్ల ఖరారు వ్యవహారాన్ని చూసి, హామీ పొందిన టిడిపి నాయకులు కూడా మండిపడుతున్నారు. తమ సీట్లను మహిళలకు, ఇతర వర్గాలకు కేటాయించి, తమకు పోటీ చేసే అవకాశం లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యేయే చేయించారని, ఆశలు కల్పించి, నిరాశ పరిచారని ఆరోపిస్తున్నారు. డివిజన్ల రిజర్వేషన్ల ఖరారు తరువాత ఎమ్మెల్యే తన నివాసంలో సమావేశాన్ని ఏర్పాటు చేసినపుడు హామీ పొందిన వారంతా ఆయన ముందే అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈసమావేశంలో నవంబర్ 5న రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని, 20వ తేదీన ఎన్నికలు జరుగుతాయని వెల్లడించినట్లు సమాచారం. గ్రామాల విలీనానికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు గురించి ప్రస్తావించగా ఎన్నికలపై స్టే లేదు కదా ఎన్నికల ప్రక్రియలో ముందుకు వెళ్లాలని న్యాయనిపుణులు సలహా ఇచ్చారని కూడా ఎమ్మెల్యే తెలిపారని తెలుస్తోంది. నగరపాలక సంస్థలో మొత్తం 72 సీట్లలో 50శాతం అంటే 36 సీట్లు మహిళలకు కేటాయించడంతో ఔత్సాహిక అభ్యర్థుల ఆశలు గల్లంతయ్యాయి. గతంలో సీనియర్ కార్పొరేటర్లు వర్రే శ్రీనివాసరావు, జవ్వాది మురళీకృష్ణ, కొయ్యల రమణ, కొమ్మా శ్రీనివాస్ తదితరులతో పాటు, ఎమ్మెల్యే వాసు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్న యాళ్ల ప్రదీప్, మజ్జి రాంబాబు, కడలి రామకృష్ణ, నక్కా దేవి, మజ్జి మణికంఠ, బుడ్డిగ రవి, ఉర్లంక లోకేష్, రవియాదవ్ వంటి వారి సీట్లు మహిళలకో లేదా ఇతర వర్గాలకో రిజర్వు కావడంతో వారి ఆశలు, ఎమ్మెల్యే హామీలు గల్లంతైనట్టయ్యింది. హామీ మేరకు ఎమ్మెల్యే తమకు అనుకూలంగా రిజర్వేషన్లు ఖరారు చేయిస్తారని ఆశించిన వారికి ఆశాభంగమైంది. ఈనేపథ్యంలో తమ ఇళ్లల్లోని మహిళల చేత పోటీ చేయించాలా వద్దా అన్న మీమాంసలో ఔత్సాహికులు తర్జనభర్జన పడుతున్నారు. ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీతో పాటు, కూటమి పార్టీల్లో కూడా అసంతృప్తిని రాజేస్తున్నాయి.
————————–
మా వార్తలు నచ్చిన పాఠకులు వెబ్ సైట్ కు అడ్వర్టైజ్ మెంట్లు వచ్చే వరకు 9491659287 నెంబర్ కు మీకు తోచిన మొత్తాన్ని ఫోన్ పే చేసి ప్రోత్సహించగరమని మనవి.
If our news items liked you please send by phone pay to 9491659287 As your like for Encourage to us. until we get Adv.