గన్నికి లోకేష్ హామీ… మేయర్ అభ్యర్థిత్వం దక్కకపోతే రాజకీయాలకు వీడ్కోలు!

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలు ఆగస్టులో జరిగే అవకాశాలు ఉన్నాయని, ఈవిషయాన్ని పురపాలకశాఖ మంత్రి పి నారాయణే తనకు చెప్పారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, టిడిపి…

 గన్నికి లోకేష్ హామీ… మేయర్  అభ్యర్థిత్వం దక్కకపోతే రాజకీయాలకు వీడ్కోలు!

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలు ఆగస్టులో జరిగే అవకాశాలు ఉన్నాయని, ఈవిషయాన్ని పురపాలకశాఖ మంత్రి పి నారాయణే తనకు చెప్పారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ వెల్లడించారు. మేయర్ అభ్యర్థిత్వం…తన రాజకీయ భవిష్యత్ తదితర అంశాలపై గన్ని కృష్ణ దివాకరమ్ న్యూస్ తో ముచ్చటించారు. ఆ విశేషాలు…
రాష్ట్రంలో జరుగుతున్న బిసి కులల గణన ఆగస్టు నాటికి పూర్తవుతుందని, తరువాత ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి నారాయణ తనతో చెప్పినట్లు గన్ని కృష్ణ తెలిపారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలు జరగాలని కోరుకునే వారితో పాటు, జరగకూడదని కోరుకునే వారూ ఉన్నారన్నారు. తాను మాత్రం 2027 గోదావరి పుష్కరాల్లోగా ఎన్నికలు జరుగుతాయని నమ్ముతున్నట్లు చెప్పారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో తాను మేయర్ గా పోటీ చేస్తానని పునరుద్ఘాటించారు. 40ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్నానని గుర్తు చేశారు. తనకు మేయర్ సీటు దక్కుతుందన్న ఆశాభావాన్ని ఈసందర్భంగా వ్యక్తం చేశారు. తనకు మేయర్ సీటు కేటాయించే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, యువనేత నారా లోకేష్ సానుకూలంగా ఉన్నారని గన్ని తెలిపారు. గ్రామాల విలీనానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన వ్యక్తితో ముఖ్యమంత్రిని కలిశానని, గన్ని కృష్ణ మేయర్ అభ్యర్థి అయితే కేసును ఉపసంహరించుకుంటానని చంద్రబాబు ఎదుటే చెప్పారన్నారు. అలాగే స్వతంత్ర సంస్థతో సర్వే చేయించి, 90శాతం కన్నా తక్కువ ప్రజామోదం లభిస్తే రాజకీయాల నుంచి విరమించుకుంటానని లోకేష్ ను కలిసి చెప్పినట్లు గన్ని వివరించారు. ఈసందర్భంగా తాను చూసుకుంటానని లోకేష్ భరోసా ఇచ్చారని గన్ని వెల్లడించారు. మేయర్ కాకపోతే మరో ప్రత్యామ్నాయం గురించి తాను ఆలోచించడం లేదని, 2029 నాటికి రాజకీయ పరిస్థితులు, సమీకరణలు ఎలా ఉంటాయో ఎవరు చెప్పగలరని ఎదురు ప్రశ్నించారు. అందుకే తాను మేయర్ గా పోటీ చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నానన్నారు.
మేయర్ రేసులో ఉన్నట్లు ప్రకటించుకున్న ఒక టిడిపి నాయకుడు కాపు నాయకులతో విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేయగా, తాను కులంపై ఆధారపడి రాజకీయాలు చేయనని, అలాంటి వాటికి అతీతమని గన్ని స్పష్టం చేశారు. జనసేన రాజమహేంద్రవరం ఇన్చార్జి అత్తి సత్యనారాయణ కూడా మేయర్ సీటును ఆశిస్తున్నారని చెప్పగా, సీటును ఎవరైనా ఆశించివచ్చని వ్యాఖ్యానించారు. సీటు ఎవరికి కేటాయించాలన్నది చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందిన నాయకులు తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నారన్నారు. తన అభ్యర్థిత్వాన్ని బలపరిచే టిడిపికి చెందిన గాడ్ ఫాదర్స్ తనకు జిల్లాలో ఎవరూ లేరని, మేయర్ సీటు కోసం ఎవరినీ కలిసి కోరడం లేదని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టులపై తనకు ఆసక్తి, లేదని, ఇప్పటికే ఎన్నో ఆఫర్లు వచ్చినా వాటన్నింటినీ తిరస్కరించానని చెప్పారు. చివరి సారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలన్నదే తన ఆకాంక్ష అని గన్ని కృష్ణ స్పష్టం చేశారు. తాను మేయర్ గా గెలిస్తే రాజమహేంద్రవరం నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తానని, అవినీతిరహితంగా గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు కృషిచేసి, పాలనలో తన మార్కు చూపిస్తానని చెప్పారు. ఒకవేళ తనకు సీటు దక్కకపోతే 40ఏళ్ల పాటు సేవ చేసిన తనకు రాజకీయంగా గౌరవప్రదమైన వీడ్కోలు ఎలా పలకాలన్నది అధిష్టానమే తేల్చుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. తాను ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదని, అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో పాలన, ఇసుక, మద్యం అంశాలపై తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందించారు.

Leave a Reply