టిడిపి డోర్ టు డోర్ కు జనసేన డుమ్మా!..టిడిపి-జనసేన బంధానికి బీటలు?

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న వేళ కూటమి పక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీల బంధానికి బీటలు వారినట్లు కనిపిస్తోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఇందుకు నిదర్శనంగా…

 టిడిపి డోర్ టు డోర్ కు జనసేన డుమ్మా!..టిడిపి-జనసేన బంధానికి బీటలు?

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న వేళ కూటమి పక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీల బంధానికి బీటలు వారినట్లు కనిపిస్తోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించిన కరపత్రాలపై జనసేనాని పవన్ కల్యాణ్, జనసేన పార్టీ ఫొటోలు వేయకపోవడంతో జనసేన నాయకులు కినుక వహించి ఈకార్యక్రమానికి డుమ్మా కొడుతున్నట్లు టిడిపి నాయకులే చెప్పడం గమనార్హం. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే ఈకార్యక్రమానికి దూరంగా ఉంటున్నట్లు జనసేన నాయకులు తమతో చెప్పారని కూడా టిడిపి నాయకులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటనపై ఏర్పాటు చేసిన కూటమి నేతల సమావేశానికి కూడా జనసేన నాయకులు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. టిడిపి జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణచౌదరి, టిడిపి ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బిజెపి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బిజెపి నాయకులు ఈసమావేశానికి హాజరయ్యారు. ఈసమావేశంలో రాజమహేంద్రవరం నియోజకవర్గ జనసేన ఇన్చార్జి అత్తి సత్యనారాయణ గానీ, రాజమహేంద్రవరం సిటీ ఇన్చార్జి వై శ్రీనివాస్ గానీ ఈసమావేశంలో కనిపించకపోవడం గమనార్హం. అయితే అంతకు ముందే రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో కలిసి ఈనాయకులిద్దరూ మీడియా సమావేశంలో పాల్గొని, ప్రియాంక ఘటనపై స్పందించారు.
రాజమహేంద్రవరం పేపరుమిల్లు గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలోనే కూటమిలో బీటలు వారినట్లు భావిస్తున్నారు. ఈఎన్నికల్లో కూటమిలోని టిడిపి, జనసేన, బిజెపి వేరువేరు కూటముల తరుపున పోటీ చేశాయి. కలిసి పోటీ చేద్దామన్న సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రతిపాదనను జనసేన నాయకులు వ్యతిరేకించినట్లు సమాచారం. ఈఎన్నికల్లో జనసేన కూటమి అత్యధిక ఓట్లు సాధించడం గమనార్హం. కలిసి పోటీ చేస్తే టిడిపి, జనసేన కూటమి గుర్తింపు సంఘంగా నిలిచేదని విశ్లేషిస్తున్నారు. ఎన్నికల తరువాతి నుంచి ప్రారంభమైన డోర్ టు డోర్ కార్యక్రమం కరపత్రంలో జనసేన పార్టీ మాయం కావడం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ, వై శ్రీనివాస్ మధ్య సయోధ్య లేదన్న ప్రచారం జరుగుతోంది. పదవుల విషయంలో వారి మధ్య ఆధిపత్యపోరు జరుగుతున్నట్లు చెబుతున్నారు. వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు రాజమహేంద్రవరానికే చెందిన పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ కనీస చొరవ తీసుకోకపోవడం కూడా విమర్శలకు దారితీస్తోంది. వై శ్రీనుకు పవన్ కల్యాణ్ వ్యక్తిగత కార్యదర్శి హరిప్రసాద్ అండగా ఉండటం వల్లే ఈవిషయంలో జోక్యం చేసుకునేందుకు దుర్గేష్ వెనుకంజ వేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. జనసేనాని పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం, ఒంగోలు లాంటి చోట్ల జనసేన, టిడిపి మధ్య ఇప్పటికే ప్రచ్చన్నయుద్ధం నడుస్తోంది. ఇదే పరిస్థితి రాజమహేంద్రవరంలో కొనసాగితే ఒకవేళ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగినా…స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇరు పార్టీలు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో 15ఏళ్ల వరకు కూటమి మధ్య సయోధ్య ఇలాగే ఉంటుందని ఒకవైపు జనసేనాని పవన్ కల్యాణ్ పదేపదే ప్రకటిస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.

——————–

మా వార్తలు నచ్చిన పాఠకులు వెబ్ సైట్ కు అడ్వర్టైజ్ మెంట్లు వచ్చే వరకు ఒక్కో వార్తకు కేవలం రూ. 2/ 9491659287 నెంబర్ కు ఫోన్ పే చేసి ప్రోత్సహించగరమని మనవి.
If our news items liked you please send only Rs 2/ by phone pay to 9491659287 for Encourage. until we get Adv.

Leave a Reply