స్థానిక సంస్థల ఎన్నికల్లో …..రాజమహేంద్రవరంను మళ్లీ పక్కనపెట్టేసినట్టేనా..?
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో కీలకమైన కమినషర్ కుర్చే గత కొంతకాలంగా ఖాళీగా ఉంది. అలాంటిది 2019 నుంచి ఖాళీగా ఉన్న మేయర్ కుర్చీ సహా 50 మంది…
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో కీలకమైన కమినషర్ కుర్చే గత కొంతకాలంగా ఖాళీగా ఉంది. అలాంటిది 2019 నుంచి ఖాళీగా ఉన్న మేయర్ కుర్చీ సహా 50 మంది కార్పొరేటర్ల ఖుర్చీలు భర్తీ అవుతుయా?…ఇదే సందేహం రాజమహేంద్రవరం ప్రజలను వేధిస్తోంది. ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలో ఏదైనా అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు స్థానిక ప్రజాప్రతినిధులను ముఖ్యఅతిధులుగా పిలుస్తున్నారు. కాంట్రాక్టర్లు కూడా వారి వెంటే తిరుగుతున్నారు. రానున్న గోదావరి పుష్కరాల్లో దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రముఖులను ఆహ్వానించడంలో మేయర్ ప్రథమ పౌరుడిగా ప్రొటోకాల్ లో ముందువరుసలో ఉంటారు. మేయర్ వస్తే నగర పెత్తనమంతా నగరపాలకవర్గానిదే అవుతుంది. పెత్తనాన్ని వదులుకునేందుకు రాజకీయనేతలు ఇష్టపడతారా?…
ఆంధ్రప్రదేశ్ లో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఇటీవల ప్రకటించారు. 2025 అక్టోబర్ 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని, అక్టోబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి, ప్రచురించాలన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలన్నారు. నవంబర్ 16వ తేదీ నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి పూర్తి చేయాలన్న నీలం సాహ్ని డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలన్నారు. డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని, చివరకు అంటే.. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి.. అదే నెలలో ఫలితాలు ప్రకటించాలని తెలిపారు. అయితే 2027లో గోదావరి పుష్కరాలు జరిగే రాజమహేంద్రవరం, కీలకమైన రాజధాని ప్రాంతంలోని మంగళగిరి, తాడేపల్లి, శ్రీకాకుళం సహా న్యాయపరమైన చిక్కులున్నచోట ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఎన్నికల కమిషన్ కూడా సూత్రప్రాయంగా ఈవిషయాన్ని వెల్లడించింది.
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు పరిసర గ్రామాల విలీన వివాదమే పెద్ద అడ్డంకిగా మారింది. మున్సిపాలిటీగా ఆవిర్భవించిన నాటి నుంచి, నేటి వరకు ఇదే సమస్య కొనసాగుతోంది. దీనివల్లే మధ్యలో పలుసార్లు ఎన్నికలు జరగలేదు. రాజమహేంద్రవరంతో ముడిపడిన విలీన గ్రామాల్లో కూడా ఎన్నికలు జరగడం లేదు. తద్వారా ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడం లేదు. మరోవైపు రాజమహేంద్రవరంతో పాటు గ్రామాల్లో కూడా రాజకీయ నిరుద్యోగులు కూడా పెరిగిపోతున్నారు. పురపాలకశాఖ మంత్రి పి నారాయణ మున్సిపాలిటీల్లో గ్రామాల విలీన ప్రతిపాదనలను పక్కన పెట్టి త్వరలోనే ఎన్నికలు జరిపిస్తామని నిడదవోలులో ప్రకటించారు. ఈవిధానాన్ని రాజమహేంద్రవరానికి కూడా వర్తింపజేయాలని ఔత్సాహిక అభ్యర్థులు కోరుతున్నారు. రాజమహేంద్రవరం నగరానికి వచ్చినపుడు అదే నారాయణ ఆగస్టులో నగరపాలక సంస్థ ఎన్నికలు జరిపిస్తామని ప్రకటించారు. ఆగస్టు నెల ఎప్పుడో వెళ్లిపోవడం గమనార్హం.
అయితే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు ప్రజాప్రతినిధులు తలుచుకుంటే ఎన్నికలు నిర్వహించడం పెద్ద సమస్య కాదు. న్యాయపరమైన సమస్యలున్న గ్రామాల విలీనాన్ని పక్కనపెట్టి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తే అధికార యంత్రాంగం ఇటీవల విలీనమైన లాలాచెరువు పంచాయితీ సహా వివాదరహిత డివిజన్లతో కలిపి ఎన్నికల నిర్వహణకు నెలరోజుల్లోనే అన్ని ఏర్పాట్లు చేయగలదు. న్యాయపరమైన సమస్యలను అధిగమించాలని భావిస్తే గ్రామ నాయకులను ఒప్పించి, కేసును ఉపసంహరింపజేయడం కూడా వారికి పెద్ద సమస్య కాదు. మొదటి నుంచి ఎన్నికలు జరిపించడం, పెత్తనాన్ని వదులుకోవడం వారికి ఇష్టం లేనట్టు కనిపిస్తోంది. అందుకే తాజాగా ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ లో కూడా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థను న్యాయపరమైన సమస్యల పేరుతో పక్కనపెట్టేసినట్లు కనిపిస్తోంది. ఈనేపథ్యంలో 2027 గోదావరి పుష్కరాలు ముగిసే వరకు కార్పొరేషన్ ఎన్నికల గురించి రాజమహేంద్రవరం ప్రజలు, ఔత్సాహిక అభ్యర్థులు మర్చిపోవడం మంచిదన్న సలహాలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్సీపి నాయకులు కూడా కార్పొరేషన్ ఎన్నికలను డిమాండ్ చేయకపోవడం ఆపార్టీ పరిస్థితికి అద్దంపడుతోంది.