రేసులో మిగిలిన రేలంగి….చివరి నిమిషంలో బిజెపిలో చేరేందుకు సిద్ధమైన డాక్టర్?!
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థను కూటమి పొత్తుల్లో భాగంగా బిజెపికి కేటాయించారు. దీంతో మాజీ ఔత్సాహిక మేయర్లతో పాటు, తాజా ఔత్సాహికులు కూడా రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.…
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థను కూటమి పొత్తుల్లో భాగంగా బిజెపికి కేటాయించారు. దీంతో మాజీ ఔత్సాహిక మేయర్లతో పాటు, తాజా ఔత్సాహికులు కూడా రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మేయర్ రేసులో చివరికి బిజెపి సీనియర్ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ రేలంగి శ్రీదేవి మిగిలారు. రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో మొన్నటి వరకు టిడిపి సీనియర్ నాయకులు ఓసి సామాజికవర్గానికి చెందిన గన్ని కృష్ణ, యర్రా వేణుగోపాలరావు, బిసి సామాజికవర్గం నుంచి మజ్జి రాంబాబు, జనసేన తరుపున అత్తి సత్యనారాయణ, వై శ్రీనివాస్ మేయర్ గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే రాజమహేంద్రవరంను ఎస్సీలకు కేటాయించడంతో తాజాగా టిడిపి నాయకుడు కాశి నవీన్ కుమార్, రాజమహేంద్రవరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పిడుగు విజయభాస్కర్ పేర్లు వినిపించాయి. అయితే పొత్తుల్లో భాగంగా రాజమహేంద్రవరం సీటును బిజెపికి కేటాయించడంతో సీనియర్ నాయకురాలు రేలంగి శ్రీదేవి పేరు దాదాపు ఖరారైంది. ఓసి జనరల్ అయితే బిజెపి పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు బొమ్ముల దత్తు పోటీ చేయాలని భావించారు. కనీసం డిప్యుటీ మేయర్ గా నైనా రేసులో ఉండాలని సిద్ధమయ్యారు. పార్టీ అదిష్టానం కూడా దత్తు ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించింది. సీటును ఎస్సీలకు కేటాయించడంతో చివరకు దత్తు చెల్లాయిగా పిలిచే రేలంగి శ్రీదేవి పేరును ఖరారు చేశారు.
మరోవైపు మొన్నటి వరకు టిడిపిలో ఉన్న దివంగత కాపునేత వంగవీటి రాధాకృష్ణ ఎన్నికలకు ముందు జనసేనలో చేరడం, విజయవాడ మేయర్ సీటును జనసేనకు కేటాయించడంతో రాధాకృష్ణ జనసేనలో చేరడం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ మేయర్ సీటు కోసమే రాధాకృష్ణ జనసేనలో చేరారన్న ప్రచారం జరిగింది. అలాగే ఇప్పటి వరకు ఏ పార్టీకి చెందని డాక్టర్ పిడుగు విజయభాస్కర్ టిడిపి తరుపున రాజమహేంద్రవరం మేయర్ గా పోటీకి సిద్ధమయ్యారు. సీటు బిజెపికి కేటాయించడంతో ఎలాగైనా మేయర్ రేసులో ఉండాలని బిజెపి సీటు కోసం కూడా చివరి వరకు ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది. బిజెపికి చెందిన యువనాయకుడు విజయభాస్కర్ ను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ను కలిసేందుకు తీసుకెళ్లగా, ఆయనను కలిసేందుకు కూడా మాధవ్ ఇష్టపడలేదన్న ప్రచారం జరుగుతోంది. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గానీ, పార్టీ అధిష్టానం గానీ పార్టీయేతర వ్యక్తులకు సీటు కేటాయించేందుకు అంగీకరించలేదని సమాచారం. మరోవైపు తమకు ఎస్సీల ఓట్లు పడవన్న ఉద్దేశంతో ఎస్సీలకు కేటాయించిన స్థానంలో పోటీ చేసేందుకు బిజెపి సముఖత చూపలేదన్న ప్రచారం జరిగింది. ఈనేపథ్యంలో కూటమిలోని టిడిపి, జనసేన ఓట్లు ఏమేరకు బిజెపికి బదిలీ అవుతాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజమహేంద్రవరం బిజెపి గెలుపు స్థానిక ఎంపి దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి సవాల్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
———————
మా వార్తలు నచ్చిన పాఠకులు వెబ్ సైట్ కు అడ్వర్టైజ్ మెంట్లు వచ్చే వరకు 9491659287 నెంబర్ కు మీకు తోచిన మొత్తాన్ని ఫోన్ పే చేసి ప్రోత్సహించగరమని మనవి.
If our news items liked you please send by phone pay to 9491659287 As your like for Encourage to us. until we get Adv.