లడ్డూయే కాదు…ఫుడ్డూ కల్తీయే!

ఏడాదికోసారో…రెండుసార్లో తినే తిరుమల లడ్డూయే కాదు…కానీ మనం నిత్యం కుళ్లిన మాంసాన్ని, జంతు కళేబరాల నుంచి ఉత్పత్తి చేసిన కల్తీని నూనెలతో తయారు చేసిన బిర్యానీలు, కృత్రిమ…

 లడ్డూయే కాదు…ఫుడ్డూ కల్తీయే!

ఏడాదికోసారో…రెండుసార్లో తినే తిరుమల లడ్డూయే కాదు…కానీ మనం నిత్యం కుళ్లిన మాంసాన్ని, జంతు కళేబరాల నుంచి ఉత్పత్తి చేసిన కల్తీని నూనెలతో తయారు చేసిన బిర్యానీలు, కృత్రిమ రంగులతో స్వీట్లు, ఇతర ఆహారాన్ని తీసుకుంటున్నామన్న విషయం తెలుసా…ఆఖరికి రొట్టెలు, కేకులు కూడా కాగితాలతో తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. భక్తులు సెంటిమెంట్ గా భావించే లడ్డూ కల్తీ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో రాజకీయం దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. అయితే అనారోగ్యాన్ని కలిగించే ఆహారం గురించి రాజకీయ పార్టీలు, అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం.
ఎపి మంత్రుల బృందం ఆదేశాల మేరకు రాజమహేంద్రవరంలో ఆహార భద్రతా అధికారులు, తూనికలు కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలోని హోటళ్లు, బేకరీలు, స్వీటు దుకాణాలు కలిపి మొత్తం 30 ప్రాంతాల్లో తనిఖీలు జరిపి, వీటిలో ప్రముఖ హోటళ్లు, బిర్యానీ సెంటర్లు, రెస్టారెంట్లు, స్వీటు దుకాణాలు కూడా ఉన్నాయి. ఈసందర్భంగా 20 నమూనాలను సేకరించి, పరీక్షల కోసం హైదరాబాద్ లోని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపారు. ఈతనిఖీల్లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, కోసం జంతు కళేబరాల నుంచి తీసిన కల్తీ నూనెలను వినియోగిస్తున్నట్లు తేలింది. అలాగే స్వీట్లు, ఇతర ఆహార పదార్థాల తయారీ కోసం కృత్రిమ రంగులు వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. బిర్యానీల తయారీకి వినియోగించే మసాలా పేస్టులు కూడా కల్తీయే కావడం ఆందోళన కలిగించే అంశం. గుడ్లు, బ్రెడ్లు, కూడా కల్తీయే. ఆయా హోటళ్లు, రెస్టారెంట్లలోని అపరిశుభ్రమైన స్టోర్ రూమ్ లు, ఫ్రిడ్జ్ లలో పాడైపోయిన గుడ్లు, నిల్వ కుళ్లిన మాంసాన్ని అధికారులు గుర్తించారు. గతంలో హైదరాబాద్ లో కూడా ఈతరహా దాడులు జరగ్గా, మాంసం సహా మసాలా అన్ని కల్తీగా తేలింది. ప్రముఖ హోటళ్లలోనే ఈ పరిస్థితి ఉంటే రోడ్లపై విక్రయించే బజ్జీలు, టిఫిన్లు ఏవిధంగా తయారు చేస్తారన్నది ఊహించుకోవచ్చు. వేగీవేగీ నూనె అవిరయ్యే వరకు అదే నూనెలను ఉపయోగిస్తారు. ఇకపై ఆబగా జొమాటో…స్విగ్గీల్లో ఆర్డర్లు పెట్టే వారు ఈవిషయాన్నిదృష్టిలో ఉంచుకుంటే మంచిది. లేనిపక్షంలో జీర్ణకోశ సమస్యలు, కేన్సర్ల వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాజకీయ నాయకులు, అధికారులు కూడా అప్పుడప్పుడూ తినే తిరుమల లడ్డూలతో పాటు, రోజూ తినే ఆహార పదార్థాల నాణ్యతపై దృష్టిసారిస్తే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినవారవుతారు.

Leave a Reply