ఔత్సాహిక మేయర్లకు ఆశాభంగం!….మారిన రిజర్వేషన్ తో మరో చక్రవర్తి తప్పదా?!
తామే మేయర్ అభ్యర్థులమంటూ ఊరికి ముందు ప్రచారం చేసుకున్న కూటమి పార్టీల్లోని నాయకులకు తాజా రిజర్వేషన్లు ఆశాభంగం కలిగించాయి. ఇదే తనకు చివరి అవకాశం అంటూ టిడిపి…
తామే మేయర్ అభ్యర్థులమంటూ ఊరికి ముందు ప్రచారం చేసుకున్న కూటమి పార్టీల్లోని నాయకులకు తాజా రిజర్వేషన్లు ఆశాభంగం కలిగించాయి. ఇదే తనకు చివరి అవకాశం అంటూ టిడిపి సీనియర్ నాయకుడు గన్ని కృష్ణ మేయర్ అభ్యర్థిత్వానికి సిద్ధమై రెండేళ్ల ముందు నుంచే పార్టీ అధిష్టానంతో పాటు, స్థానికంగా ఉండే పలు పార్టీల నాయకులను కూడా కలిసి మద్దతు కోరారు. గ్రామాల విలీనానికి వ్యతిరేకంగా కేసులు వేసిన వారిని కూడా ఉపసంహరించేలా ఒప్పించే ప్రయత్నం చేశారు. మరో సీనియర్ నాయకుడు యర్రా వేణుగోపాలరాయుడైతే భారీ హోర్డింగ్ లతో ముందస్తు ప్రచారం చేసుకున్నారు. యర్రా వేణు దూకుడుతో ఎక్కడ వెనుకబడిపోతానోనన్న భయంతో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మద్దతుతో నగర టిడిపి అధ్యక్షుడు మజ్జి రాంబాబు కూడా తానూ మేయర్ రేసులో ఉన్నానంటూ నాయకులందర్నీ కలుసుకుని, మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. అధిష్టానం ప్రమేయం లేకుండానే ఒకవేళ ఎస్సీలకు రిజర్వు అయితే పక్కనే ఉన్న కాశి నవీన్ కుమార్ పోటీ చేస్తారంటూ ప్రకటించేయడం విశేషం. మరోవైపు అప్పటికీ రిజర్వేషన్ ఖరారు కాకపోవడంతో గన్ని కృష్ణకు ఇంటి పోరు కూడా ప్రారంభమైంది. కొంతమంది కమ్మనాయకులతో కలిసి ఆయన సోదరుడు డాక్టర్ గన్ని భాస్కరరావు రాజమహేంద్రవరం ఎంపి దగ్గుబాటి పురందేశ్వరిని కలిసి తన కుమార్తెకు సీటు ఇవ్వాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని బట్టి గన్ని కృష్ణకు మేయర్ సీటు విషయంలో ఆయన సోదరుడి నుంచే మద్దతు లభించలేదా అన్న విశ్లేషణలు, వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కూటమిలోని జనసేన పార్టీ రాజమహేంద్రవరం నియోజకవర్గ ఇన్చార్జి అత్తి సత్యనారాయణ కూడా మేయర్ పీఠంపై భారీ ఆశలే పెట్టుకున్నారు. జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీనివాస్ కూడా మేయర్ రేసులో ఉన్నానంటూ ఉత్సాహం చూపించారు. బిజెపి నాయకులు మాత్రం గుంభనంగా ప్రయత్నాలు చేసుకున్నారు. ఈవిషయంలో బిజెపి సీనియర్ నాయకుడు బొమ్ముల దత్తు ముందంజలో ఉండి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మద్దతు కూడా సాధించారని చెబుతున్నారు. 2002 నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ కవికొండల శ్రీనివాసరావు కూడా మేయర్ పదవికి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపించారు. తాజా రిజర్వేషన్ ఖరారు ఔత్సాహిక మేయర్ల ఉత్సాహంపై నీళ్లు చల్లింది.
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థగా ఆవిర్భవించిన తరువాత తొలిసారి మేయర్ స్థానాన్ని ఎస్సీలకు కేటాయించారు. విశాఖపట్నంనకు చెందిన దివంగత ఎంఎస్ చక్రవర్తిని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి రంగంలోకి దింపి, గెలిపించారు. అప్పటికీ చక్రవర్తి నగర ప్రజలకు అపరిచితులు. అప్పుడు మేయర్ ఎన్నికలు ప్రత్యక్ష విధానంలో జరిగాయి. ఈసారి కూడా మేయర్ ఎన్నికలు ప్రత్యక్ష పద్దతిలో జరగనున్నాయి. తాజాగా మరోసారి ఎస్సీలకు కేటాయించడంతో కూటమి మేయర్ అభ్యర్థిత్వంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి కూడా అనూహ్యంగా చక్రవర్తి లాంటి నాయకుడ్ని కూటమి రంగంలోకి దింపుతుందా లేక స్థానిక నాయకులను పోటీలో దించుతుందా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. కూటమిలో మేయర్ అభ్యర్థిత్వానికి తగిన ఆర్థిక, అంగబలం ఉన్న నాయకులు కానరావడం లేదన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. అయితే టిడిపి నాయకులు కాశి నవీన్ కుమార్, డాక్టర్ పిడిగు విజయభాస్కర్ వంటి వారు మేయర్ గా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కాశి నవీన్ కుమార్ కు మేయర్ స్థాయి లేదని, ఆయన ఒక మహిళతో మాట్లాడిన ఆడియో క్లిప్ కూడా విడుదలకు సిద్ధంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. పొత్తుల్లో భాగంగా ఒకవేళ బిజెపికి సీటు కేటాయిస్తే సీనియర్ నాయకురాలు రేలంగి శ్రీదేవి పేరు గట్టిగా వినిపిస్తోంది. స్థానిక నాయకులతో పాటు, రాష్ట్ర నాయకత్వం కూడా ఆమె అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగా ఉన్నట్లు బిజెపి వర్గాలు చెబుతున్నారు. మేయర్ ఎన్నికల పట్ల కూటమి నాయకుల్లో ఉన్న ఉత్సాహం ప్రతిపక్ష వైసిపిలో కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. అయితే మాజీ జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, మాజీ ఎంపి జివి హర్షకుమార్ చిన్న కుమారుడు సుందర్, నక్కా శ్రీనగేష్ వంటి వారు పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. వైసిపి కూడా అనూహ్యంగా కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపే అవకాశాలు లేకపోలేదు.
————————
మా వార్తలు నచ్చిన పాఠకులు వెబ్ సైట్ కు అడ్వర్టైజ్ మెంట్లు వచ్చే వరకు ఒక్కో వార్తకు 9491659287 నెంబర్ కు మీకు ఇష్టం వచ్చిన మొత్తాన్ని ఫోన్ పే చేసి ప్రోత్సహించగరమని మనవి.
If our news items liked you please send by phone pay to 9491659287 As your like for Encourag to us. until we get Adv.