సెంచరీ వైపు పరుగులు తీస్తున్న 81 ఏళ్ల నవయువ ఎమ్మెల్యే ఆరోగ్య రహస్యాలు!
ఏడుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన 80ఏళ్ల గోరంట్ల బుచ్చయ్యచౌదరి చలాకీ తనం ఇప్పటికీ మిస్టరీయే. ఆయన ఆరోగ్యంపై అందరికీ ఆసక్తే. ఆయనకు మరో పదేళ్ల వరకు ఆరోగ్యపరంగా ఎలాంటి…
ఏడుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన 80ఏళ్ల గోరంట్ల బుచ్చయ్యచౌదరి చలాకీ తనం ఇప్పటికీ మిస్టరీయే. ఆయన ఆరోగ్యంపై అందరికీ ఆసక్తే. ఆయనకు మరో పదేళ్ల వరకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఇటీవల నిర్వహించిన వార్షిక పరీక్షల్లో తేలింది. వచ్చే నెల 15వ తేదీన జన్మదినాన్ని జరుపుకోనున్న ఆయన కూడా తన తండ్రి వీరయ్యచౌదరి లాగే సెంచరీ దాటేస్తారేమో. వీరయ్యచౌదరి 105 ఏళ్ల వయస్సులో కాలధర్మం చెందారు. ఆయన సోదరుడు శాంతారావు 57ఏళ్ల వయస్సులో గతంలోనే మరణించగా, చిన్న సోదరుడు, గతంలో గోరంట్లకు కుడి భుజంగా వ్యవహరించిన రాజేంద్ర ప్రసాద్ అనారోగ్యానికి గురైన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కన్నా సీనియర్ అయిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఇప్పటికీ నవయువకుడిలా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం చలాకీగా పరుగులు తీయడం చూసేవారిని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. అసెంబ్లీలోనూ, బయటా ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇస్తూ, రాజకీయాల్లో కూడా ఆయన ఎంతో యాక్టివ్ గా ఉంటారు. రాజకీయాల్లో గోరంట్లను ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అసెంబ్లీలో వ్యాఖ్యానించడం విశేషం. గోరంట్ల రాష్ట్ర రాజకీయాలతో పాటు రాజమహేంద్రవరం సిటీ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తూ సొంత పార్టీలోని ప్రత్యర్థుల్ని కూడా ఇప్పటికీ ఆయన ముప్పతిప్పలు పెట్టడం గమనార్హం. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో గోరంట్లతో పాటు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాత్రమే రాజకీయాల్లో చురుగ్గా కొనసాగుతున్నారు. గోరంట్ల సహచరులు, జూనియర్లు, ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినపుడు జన్మించిన నాయకులు కూడా ఆరోగ్యపరంగా గోరంట్లతో సమానంగా పోటీపడలేకపోతున్నారు. కొంతమంది మూలకు పడ్డారు. ఇంతకీ ఆయన చలాకీతనం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలు, దినచర్య ఏమిటని బుచ్చయ్యచౌదరి సోదరుడు శాంతారావు కుమారుడు, గోరంట్ల రాజకీయ వారసుడు, ప్రముఖ నరాల వైద్యుడు రవిరామ్ కిరణ్ ను ఆరా తీయగా, ఆసక్తికర విషయాలు తెలిసాయి. గోరంట్లకు వ్యక్తిగత వైద్యుడు కూడా రవిరామ్ కిరణే కావడం విశేషం.
గోరంట్ల బుచ్చయ్యచౌదరి వయస్సు 83ఏళ్లని రవిరామ్ కిరణ్ చెప్పారు. అయితే గూగుల్ వెతికితే 80ఏళ్లుగా తేలింది. క్రమశిక్షణగా జీవించే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రతీ రోజూ ఉదయం 6గంటలకు నిద్ర లేచి ఇంటి పెరట్లోనే గంట పాటు వాకింగ్ చేస్తారు. అలాగే రసాయనాలు లేకుండా కూరగాయలు, పండ్ల మొక్కలను పెంచే పనిలో పడతారు. కొద్దిసేపు ఫిజియో ఎక్సర్ సైజులు చేసిన తరువాత కాఫీ తాగుతారు. ఆయనకు కాఫీ, జామపండ్లు ఇష్టమని రవిరామ్ కిరణ్ చెప్పారు. తరువాత పత్రికలు చదివి, ఒక అరగంట పాటు ఫోన్లు చూసుకుని, మాట్లాడి, అల్పాహారం తీసుకుంటారు. అల్పాహారంలో పండ్లు, కీర దోశ, గింజలు, దోశ, ఇడ్లీ వంటివి తీసుకుంటారు. 9గంటల కల్లా బయటకు వచ్చి, సందర్శకులతో మాట్లాడి, కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిపోతారు. మధ్యలో కారులోనే పండ్ల ముక్కలు, మజ్జిగ తీసుకుంటారు. మధ్యాహ్నం 2-3గంటల మధ్య ఇంటికి చేరుకుని బ్రౌన్ రైస్ తో మధ్యాహ్న భోజనం చేస్తారు. మాంసాహారం, కూరలు, పచ్చళ్లు అన్నీ తింటారు. గంటపాటు నిద్రపోయి, పండ్ల ముక్కలు, గింజలు తిని, మళ్లీ కాఫీ తాగుతారు. సాయంత్రం 5-5.30గంటల మధ్య మళ్లీ ప్రజల్లోకి వచ్చి, రాత్రి 9.30గంటల సమయంలో ఇల్లు చేరతారు. రాత్రి పుల్కా, చపాతీ, పండ్లు తీసుకుంటారు. అయితే ఈపాటి ఆరోగ్యసూత్రాలు చాలా మంది పాటిస్తారు కానీ గోరంట్లలా చలాకీగా ఉండలేరు. చాలా మందిలాగే ఆయనకు కూడా బిపి, షుగర్ వంటి సమస్యలు ఉన్నాయి. షుగర్ నియంత్రణకు ఇన్సులిన్ తీసుకుంటారు. గతంలో ఆయనకు యాంజియో చేశారు. మోకాలు, నడుముకు ఆపరేషన్లు జరిగాయి. అయినా ఎందుకు నిత్యం హుషారుగా, ఆరోగ్యంగా కనిపిస్తారన్న అనుమానం కలుగుతుంది. గోరంట్ల బయటి ఆహారాన్ని తీసుకోరు. ఇంట్లో కూడా ఆహారాన్ని మితంగా తీసుకుంటారు. ప్రతీ ఏటా వార్షిక ఆరోగ్యపరీక్షలు చేయిస్తారు. ఇతర వ్యసనాలు ఏవీ లేవు. ఎప్పుడైనా మర్యాదపూర్వకంగా ఒక పెగ్ తీసుకుంటారట. రాజకీయాలైనా…సమస్యలైనా గడప బయటే వదిలేసి వస్తారని, అనవసరమైన విషయాలను బుర్రలోకి ఎక్కించుకోరని, క్రమశిక్షణాయుత జీవితం ఇవే ఆయన ఆరోగ్యరహస్యాలని రవిరామ్ కిరణ్ వివరించారు. క్రమశిక్షణ, మితాహారం కారణంగానే గోరంట్ల ఇప్పటికీ “ అన్ని విధాలుగా” జీవితాన్ని ఆస్వాదిస్తున్నారేమో….