కందుల వర్సెస్ వాసు…కొనసాగుతున్న కోల్డ్ వార్?!
ఎపి పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాజమహేంద్రవరం వేదికగా తొలిసారిగా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి…
ఎపి పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాజమహేంద్రవరం వేదికగా తొలిసారిగా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి జగ్గంపేట నుంచి టిడిపి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, అనపర్తి నుంచి బిజెపికి చెందన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నగరంలోనే ఉండే బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరయ్యారు. రాజధాని అమరావతి నుంచి కూడా ఐఏఎస్ అధికారులు తరలివచ్చారు. కానీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ నగరంలోనే ఉండే ఆదిరెడ్డి శ్రీనివాస్ గైర్హాజరు కావడం టిడిపి, జనసేన, బిజెపి కూటమి వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాసు ఈకార్యక్రమానికి గైర్హాజరు కావడం వారి మధ్య నెలకొన్న విభేదాలకు తార్కాణమని అభివర్ణిస్తున్నారు. జనసేన పార్టీకి చెందిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా ఈకార్యక్రమానికి గైర్హాజరయ్యారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎంపి దగ్గుబాటి పురందేశ్వరి నగరంలో లేకపోవడం వల్ల హాజరుకాలేకపోయారని తెలుస్తోంది. మొత్తానికి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలకు హాజరుకావడం గమనార్హం.
రాజమహేంద్రవరం నగరానికి చెందిన కందుల దుర్గేష్…కూటమి పొత్తుల్లో భాగంగా నిడదవోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి ఎపి పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా నియమితులయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. దుర్గేష్ జనసేనలో చేరకముందు వైసిపి, కాంగ్రెస్ పార్టీల తరుపున రాజమహేంద్రవరం ఎంపి, రూరల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. వివాదరహితుడు, ప్రియభాషిగా పేరొందిన దుర్గేష్ కు రాజమహేంద్రవరంలో కూడా కేడర్, అభిమానులు ఉన్నారు. మంత్రిగా ఉన్నా టిడిపి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కారణంగా నిడదవోలులో…ఇటు రాజమహేంద్రవరంలో పెద్దగా రాజకీయాలు చేసే అవకాశం ఉండటం లేదన్న వాదన వినిపిస్తోంది. కనీసం నగర జనసేన పార్టీ వ్యవహారాల్లో కూడా దుర్గేష్ వేలు పెట్టలేకపోతున్నారు. గతంలో సీనియర్ ఎమ్మెల్యేగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారని కూటమి కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. నాడు గోరంట్లను రాజమహేంద్రవరం రాజకీయాల్లో వేలుపెట్టకుండా ఆదిరెడ్డి వర్గీయులు గట్టిగా అడ్డుకున్నారు. దీంతో ఆయన నగరపాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్ లోని టిడిపి కార్యాలయాన్ని కూడా తెరుచుకోలేని పరిస్థితిని కల్పించారు. ఇప్పుడు దుర్గేష్ పరిస్థితి కూడా అలాగే ఉంటుందా అన్న చర్చ సాగుతోంది. గోదావరి పుష్కరాల పనులే కందుల దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు మధ్య చిచ్చుకు కారణమయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. గోదావరి పుష్కరాల సందర్భంగా దుర్గేష్ నేతృత్వం వహిస్తున్న పర్యాటకశాఖ ఆధ్వర్యంలో గోదావరిగట్టున కోట్లాది రూపాయలతో చేపట్టిన అఖండ గోదావరి పనుల్లో స్థానిక ఎమ్మెల్యే వాసు ప్రమేయం లేకుండా చేయడం, ఈపనుల్లో కొన్నింటిని దుర్గేష్ సన్నిహితుడు దక్కించుకోవడం వంటి కారణాలతో వారి మధ్య విభేదాలను రాజేశాయని చెబుతున్నారు. గతంలో కలెక్టర్ ఇతర అధికారులతో దుర్గేష్ చేపట్టిన ఈపనుల పరిశీలనకు కూడా వాసును ఆహ్వానించకపోవడంతో వాసు కినుక వహించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాటి నుంచి దుర్గేష్, వాసు మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోందని ప్రచారం జరుగుతోంది. దాని పర్యావసనమే వాసు ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలకు డుమ్మా కొట్టడమని విశ్లేషిస్తున్నారు. మరోవైపు నగరానికి చెందిన జనసేన నేతలు అత్తి సత్యనారాయణ, వై శ్రీనివాస్ లు ఎమ్మెల్యే వాసు వెంట తిరగడం గమనార్హం. మంత్రి, ఎమ్మెల్యే మధ్య నెలకొన్న విభేదాలు ఇలాగే కొనసాగితే రానున్న కార్పొరేషన్ ఎన్నికలపై ఆ ప్రభావం కొంతైనా ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
——————-
మా వార్తలు నచ్చిన పాఠకులు వెబ్ సైట్ కు అడ్వర్టైజ్ మెంట్లు వచ్చే వరకు ఒక్కో వార్తకు కేవలం రూ. 2/ 9491659287 నెంబర్ కు ఫోన్ పే చేసి ప్రోత్సహించగరమని మనవి.
If our news items liked you please send only Rs 2/ by phone pay to 9491659287 for Encourage. until we get Adv.