వీరమల్లు నుంచి ఓజి వరకు ఊగిసలాడిన జనసైనికుడి భవిష్యత్?!

జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా పార్టీ నుంచి సస్పెండ్ అయిన అనుశ్రీ సత్యనారాయణ అనే అత్తి సత్యనారాయణ పట్టరాని…

 వీరమల్లు నుంచి ఓజి వరకు ఊగిసలాడిన జనసైనికుడి భవిష్యత్?!

జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా పార్టీ నుంచి సస్పెండ్ అయిన అనుశ్రీ సత్యనారాయణ అనే అత్తి సత్యనారాయణ పట్టరాని ఆనందంతో రాజమహేంద్రవరం జనసేన ఇన్చార్జీగా తిరిగి పగ్గాలు చేపట్టారు. ఈసందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ ను దేవుడితో పోల్చుతూ తనకు రాజకీయంగా పునర్జన్మ కల్పించారని పునర్జన్మ కల్పించారని భావోద్వేగానికి గురయ్యారు. తమ నాయకుడు ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో మేయర్ గా పోటీ చేసేందుకు కూడా సిద్ధమని ఉత్సాహంగా ప్రకటించారు. అయితే పార్టీలోని ఆయన ప్రత్యర్థులు మాత్రం కాస్తంత నిరాశ చెందారనే చెప్పవచ్చు. ఇటీవల వరకు రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో కలిసి నగరంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్న వై శ్రీనివాస్ తదితరులు అత్తి సత్యనారాయణ పునరాగమన కార్యక్రమానికి డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా బిసి సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణ పునరాగమనం రుచించినట్లు లేదన్నా ప్రచారం కూడా జరుగుతోంది.

హరిహర వీరమల్లు నుంచి పవన్ నటించిన మరో సినిమా ఓజి వరకు ఆయన రాజకీయ భవితవ్యం ఊగిసలాడిందనే చెప్పవచ్చు. హరిహర వీరమల్లు విడుదలను అడ్డుకునేందుకు ధియేటర్ల బంద్ ప్రకటించారన్న కారణంతో సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సెప్టెంబర్ 25న ఓజి విడుదలకు సరిగ్గా కొన్నిరోజుల ముందు ఆయనపై సస్పెన్షన్ ఎత్తవేయడం చర్చనీయాంశంగా మారింది. హరిహర వీరమల్లు నిరాశ పరిచినా ఓజిపై పవన్ కల్యాణ్ తో పాటు, ఆయన అభిమానులు కూడా పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఓజి డైరెక్టర్ సుజిత్ వంటి టీమ్ ఉంటే తాను రాజకీయాల్లోకి కూడా వచ్చేవాడిని కాదని పవన్ కల్యాణ్ కూడా ప్రకటించారు. ఈనేపథ్యంలో ఎలాంటి విచారణ, సంజాయిషీ కోరకుండానే అత్తి సత్యనారాయణపై సస్పెన్షన్ ఎత్తివేయడం గమనార్హం. పదుల సంఖ్యలో ధియేటర్లను నిర్వహిస్తున్న సత్యనారాయణను రాజకీయంగా కన్నా సినిమా మార్కెటింగ్ కోణంలోనే భేషరతుగా పార్టీలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది.
సినిమా మార్కెటింగ్ లో కూడా ఆయన కీలక భూమిక పోషిస్తున్నట్లు సమాచారం. డివివి దానయ్య నిర్మాతగా కాకినాడ జనసేన ఎంపి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ భాగస్వామిగా ఓజి చిత్రాన్ని నిర్మించినట్లు చెబుతున్నారు. అత్తి సత్యనారాయణ ఈవ్యవహారం ద్వారా పవన్ కల్యాణ్ రాజకీయాల కన్నా వ్యాపార ప్రయోజనాలే తనకు ముఖ్యమన్న వైఖరిని ప్రదర్శించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలి 10రోజులు ఓజి సినిమా బెన్ ఫిట్ షో టిక్కెట్లను రూ. 1000కి విక్రయించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. మరోవైపు పవన్ అభిమానులు లక్షలాది రూపాయలకు తొలి టిక్కెట్ ను దక్కించుకునేందుకు పోటీ పడటం విశేషం. ఈసొమ్ములన్నీ ఎవరి జేబుల్లోకి చేరుతాయన్నదే అభిమానులు, సామాన్య ప్రజల్లో వినిపిస్తున్న ప్రశ్న.

Leave a Reply