వచ్చే ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా….ఆరోగ్యశాఖ మంత్రినవుతా!
చిన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ జెండాలతో తిరిగి, జనం మధ్య పెరిగానని చెబుతున్న టిడిపి డాక్టర్స్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్…
చిన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ జెండాలతో తిరిగి, జనం మధ్య పెరిగానని చెబుతున్న టిడిపి డాక్టర్స్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాజకీయ వారసుడిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. విద్యాధికుడు, మానవతా దృక్పథంతో పాటు, ప్రజాసమస్యలు, వాటి పరిష్కారంపై లోతైన అవగాహన, అభివృద్ధిపై ప్రత్యేక విజన్, కార్యకర్తల సంక్షేమం, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన రవిరామ్ కిరణ్ తో దివాకరమ్ న్యూస్ ముఖాముఖీ…..
పెదనాన్న…పెద్దాయిన గోరంట్ల బుచ్చయ్యచౌదరికి తాను రాజకీయ వారసుడ్ని కాదని, ఆయన ఆశయాలకే వారసుడ్ని అని రవిరామ్ కిరణ్ స్పష్టం చేశారు. వచ్చే 2029 ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్ నియోకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అయితే టిక్కెట్టు కేటాయించాలా లేదా అన్నది పార్టీ అధిష్టానం నిర్ణయమని తెలిపారు. విద్యాధికుడ్ని…చిన్నప్పటి నుంచి టిడిపి జెండాతోనూ, జనం మధ్య తిరిగిన తనకు పార్టీ కార్యకర్తల మనోభావాలు, ప్రజాసమస్యలపై పూర్తి అవగాహన ఉన్న తన కన్నా పోటీ చేసేందుకు అర్హులెవరని ప్రశ్నించారు. జిఎస్సార్ ఫౌండేషన్ ద్వారా ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేసి, సామాజిక సేవ కూడా చేస్తున్నానన్నారు. రాజమహేంద్రవరంలో గత ఏడాది జరిగిన మహానాడు సందర్భంగా ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి, మండుటెండల్లో సుమారు 65 మంది కార్యకర్తలు వడదెబ్బకు గురైతే మెరుగైన వైద్యసేవలు అందించి, కోలుకునేలా చేశామని గుర్తు చేశారు. తన కన్నా అర్హులని పార్టీ భావించి, వేరెవరికైనా సీటు ఇస్తే తాను తప్పుకునేందుకు సిద్ధమేనని ప్రకటించారు. తనది గోరంట్లకు రాజకీయ వారసత్వం కాదని, ఆశయాల వారసత్వమేనని పునరుద్ఘాటించారు. గోరంట్ల మళ్లీ పోటీకి సిద్ధమైనా తనకు అభ్యంతరం లేదన్నారు. ప్రజాసమస్యలు, వాటి పరిష్కారంపై సంపూర్ణ అవగాహన, అభివృద్ధి ప్రణాళికలు తన వద్ద ఉన్నాయన్నారు. రూరల్ నియోజకవర్గంలో ప్రతీ ఇంటికీ మంచినీటి సరఫరా, మెరుగైన పారిశుద్ధ్యం, కార్యకర్తలకు సామాజిక, ఆర్థిక భద్రత తన ప్రాధాన్యతలని వివరించారు. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరు గోదావరిలో కలవకుండా, శుద్ధి చేసి, ఆనీటిని సాగుకు వినియోగించుకునేలా పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను రూపొందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తానని వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు కూడా కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటానన్నారు. అధికార యంత్రాంగంలో అవినీతి వల్ల కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయని, వారిలో అవినీతిని పూర్తిగా తగ్గించేందుకు కృషిచేస్తానని చెప్పారు. అలాగే ప్రస్తుతం పెద్దాయిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి వెంట ఉన్న పార్టీ కేడర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు రవిరామ్ కిరణ్ చెప్పారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తనను వారసుడిగా ప్రకటిస్తే రెండు అధికార కేంద్రాలు ఏర్పడతాయన్న ఉద్దేశంతోనే ఇప్పటి వరకు తన పేరును గోరంట్ల ప్రకటించలేదన్నారు. తాను పోటీ చేసే విషయమై పెద్దాయినతో చర్చించానని, ఆయన కూడా ఆమోదం తెలిపారన్నారు. ప్రజాప్రతినిధిగా తన పెదనాన్న గోరంట్ల బుచ్చయ్యచౌదరికి 10కి 9 మార్కులు వేస్తానని పేర్కొన్నారు. గోరంట్ల ప్రజాసమస్యలపై మంచి అవగాహన, విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. వాస్తవ సమస్యలపై పార్టీలకు అతీతంగా ఆయన సానుకూలంగా స్పందించి, తగిన సహాయం చేస్తారన్నారు. అయితే అనివార్య కారణాల వల్ల తాను ప్రస్తావించిన కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోయారని వివరించారు. గోరంట్లకు రాజమహేంద్రవరంలోని పార్టీ ప్రత్యర్థులతో ఉన్న విభేదాలు కొనసాగుతాయా అని ప్రశ్నించగా, తనకు ఎవరితోనూ గొడవలు లేవని, వారు కూడా తనతో అభిమానంగానే ఉంటారని సమాదానమిచ్చారు.
2028 నుంచి తాను రాజకీయంగా క్రియాశీలకంగా మారతానని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలుపొంది, అవకాశం లభిస్తే ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రజల ఆరోగ్య సంరక్షణకు కృషిచేయాలని, అవినీతి రహిత పాలన అందించాలన్నది తన అంతిమ లక్ష్యమని వెల్లడించారు. ప్రస్తుత రాజకీయాల పరిస్థితుల్లో ఓట్ల కోసం కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని, అంగీకరిస్తూనే…తాను సంపాదన కోసం రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఖర్చుపెట్టిన సొమ్మును రాజకీయంగా సంపాదించుకోవాలని భావించడం లేదని, తనకు వైద్య వృత్తితో పాటు, రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు ఉన్నాయని తనకు ఆ ఆదాయం సరిపోతుందన్నారు.
ఎన్నో విమర్శలతో పాటు, .బాడీషేమింగ్ కు గురై, తల్లిని అవమానించినా సహించి ఓర్పు, నేర్పుతో రాజకీయాల్లో రాణిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, యువనేత, విద్యాశాఖ మంత్రి, లోకేష్ తనకు రాజకీయాల్లో రోల్ మోడల్ అని రవిరామ్ కిరణ్ చెప్పారు. ఓపిక ఉన్నంత వరకు చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రిగా కొనసాగాలన్నది తన అభిమతమని స్పష్టం చేశారు.