తాజా మేయర్ అభ్యర్థికి ఎమ్మెల్యే వాసు మద్దతు?!
ఇప్పట్లో జరుగుతాయో లేదో తెలియదు గానీ కూటమి పార్టీల నుంచి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థుల జాబితా పెరిగిపోతోంది. ఈసారి ప్రత్యక్ష విధానంలో జరిగే మేయర్…
ఇప్పట్లో జరుగుతాయో లేదో తెలియదు గానీ కూటమి పార్టీల నుంచి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థుల జాబితా పెరిగిపోతోంది. ఈసారి ప్రత్యక్ష విధానంలో జరిగే మేయర్ ఎన్నికల రేసులో ఉన్నామని గుడా మాజీ చైర్మన్, టిడిపి సీనియర్ నాయకుడు గన్ని కృష్ణ, మరో సీనియర్ టిడిపి నాయకుడు యర్రా వేణుగోపాలరాయుడు ఇప్పటికే ప్రకటించారు. గన్ని కృష్ణ మేయర్ సీటుపై చాలా ఆశలే పెట్టుకున్నారు. 75ఏళ్లు పైబడిన తనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇదే తన చివరి పోరాటమని కూడా స్పష్టం చేశారు. మరోవైపు కూటమిలోని జనసేన రాజమహేంద్రవరం ఇన్చార్జి అత్తి సత్యనారాయణ తాను కూడా మేయర్ రేసులో ఉన్నట్లు చెప్పారు. అదే పార్టీకి చెందిన వై శ్రీనివాస్ కూడా మేయర్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరగడంతో ఈవిషయమై ఆపార్టీలో అంతర్గత ఆధిపత్యపోరు సాగుతోంది. ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే, రుడా చైర్మన్ వంటి పదవులు టిడిపికి, ఎంపి, ఎమ్మెల్సీ పదవులు బిజెపికి కేటాయించడంతో ఈసారి జనసేన వంతు అని, మేయర్ సీటును జనసేనకే కేటాయించాలని ఆపార్టీ నాయకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గానీ, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎంపి దగ్గుబాటి పురందేశ్వరి గానీ మేయర్ అభ్యర్థిగా ఎవరికి మద్దతు ఇస్తామన్న విషయాన్ని బహిర్గతం చేయకుండా గుంభనంగా ఉండటం గమనార్హం. వారికి మేయర్ ఎన్నికలు జరగడం ఇష్టం లేదని, నగరపాలక సంస్థకు పాలకవర్గం ఏర్పడితే కీలకమైన పుష్కరాల సమయంలో తమ ప్రాధాన్యత తగ్గుతుందని భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది.
ఈనేపథ్యంలో ఎమ్మెల్యే వాసుకు అత్యంత సన్నిహితుడు, రాజమహేంద్రవరంలో లిక్కర్ సిండికేట్ లో సభ్యుడిగా ప్రచారం పొందుతున్న నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు తాజాగా తాను మేయర్ రేసులో ఉన్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. బిసి సామాజికవర్గానికి చెందిన తాను ఆదిరెడ్డి కుటుంబం జైల్లో ఉన్నప్పుడు ఎంతో సమన్వయంతో ఆదిరెడ్డి కుటుంబానికి, పార్టీకి సేవ చేశానని చెప్పుకున్నారు. అయితే తన సీటు విషయం అధిష్టానం ఇష్టమని కూడా సన్నాయినొక్కులు నొక్కారు. వాసుకు తెలియకుండానే రాంబాబు మేయర్ అభ్యర్థిగా ప్రకటించుకున్నారా అన్న చర్చ సాగుతోంది. ఒకవేళ టిడిపికి మేయర్ సీటు కేటాయిస్తే కూటమిలో విభేదాలు పొడసూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మజ్జి రాంబాబు మేయర్ అభ్యర్థిగా ప్రకటించుకున్న మరునాడే రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల విలీన గ్రామాలను కలిపే మేయర్ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేయడం గమనార్హం. ఈదిశగా తెరవెనుక ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 3వ తేదీన హైకోర్టులో విలీన గ్రామాలకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా కీలక పరిణామం చోటు చేసుకుంటుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా డిసెంబర్ లోపు జరపడం సాధ్యం కాదని చెబుతున్నారు. గ్రామాల విలీనం జరిగితే డివిజన్ల డీ లిమిటేషన్ జరిగి రిజర్వేషన్లు కూడా మారే అవకాశాలున్నాయి. రోస్టర్ ప్రకారం ప్రస్తుతం ఓసి జనరల్ రిజర్వేషన్ మారిపోతుంది. మరోవైపు పురపాలకశాఖ ప్రభుత్వం వివాదాస్పద గ్రామాలను పక్కనపెట్టి యధాస్థితిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. సిటీ ఎమ్మెల్యే కూడా 50 డివిజన్లకే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే ఇప్పటికే విలీనమైన లాలాచెరువు పంచాయితీని నగరపాలక సంస్థ నుంచి పక్కనపెట్టాల్సి ఉంటుంది. ఎన్నికలు, గ్రామాల విలీనంపై పరస్పర విరుద్ధమైన ప్రకటనలు, ఆలోచనల నేపథ్యంలో అసలు పుష్కరాల లోగా ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ జరిగినా…టిడిపి సాంప్రదాయం ప్రకారం కొత్త ముఖాన్ని మేయర్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.
మా వార్తలు నచ్చిన పాఠకులు వెబ్ సైట్ కు అడ్వర్టైజ్ మెంట్లు వచ్చే వరకు ఒక్కో వార్తకు కేవలం రూ. 2/ 9491659287 నెంబర్ కు ఫోన్ పే చేసి ప్రోత్సహించగరమని మనవి.
If our news items liked you please send only Rs 2/ by phone pay to 9491659287 for Encourage. until we get Adv.