అర్ధరాత్రి దోపిడీ దొంగల ముఠా బీభత్సం… నెల రోజుల్లోనే ఆటకట్టించిన నాటి యువ ఎస్ఐ…నేటి ఎస్పీ

ఒక పోలీసు అధికారి జీవితంలో కొన్ని కేసులు విధి నిర్వహణలో భాగం… కానీ కొన్ని కేసులు అతని ఆలోచనా విధానాన్ని, దర్యాప్తు నైపుణ్యాన్ని, ప్రజల్లో పోలీసులపై విశ్వాసాన్ని…

 అర్ధరాత్రి దోపిడీ దొంగల ముఠా బీభత్సం… నెల రోజుల్లోనే ఆటకట్టించిన నాటి యువ ఎస్ఐ…నేటి ఎస్పీ

ఒక పోలీసు అధికారి జీవితంలో కొన్ని కేసులు విధి నిర్వహణలో భాగం… కానీ కొన్ని కేసులు అతని ఆలోచనా విధానాన్ని, దర్యాప్తు నైపుణ్యాన్ని, ప్రజల్లో పోలీసులపై విశ్వాసాన్ని శాశ్వతంగా ముద్రిస్తాయి. అలాంటిదే క్రైం థ్రిల్లర్ ను తలపించే ఈ కేసు…
1992 జనవరి 3వ తేదీ అర్ధరాత్రి…అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామ శివారులోని పొలాల మధ్య ఏకాంతంగా ఉన్న అల్లా నాగేశ్వరరావు ఇంటి చుట్టూ గాఢ నిశ్శబ్దం అలుముకుంది. గ్రామమంతా నిద్రలో మునిగిపోయిన వేళ, ఎనిమిది మంది కరుడుగట్టిన దోపిడీ దొంగలు గాఢాంధకారాన్ని ఆసరాగా చేసుకుని ఆ ఇంటిని లక్ష్యంగా చేసుకుని చుట్టుముట్టారు. ముందుగా ఇంటి పక్కనే గుడిసెలో తన భార్యతో నివసిస్తున్న పరుసునాయుడిని బెదిరించి, బంధించారు. ఆ తర్వాత ఇంటి వెనుక తలుపులు పగులగొట్టి నాగేశ్వరరావు ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను కర్రలతో విచక్షణారహితంగా కొట్టి భయభ్రాంతులకు గురిచేశారు. యజమానిని బెదిరించి అల్మారాలోని తాళాలు తీసుకుని బీరువా తెరిచి సుమారు ఏడు తులాల బంగారు ఆభరణాలు, రూ.1,000 నగదు దోచుకుని క్షణాల్లో పరారయ్యారు. ఆ రోజుల్లో రూ.29,000 విలువైన ఆస్తి దోచుకెళ్లడం ఒక పెద్ద సంచలనంగా మారింది. గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.ఒక యువ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ గా నాకు ఎదురైన తొలి పెద్ద సవాల్ ఇది. ఉదయం ఫిర్యాదు అందగానే అనకాపల్లి రూరల్ పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీరంగం దివాకర్ (ప్రస్తుతం రిటైర్డ్ అదనపు ఎస్‌పీ) నాయకత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పడింది. ఆ బృందంలో యువ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నాను. పోలీసు సేవలోకి వచ్చిన కొద్దికాలమే అయినప్పటికీ, ఈ కేసు నాకు ప్రతిభను నిరూపించుకునే అవకాశంగా మారింది. సంఘటనా స్థలాన్ని అంగుళం అంగుళం పరిశీలించాను. పగిలిన తలుపులు…దుండగులు వదిలిన చిన్నచిన్న ఆనవాళ్లు…బాధితుల వాంగ్మూలాలు…దాడి జరిగిన తీరు…ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా విశ్లేషించి ఒక కీలక నిర్ణయానికి వచ్చాను .”ఇది సాధారణ దొంగతనం కాదు… నేర అనుభవం ఉన్న కరుడుగట్టిన అంతర్‌జిల్లా దోపిడీ ముఠా పని అని. ఆ కాలంలో నేటిలా సీసీ కెమెరాలు లేవు. మొబైల్ ఫోన్ లొకేషన్‌లు లేవు. సాంకేతిక ఫోరెన్సిక్ సదుపాయాలు కూడా పరిమితంగానే ఉండేవి. అందుకే కేవలం పరిశీలనా శక్తి…నేరస్థుల మనస్తత్వంపై అవగాహన…రహస్య సమాచార సేకరణ…బృంద సమన్వయమే ప్రధానం. ఆధారాలు కాదు… ఆలోచనే ఆయుధంగా భావించి దర్యాప్తు ముమ్మరం చేశాము. గతంలో నమోదైన దోపిడీ కేసులన్నింటినీ అధ్యయనం చేశాను. నేరం జరిగే విధానాన్ని చూశాను. బిట్రగుంట…మంగళగిరి…స్టూవర్టుపురం…చీరాల…ఈ ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించే కరుడుగట్టిన నేరస్థుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాము. రహస్య సమాచార వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తూ, సమాచార దాతల ద్వారా కీలక సమాచారం సేకరించాము. అనుమానితుల కదలికలపై పలు ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసి రాత్రింబవళ్లు పర్యవేక్షించాము. పట్టుదల ఫలించింది… నెల రోజుల్లోనే ముఠా అరెస్ట్. దాదాపు మూడు వారాల పాటు సాగిన నిరంతర శ్రమకు ఫలితం దక్కింది.
1992 జనవరి 24న చీరాలకు చెందిన చిరుమావిళ్ల సీతయ్య, కుంజా బాబు ఈ దోపిడీ ముఠాలో ప్రధాన నిందితులని నిర్ధారించి చాకచక్యంగా అరెస్టు చేశాము. వారి వద్ద నుంచి దోచుకున్న బంగారు ఆభరణాల్లో అధికభాగాన్ని స్వాధీనం చేసుకున్నాము. అయితే నేను అక్కడితో ఆగలేదు. అరెస్టయిన నిందితులను శాస్త్రీయంగా విచారించి, వారి ద్వారా లభించిన సమాచారంతో మిగిలిన నిందితుల కోసం విస్తృత గాలింపు చేపట్టాను. చివరకు 1992 ఫిబ్రవరి 13న వైకుంఠపురం (చీరాల)కు చెందిన మరో ప్రధాన నిందితుడు కర్రెద్దుల జానకిరావు @ గజ్జల జానకిరావును కూడా అరెస్టు చేసి మిగిలిన బంగారు ఆభరణాలను రికవరీ చేశాము. ఈ కేసులో మొత్తం 6.9 తులాల బంగారు ఆభరణాలు, అప్పటి విలువ ప్రకారం రూ.27,500 స్వాధీనం చేసుకున్నాము. దాదాపు మొత్తం దొంగిలించిన ఆస్తిని కోర్టు ద్వారా బాధితుడికి తిరిగి అందజేశాను.. రూ.1,000 నగదు మినహా మిగతా ఆస్తి మొత్తం తిరిగి చేరడం ఆ రోజుల్లో విశేషంగా నిలిచింది. ఈ సంఘటనతో ప్రజల్లో పోలీసులపై విశ్వాసం మరింత బలపడింది. ఈకేసును ఛేధించడం ద్వారా ఒక యువ అధికారిగా నా ప్రతిభకు గుర్తింపు లభించింది. సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్న రోజుల్లో… కేవలం పరిశీలనా శక్తి…నేరస్థుల మనస్తత్వంపై అవగాహన…రహస్య సమాచార సేకరణ…బృంద సమన్వయం…ఈ నాలుగు అంశాలనే ఆయుధాలుగా మార్చుకుని దర్యాప్తు నిర్వహించిన ఈ కేసు పోలీసు శాఖలో ఆదర్శంగా నిలిచింది. ఈ విజయవంతమైన దర్యాప్తులో పాలుపంచుకున్న మా బృందాన్ని అప్పటి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సివి. నరసయ్య, అప్పటి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ కె రుణ్యారావు ప్రత్యేకంగా అభినందించారు. ఈకేసును ఛేధించినందుకు గాను 1993 ఆగస్టు 1న అనకాపల్లి రూరల్ పోలీసుస్టేషన్ లో నన్నుఅభినందించి సత్కరించడం చిరస్మరణీయం.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సి.ఐ.డి.లో ఎస్‌పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న నాకు సేవా ప్రస్థానాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే, ఈ కేసు ఆయనకు ఇప్పటికీ ప్రత్యేకమైన, పదిలమైన జ్ఞాపకమే. ఇది కేవలం ఒక దోపిడీ కేసు ఛేదించిన కథ కాదు. ఒక యువ పోలీసు అధికారి తన దర్యాప్తు నైపుణ్యంతో, పట్టుదలతో, వ్యూహాత్మక ఆలోచనతో ప్రజల్లో పోలీసులపై విశ్వాసాన్ని ఎలా నిలబెట్టాడో చెప్పే స్ఫూర్తిదాయక గాథ.”పోలీసు అధికారి చేతిలో అత్యాధునిక ఆయుధాలు ఉండకపోయినా పరవాలేదు… నిజాన్ని వెతికే తపన, ప్రతి ఆనవాలను గమనించే పరిశీలనా శక్తి, చట్టంపై అచంచల నమ్మకం ఉంటే ఏ నేరస్థుడూ ఎక్కువకాలం తప్పించుకోలేడు.”

వ్యాసకర్త
అల్లూరి వెంకట సుబ్బరాజు (ప్రస్తుతం ఎస్‌పీ, సి.ఐ.డి., ఆంధ్రప్రదేశ్)

మా వార్తలు నచ్చిన పాఠకులు వెబ్ సైట్ కు అడ్వర్టైజ్ మెంట్లు వచ్చే వరకు ఒక్కో వార్తకు కేవలం రూ. 2/ 9491659287 నెంబర్ కు ఫోన్ పే చేసి ప్రోత్సహించగరమని మనవి.
If our news items liked you please send only Rs 2/ by phone pay to 9491659287 for Encourage. until we get Adv.

Leave a Reply