క్వారీ నుంచి కౌన్సిల్ కు….మేయర్ అభ్యర్థిగా నా కన్నా సమర్థులెవరు?! రేలంగి శ్రీదేవి
రాజమహేంద్రవరం మేయర్ పీఠంపై ఎంతో మంది కన్నేశారు. అయితే రిజర్వేషన్లు, కూటమి సీట్ల కేటాయింపులు వారి ఆశలను గల్లంతు చేశాయి. ఈనేపథ్యంలో క్వారీ కార్మికుల కుటుంబంలో పుట్టి…
రాజమహేంద్రవరం మేయర్ పీఠంపై ఎంతో మంది కన్నేశారు. అయితే రిజర్వేషన్లు, కూటమి సీట్ల కేటాయింపులు వారి ఆశలను గల్లంతు చేశాయి. ఈనేపథ్యంలో క్వారీ కార్మికుల కుటుంబంలో పుట్టి ….మహిళా సంఘం నుంచి చారిత్రాత్మక రాజమహేంద్రవరం తొలి మహిళా పీఠంపైకి ఎక్కేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్న బిజెపి నాయకురాలు రేలంగి శ్రీదేవి తన ప్రస్థానంపై దివాకరమ్ న్యూస్ తో పంచుకున్నారు.
దాదాపు 26ఏళ్ల క్రితం మహిళా స్వయం సంఘాలకు సంబంధించి నిర్ణీత సంఘాలు లేరన్న కారణంతో నైబర్ హుడ్ కమిటీ ఎన్నికల నిర్వహణకు అభ్యంతరాలు వ్యక్తం కావడంతో నాడు బిజెపి నాయకులు బొమ్ముల దత్తు, సేనాపతి శివకుమార్ తనకు మద్దతుగా నిలిచి, నాటి కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ వద్దకు తీసుకెళ్లి ఎన్నికలు జరిగేలా కృషిచేశారని రేలంగి గుర్తు చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో నైబర్ హుడ్ కమిటీ కన్వీనర్ గా గెలవడంతో పాటు, బిజెపిలోకి అడుగుపెట్టానన్నారు. నాటి నుంచి పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి, రాష్ట్ర కార్యదర్శి, కోర్ కమిటీ సభ్యురాలిగా బిజెపిలో ఈస్థాయికి ఎదిగానని వివరించారు. ప్రస్తుతం బిజెపి పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నానని తెలిపారు.
తాను రాజమహేంద్రవరంలోనే పుట్టిపెరిగానని చెప్పారు. తన తండ్రి క్వారీలో గుమాస్తాగా, తల్లి క్వారీ కార్మికురాలిగా పనిచేసేవారని, బికామ్ వరకు చదువుకున్నానన్నారు. తన సోదరి తురకల నిర్మల తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారని తెలిపారు. తన రేలంగి భర్త నాగేశ్వరరావు వ్యాపారరంగంలో ఉన్నారని, తమకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారని, వారు ఉన్నత విద్యను అభ్యసించి, ఉద్యోగాల్లో స్థిరపడ్డారని రేలంగి పేర్కొన్నారు. తాను పూర్తిస్థాయిలో రాజకీయ నాయకురాలిగా కొనసాగేందుకు, భర్త, పిల్లల సహకారం ఎంతో ఉందని చెప్పారు.
క్వారీ కుటుంబం నుంచి వచ్చిన తనను బిజెపి ఎంతో ప్రోత్సహించిందన్నారు. 2002, 2009, 2014లో కార్పొరేటర్ గా పోటీ చేశానని వివరించారు. 2014లో ఏకైక బిజెపి కార్పొరేటర్ గా విజయం సాధించి, కౌన్సిల్ లో అడుగుపెట్టానని చెప్పారు. సుదీర్ఘకాలం నుంచి అంకిత భావంతో బిజెపిలో కొనసాగుతూ క్వారీ నుంచి కౌన్సిల్ లో అడుగుపెట్టిన తన కన్నా బిజెపిలో సమర్థులైన మేయర్ అభ్యర్థులు ఎవరున్నారని రేలంగి శ్రీదేవి ఎదురు ప్రశ్నించారు. అర్జెంట్ గా అభ్యర్థులను దిగుబతి చేసుకోవాల్సిన అవసరం తమ పార్టీకి లేదని శ్రీదేవి స్పష్టం చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఆర్థిక స్తోమత గురించి సందేహాలను ఆమె దృష్టికి తేగా..కూటమిలోని పార్టీ నేతలు, తమ పార్టీ అధిష్టానం, నాయకులు ఆలోచన చేస్తారని, దీని గురించి తాను ఆలోచించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు, సీట్ల కేటాయింపులు పూర్తయిన వెంటనే తాను మేయర్ గా పోటీ చేయాలనుకుంటున్న విషయాన్ని పార్టీలు పెద్దలు, త్రీమెన్ కమిటీ, కోర్ కమిటీ దృష్టికి తీసుకెళ్లానని, ఇందులో ఎంపి దగ్గుబాటి పురందేశ్వరితో పాటు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా సభ్యులుగా ఉన్నారని గుర్తు చేశారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న నాయకుడికే ఈసారి సీటు కేటాయించాలని పార్టీ అధిష్టానం కూడా ఒక నిర్ణయానికి వచ్చిందని, తగిన హామీ కూడా లభించిందన్నారు. అయితే తనతో పాటు, మరికొందరు పార్టీ నాయకులు సీటును ఆశిస్తున్నారని చెప్పారు. అయితే సీటు ఎవరికి కేటాయించాలన్నది పార్టీ అధిష్టానం ఇష్టమని, పార్టీ నిర్ణయమే శిరోధార్యమని రేలంగి శ్రీదేవి స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్రమోడీ వికసిత్ భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వికసిత్ ఆంధ్రప్రదేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వికసిత్ గ్రామాలు లక్ష్యంతో పనిచేస్తున్నారని, అదే స్ఫూర్తితో తాను మేయర్ గా గెలిస్తే వికసిత్ రాజమహేంద్రవరం లక్ష్యంగా నగరం సర్వతోముఖోభివృద్ధికి కృషిచేస్తానన్నారు. నగరంలో సమగ్రమైన డ్రెయినేజీ వ్యవస్థ, పరిశుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్య వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని చెప్పారు. రాజమహేంద్రవరంనకు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న భూగర్భ డ్రెనేజీ వ్యవస్థను అమల్లోకి తేవడమే తన లక్ష్యమని తెలిపారు. గోదావరి పుష్కరాల సందర్భంగా నగరంలో శాశ్వతంగా నిలిచే అభివృద్ధి పనులు చేపడతానని వివరించారు.
———————–
మా వార్తలు నచ్చిన పాఠకులు వెబ్ సైట్ కు అడ్వర్టైజ్ మెంట్లు వచ్చే వరకు 9491659287 నెంబర్ కు మీకు తోచిన మొత్తాన్ని ఫోన్ పే చేసి ప్రోత్సహించగరమని మనవి.
If our news items liked you please send by phone pay to 9491659287 As your like for Encourage to us. until we get Adv.
———————–