లోకేష్ మెచ్చిన గోరంట్ల వారసుడి ఆరోగ్య పథకం!

సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సోదరుడు శాంతారామ్ కుమారుడైన డాక్టర్ రవిరామ్ కిరణ్ సామాజిక స్పృహ కలిగిన నరాల వైద్యుడు. రవిరామ్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ డాక్టర్స్…

 లోకేష్ మెచ్చిన గోరంట్ల వారసుడి ఆరోగ్య పథకం!

సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సోదరుడు శాంతారామ్ కుమారుడైన డాక్టర్ రవిరామ్ కిరణ్ సామాజిక స్పృహ కలిగిన నరాల వైద్యుడు. రవిరామ్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రవిరామ్ కిరణ్ లో పార్టీ గెలుపు కోసం శ్రమిస్తున్న కార్యకర్తల పట్ల సానుభూతి, వారి సంక్షేమం పట్ల అంకిత భావం కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఆయన టిడిపి కార్యకర్తల ఆరోగ్య సంరక్షణ కోసం కేడర్ హెల్త్ వెల్ఫేర్ ప్రోగ్రాం పేరిట వినూత్న పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఈపథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తొలుత రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ఇటీవల ప్రారంభించారు. దశల వారీగా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలోని గుర్తింపు పొందిన సుమారు 4లక్షల మంది టిడిపి కార్యకర్తలు ఈ వినియోగించుకోవచ్చు. ఈపథకంలో భాగంగా డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో సుమారు 30కి పైగా మల్టీ స్పెషాలిటీ, ఇతర వైద్య విభాగాల ఆసుపత్రుల యాజమాన్యాలతో ఒప్పందం చేసుకుని, గుర్తింపు పొందిన టిడిపి కార్యకర్తలు అనారోగ్యానికి గురైతే వైద్య చికిత్సలో 20శాతం రాయితీ లభించేలా చర్యలు తీసుకుంటారు. ఆయా నియోజకవర్గాల టిడిపి ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ చార్జిల కార్యాలయాల్లో రాయితీకి సంబంధించిన పాస్ లను అందుబాటులోకి ఉంచుతారు. అవసరమైన వారు వీటిని వినియోగించుకోవచ్చు. కనీస ఆదాయ మార్గాలు లేని నిరుపేద కార్యకర్తలకు పూర్తిస్థాయిలో వైద్యఖర్చులు భరించేందుకు కేడర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ను కూడా ప్రారంభించారు. ఈపథకానికి గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రవిరామ్ కిరణ్ సంయుక్తంగా నెలకు రూ. 50వేల మొత్తాన్ని విరాళంగా జమ చేస్తారు. అవసరమైన కార్యకర్తలకు ఆపద సమయంలో అందజేస్తారు. సిఎం రిలీఫ్ ఫండ్, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలు వర్తించని కార్యకర్తలకు ఈపథకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అయితే కార్యకర్తలకు మాత్రమే ఈపథకం వర్తిస్తుంది. వారి కుటుంబ సభ్యులకు వర్తించదు. అనారోగ్యం కారణంగా టిడిపి కార్యకర్తల కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా రోడ్డున పడకుండా ఈపథకం ఆదుకుంటుంది.
రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలో విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా ఈపథకాన్ని అమలు చేస్తామని రవిరామ్ కిరణ్ “దివాకరమ్ న్యూస్” కు వివరించారు. ఈపథకం గురించి ఇప్పటికే టిడిపి యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు వివరించగా, ఆయనకు కూడా నచ్చినట్లు రవిరామ్ కిరణ్ తెలిపారు. రాజమహేంద్రవరంలో విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా ఈఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో అమలు చేస్తామన్నారు. ఈపథకం ద్వారా రానున్న రోజుల్లో లక్షలాది మంది కార్యకర్తలకు కోట్లాది రూపాయల లబ్ది చేకూరుతుందన్నారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇప్పటికే పార్టీలకు అతీతంగా సుమారు 50శాతం తక్కువ ధరలకే రక్తాన్ని, దాని అనుబంధ ఉత్పత్తులను అందిస్తున్నామని ఆయన చెప్పారు. బ్లడ్ బ్యాంకుల వ్యవస్థలో అంతా మోసమేనని ఆయన ఆరోపించారు. ఇతర బ్లడ్ బ్యాంకుల్లో ఒక సంచీ రక్తానికి రూ. 1800 వరకు వసూలు చేస్తున్నారని, తమ బ్లడ్ బ్యాంకులో రక్తదాతలను తెచ్చుకుంటే కేవలం 900కే అవరమైన గ్రూపు రక్తాన్ని అందిస్తున్నామని రవిరామ్ కిరణ్ వివరించారు. బ్లడ్ బ్యాంకు ద్వారా ఇప్పటికే లక్షలాది రూపాయల ప్రజల సొమ్మును ఆదా చేశామన్నారు. టిడిపి కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్తల్లో గెలుపు తరువాత తమను పట్టించుకోవడం లేదన్న భావన నెలకొందని, ఈనేపథ్యంలో కార్యకర్తలు తమ ఆత్మాభిమానాన్ని పక్కనపెట్టి వైద్యం చేయించుకునేందుకు ఎవరినీ చేయిచాచి ఆర్థికసాయం అడిగే పరిస్థితి రాకుండా ఉండేందుకే ఈపథకానికి శ్రీకారం చుట్టినట్లు రవిరామ్ కిరణ్ వివరించారు. టిడిపి కార్యకర్తలు ఎప్పటికీ తలెత్తుకుని తిరిగేలా ఉండాలన్నదే తన ధ్యేయమని స్పష్టం చేశారు.

Leave a Reply