ఖద్దరూ…ఖాకీ….కలిస్తే అరాచకమే!
సుబ్రహ్మణ్యేశ్వరరావు నిజాయితీ కలిగిన, ముక్కుసూటి పోలీసు అధికారిగా గుర్తింపు పొందారు. ఎస్ఐ స్థాయి నుంచి రాజమహేంద్రవరంలో పలు విభాగాల్లో పనిచేసిన సుబ్రహ్మణ్యేశ్వరరావు గత ఐదేళ్లకు పైగా ఎప్పుడూ…
సుబ్రహ్మణ్యేశ్వరరావు నిజాయితీ కలిగిన, ముక్కుసూటి పోలీసు అధికారిగా గుర్తింపు పొందారు. ఎస్ఐ స్థాయి నుంచి రాజమహేంద్రవరంలో పలు విభాగాల్లో పనిచేసిన సుబ్రహ్మణ్యేశ్వరరావు గత ఐదేళ్లకు పైగా ఎప్పుడూ చూసినా బందోబస్తు డ్యూటీల్లోనో…లేక పోతే ఇన్చార్జి విధుల్లోనే కనిపిస్తారు. ఇదే విషయాన్ని ఆయనతో ప్రస్తావించగా రాజకీయ నాయకులను కలిసి పోస్టింగ్ వేయించుకోవడం తనకు ఇష్టం లేదండీ అని నిర్మొహమాటంగా చెబుతారు. పోలీసుశాఖ పనితీరుకు ఆయన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. ఆయన లాంటి మరికొంత మంది సమర్థులైన పోలీసు అధికారులు ఉన్నారు. వారంతా ప్రస్తుతం నాన్ ఫోకల్ పోస్టులతో నెట్టుకొస్తున్నారు.
రాజమహేంద్రవరంలో గత వారంరోజుల వ్యవధిలో రెండు హత్యలు జరిగాయి. ఈరెండు హత్యలూ అసంకల్పితంగా జరగలేదు. కక్ష పూరితంగానే జరిగాయి. మరో హత్య లాంటి కారు ప్రమాదం జరిగింది. ఇవన్నీ మద్యం మత్తుల్లోనే జరగడం గమనార్హం. మద్యం మత్తులో ప్రసాదిత్య మల్టీప్లెక్స్ ధియేటర్ కు వచ్చిన ఇద్దరు యువకులు ఒక మెడికోను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టారు. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ మెడికల్ విద్యార్థిని చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈపరిణామాలను బట్టి చూస్తే పోలీసులంటే రౌడీలు, ఆకు రౌడీల్లో భయం, భక్తి లేదని, అదే సమయంలో పోలీసులకు రాజకీయ నేతలంటే ఎనలేని భక్తిభావన్న విషయం స్పష్టమవుతోంది. ఇలాంటి సందర్భాల్లోనే దాదాపు రెండున్న దశాబ్దాల క్రితం రాజమహేంద్రవరాన్ని గడగడలాడించిన ఎల్ అంకయ్య, రఘువీరారెడ్డి వంటి పోలీసు అధికారులు గుర్తుకు వస్తారు. రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులను వారు తమదైన శైలిలో దారికి తెచ్చారు. అప్పటి పోలీసు అధికారులు తమకు మద్యం షాపులు, ఇతరత్రా వచ్చే నెలవారీ మామూళ్లను కూడా తిరస్కరించే వారట. నేటి వ్యవస్థలోని పోలీసు అధికారులకు ఆ స్వేచ్చ గానీ, అలాంటి ఆలోచనలు కానీ ఉన్నట్లు కనిపించడం లేదు. అలా ప్రోత్సహించే నేతలు కూడా లేరు.
దశాబ్దానికి పైగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ రాజకీయ ప్రేరేపిత వ్యవస్థగా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజమహేంద్రవరం లాంటి ప్రాంతాల్లో పోస్టింగ్ కు స్టేషన్ ను బట్టి రూ. 10-15 లక్షలు పలుకుతుంది. తమకు అనుకూలమైన పోస్టింగ్ కోసం పోలీసులు అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి ముడుపులు చెల్లించి పోస్టింగ్ లు పొందుతున్నారన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పోస్టింగ్ ల్లో కులాల ప్రాధాన్యత కూడా ఎక్కువగా కనిపిస్తుంది. రాజకీయ ఒత్తిళ్లు, లంచాలు ఇచ్చి పోస్టింగ్ లు పొందిన పోలీసులు సహజంగానే పెట్టుబడికి రెట్టింపు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. లేదా తమకు పోస్టింగ్ ఇప్పించిన నేతకు అనుకూలంగా మసులుకుంటారు. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు పోలీసులే పావులుగా మారుతున్నారు. అధికార పార్టీ నేతల సిఫార్సులతో పోస్టింగ్ లు పొందిన పోలీసు అధికారులు రాజకీయ నాయకులకు అనచరులిగా చెలామణి అయ్యే రౌడీషీటర్లు, పేకాట క్లబ్బుల నిర్వాహకులు, అసాంఘిక శక్తుల పట్ల ఉదాసీనంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బ్లేడ్ బ్యాచ్ లు, గంజాయి బ్యాచ్ లు ఈవ్యవస్థల నుంచి పుట్టుకొచ్చినవే. స్థానిక యువతను పోషించే వీధి రౌడీలే రాజకీయ నాయకుల సభలు, సమావేశాలకు జనాన్ని తోలతారు. దీంతో పరస్పర ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ నాయకులు తమ అనుచర రౌడీలపై కఠిన చర్యల విషయంలో తాము సిఫార్సు చేసిన నియమించిన పోలీసుల చేతులకు సంకెళ్లు వేస్తారు. దీంతో సమాజంలో శాంతిభద్రతల క్షీణించి, రాజమహేంద్రవరం లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈనేపథ్యంలో ఖాకీ, ఖద్దరు కలిస్తే అరాచకమే అన్న నానుడి బలపడుతోంది.
————-
మా వార్తలు నచ్చిన పాఠకులు వెబ్ సైట్ కు అడ్వర్టైజ్ మెంట్లు వచ్చే వరకు ఒక్కో వార్తకు కేవలం రూ. 2/ 9491659287 నెంబర్ కు ఫోన్ పే చేసి ప్రోత్సహించగరమని మనవి.
If our news items liked you please send only Rs 2/ by phone pay to 9491659287 for Encourage. until we get Adv.