తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఆఫీసు ఖాళీ!
మొన్నటి వరకు ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరించే పిజిఆర్ఎస్ కార్యక్రమానికి ఇద్దరు అదనపు ఎస్పీలతో పాటు, ఎస్పీ కూడా అందుబాటులో ఉండేవారు. ఏదేని ప్రభుత్వ కార్యక్రమానికి ఎస్పీ…
మొన్నటి వరకు ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరించే పిజిఆర్ఎస్ కార్యక్రమానికి ఇద్దరు అదనపు ఎస్పీలతో పాటు, ఎస్పీ కూడా అందుబాటులో ఉండేవారు. ఏదేని ప్రభుత్వ కార్యక్రమానికి ఎస్పీ హాజరు కాలేని పరిస్థితి ఉంటే అదనపు ఎస్పీలు కానిచ్చేసేవారు. తాజాగా జరిగిన పిజిఆర్ఎస్ లో ఎస్పీ ఒక్కరే ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. యోగి వేమన జయంతి కార్యక్రమంలో స్వయంగా ఎస్పీయే పాల్గొని వేమనకు నివాళులర్పించారు. ఒక్క పోలీసు అధికారీ కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా. అటు విజయవాడ ఇటు విశాఖపట్నంకు మధ్య ఉన్న రాజమహేంద్రవరం సాంస్కృతిక, వాణిజ్య, రవాణా కేంద్రంగా ఉంది. ఇక్కడే ఎస్పీ కార్యాలయం ఉంది. అలాంటి కీలకమైన జిల్లాలోని శాంతిభద్రతలను పర్యవేక్షించే ఎస్పీ కార్యాలయం ఖాళీగా ఉండటం విశేషం. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డి నరసింహకిషోర్, ఎఆర్ ఏఎస్పీ చెంచిరెడ్డి, ఎస్బీ డిఎస్పీ మినహా మిగిలిన అధికారులు ఎవరూ లేరు. కొద్దికాలంలో పదవీ విరమణ చేయనున్న శాంతిభద్రతల విభాగం అదనపు ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. రాజమహేంద్రవరంలో ఎస్ఐగా పనిచేసి పదోన్నతిపై ఎస్పీ (పరిపాలన)గా నియమితులైన ఎన్ బిఎం మురళీకృష్ణ సొంత జిల్లాకు దగ్గరగా విజయవాడ బదిలీపై వెళ్లిపోయారు. నేర పరిశోధనా విభాగం ఏఎస్పీ పదవి విరమణ చేశారు. ఎస్పీకి కళ్లు, చెవులులా పనిచేసి స్పెషల్ బ్రాంచిలో గతంలో ఇద్దరు డిఎస్పీలు ఉండగా ప్రస్తుతం ఒక అధికారి మాత్రమే ఉన్నారు.
ఎస్పీ కార్యాలయంలో పరిస్థితి ఇలా ఉంటే క్షేత్ర స్థాయిలో కానిస్టేబుల్ నుంచి సిఐ స్థాయి వరకు పోలీసులను అజమాయిషీ చేసే పలు డిఎస్పీ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉంది. ట్రాఫిక్ వ్యవస్థను పర్యవేక్షించాల్సిన ట్రాఫిక్ పోలీసు విభాగంలో ఇద్దరు సిఐలు, ఒక డిఎస్పీ ఉండాల్సి ఉండగా, ఒక్క సిఐ మాత్రమే ఉన్నారు. శాంతిభత్రల విభాగంలో సెంట్రల్ జోన్ డిఎస్పీ పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ పనిచేసిన రమేష్ బాబు ఆగస్టు లోనే పదవీ విరమణ చేశారు. మహిళల రక్షణకు ప్రాధాన్యతనిస్తామని చెప్పుకునే మంచి ప్రభుత్వంలో దిశ పోలీసుస్టేషన్ డిఎస్పీ పోస్టు కూడా కొంతకాలంగా ఖాళీగా ఉండటం గమనార్హం. మరోవైపు గతంలో తిరుమలలో ఛీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గా పనిచేసిన సమయంలో ఎస్పీ డి నరసింహకిషోర్ తిరుమల పరకామణి కేసులో నిర్లప్తంగా వ్యవహరించారన్న అపవాదును ఎదుర్కొంటున్నారు. ఈమేరకు ఎల్లో మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఈకేసును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆయన పాలకుల దృష్టిలో ఉన్నారని, త్వరలోనే నాన్ ఫోకల్ పోస్టుకు బదిలీ అవుతారన్న ప్రచారం జరుగుతోంది.