తుగ్లక్ విలీనం…వీడని విలీన చిక్కుముడి…సుప్రీంకోర్టు చేరిన పంచాయితీ!..

పాలకుల తప్పిదమో లేక ఒత్తిళ్లో ….లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిందో తెలియదు గానీ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో గ్రామాల విలీన వ్యవహారం తుగ్లక్ పాలనను తలపిస్తోంది. నగరపాలక సంస్థలో…

 తుగ్లక్ విలీనం…వీడని విలీన చిక్కుముడి…సుప్రీంకోర్టు చేరిన పంచాయితీ!..

పాలకుల తప్పిదమో లేక ఒత్తిళ్లో ….లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిందో తెలియదు గానీ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో గ్రామాల విలీన వ్యవహారం తుగ్లక్ పాలనను తలపిస్తోంది. నగరపాలక సంస్థలో ధవలేశ్వరం, వేమగిరి, బొమ్మూరు, రాజవోలు, హుకుంపేట, కాతేరు, పిడింగొయ్యి, శాటిలైట్ సిటీ, వెంకటనగరం, తొర్రేడు గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం ఇటీవల జిఓ జారీ చేసింది. అలాగే కోలమూరు, దివాన్ చెరువు సహా కొన్ని గ్రామాలను నగరపాలక సంస్థ పరిధి నుంచి తొలగించారు. పక్కనే ఉన్న గ్రామాలను వదిలేసి, కిలోమీటర్ల మేర దూరంలో ఉన్న గ్రామాలను నగరపాలక సంస్థలో విలీనం చేయడం విడ్డూరంగా ఉంది. కొన్ని గ్రామాలు దాదాపు రాజమహేంద్రవరంలో భౌగోళికంగా…అభివృద్ధిపరంగా కలిసిపోయినా వాటిని పక్కనపెట్టేశారు. దీనికి ఉదాహరణ రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని కోలమూరు పంచాయితీ. కాతేరు, కోలమూరు పంచాయితీలు దాదాపు కలిసే ఉంటాయి. మరోవైపు ఎక్కడో వెంకటనగరాన్ని రాజమహేంద్రవరంలో విలీనం చేయడం గమనార్హం. కోలమూరు గ్రామాన్ని రాజమహేంద్రవరంలో విలీనం చేయకపోతే విలీన ప్రక్రియ అసంపూర్ణంగానే ఉంటుంది. గ్రామాల విలీనానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైసిపి నాయకుడు నక్కా రాజబాబు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. మరోవైపు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థను గ్రేటర్ గా విస్తరించి, ఎన్నికలు జరిపి అభివృద్ధి చేస్తామని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి చెప్పారు. అదే కూటమిలోని జనసేన పార్టీకి చెందిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజానగరం నియోజకవర్గంలోని గ్రామాలను నగరపాలక సంస్థలో విలీనం చేసేది లేదని స్పష్టం చేయడం గమనార్హం. కోలమూరు రాజమహేంద్రవరంలో విలీనం కాకపోతే పాలనాపరంగా…రాజకీయంగా ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈవిషయాన్ని విస్మరిస్తే మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు కొంతమంది సిద్ధంగా ఉన్నారు. అదే జరిగితే మరోసారి ఎన్నికలు వాయిదా పడే అవకాశాలుంటాయి.
మరోవైపు హైకోర్టులో కేసు వీగిపోవడంతో పరిసర 10 గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తున్న స్థానిక నాయకులు నక్కా రాజబాబు, వల్లేపల్లి సుబ్రహ్మణ్యం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నగరపాలక సంస్థ ఎన్నికలపై మరోసారి చిక్కుముడి పడింది. ఇప్పటికే బిసిలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జిఓలను హైకోర్టు కొట్టివేయడంతో ఎపి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా గ్రామాల విలీనంపై కూడా సుప్రీంను ఆశ్రయించడంతో ఈకేసులు తేలే వరకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు.

———————
మా వార్తలు నచ్చిన పాఠకులు వెబ్ సైట్ కు అడ్వర్టైజ్ మెంట్లు వచ్చే వరకు ఒక్కో వార్తకు కేవలం రూ. 2/ 9491659287 నెంబర్ కు ఫోన్ పే చేసి ప్రోత్సహించగరమని మనవి.
If our news items liked you please send only Rs 2/ by phone pay to 9491659287 for Encourage. until we get Adv.

Leave a Reply