ఖాళీగా ధియేటర్లు…నష్టాల్లో సినీ వ్యాపారం!

సురేష్ మూవీస్ సినీ పంపిణీ సంస్థలో చిరుద్యోగిగా ప్రారంభమైన జనసేన రాజమహేంద్రవరం ఇన్చార్జి అత్తి సత్యనారాయణ ప్రస్థానం అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత, తూర్పుగోదావరి జిల్లాలో 21 సినిమా…

 ఖాళీగా ధియేటర్లు…నష్టాల్లో సినీ వ్యాపారం!

సురేష్ మూవీస్ సినీ పంపిణీ సంస్థలో చిరుద్యోగిగా ప్రారంభమైన జనసేన రాజమహేంద్రవరం ఇన్చార్జి అత్తి సత్యనారాయణ ప్రస్థానం అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత, తూర్పుగోదావరి జిల్లాలో 21 సినిమా ధియేటర్ల నిర్వాహకుడి స్థాయికి ఎదిగింది. ఆయన సినీ, రాజకీయ ప్రస్థానం…ఆయన మాటల్లోనే…
సురేష్ మూవీస్ సంస్థలో ఉద్యోగిగా ప్రారంభమైన తన వ్యాపార ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి జనసేనాని నటించిన పవన్ కల్యాణ్ నటించిన గోపాలగోపాల చిత్రాన్ని పంపిణీ చేసే స్థాయికి చేరుకున్నానని అత్తి సత్యనారాయణ చెప్పారు. తరువాత చిత్ర పంపిణీదారుగా, 21 ధియేటర్లు నిర్వహించే స్థాయికి ఎదిగానన్నారు. తాను ముందు నుంచి మెగాస్టార్ చిరంజీవి కుటుంబ వీరాభిమానిగానే ఉండేవాడినని, సురేష్ మూవీస్ సంస్థ ఉద్యోగిగానే 2009లో ప్రజారాజ్యం పార్టీ తరుపున రాజమహేంద్రవరం సిటీకి పోటీ చేసిన చల్లా శంకరరావు ప్రచారంలో పాల్గొన్నానన్నారు. తరువాత గుంటూరులో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేతుల మీదుగా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించానని వివరించారు. గోపాలగోపాల సినిమా సినిమా తాను పంపిణీ చేసినట్లు తెలుసుకున్న పవన్ తరువాత పిలిపించుకుని గబ్బర్ సింగ్ పంపిణీ చేసే అవకాశాన్ని కల్పించారని వివరించారు. నాటి నుంచి పవన్ కల్యాణ్ కు ఇష్టుడిని, సన్నిహితుడ్నయ్యానన్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల సమయంలో తనకు పంపిణీ అవకాశం దక్కకపోతే తన వ్యాపార ప్రత్యర్థులకు పవన్ హెచ్చరికలు కూడా జారీ చేశారని సత్యనారాయణ గుర్తు చేసుకున్నారు.
హరిహర వీరమల్లు విడుదలకు ముందు జరిగిన వివాదంలో తన ప్రమేయం ఏమీ లేదని అత్తి సత్యనారాయణ స్పష్టం చేశారు. అప్పటికే సినీ పంపిణీ, ధియేటర్ల వ్యాపారం నష్టాల్లో ఉందని, 2025 మేలో ఇటు పంపిణీదారులు, అటు ధియేటర్ల యజమానులకు న్యాయం జరిగేలా పర్సంటేజీ విధానాన్ని ప్రతిపాదించానని చెప్పారు. అవసరమైతే పాక్షికంగా ధియేటర్లు మూసివేయాలని నిర్ణయించామన్నారు. తన ప్రతిపాదనకు నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు వంటి వారు సంఘీభావం ప్రకటించారన్నారు. అయితే ఆసమయంలో పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విడుదలవుతున్న సంగతి తనకు తెలియదన్నారు. దీంతో హరిహర వీరమల్లు చిత్రం విడుదల జూన్ కు వాయిదా పడిందన్నారు. ఇది వివాదాస్పదం కావడంతో జనసేనలో ఉన్న తానే ధియేటర్ల బంద్ కు పిలుపునిచ్చినట్లు దిల్ రాజు నెపం తనపైకి నెట్టేశారన్నారు. వైసిపి నాయకులు, కొంతమంది వ్యాపార ప్రత్యర్థులు ఈవ్యవహారంపై రాద్ధాంతం సృష్టించారన్నారు. అందుకే పవన్ కల్యాణ్ సొంతమనిషిగా ఉన్న తనపై వేటు వేసి, వివాదాన్ని సద్దమణిగేలా చేశారన్నారు. ఈవిషయంలో తానేమీ బాధపడలేదని సత్యనారాయణ చెప్పారు. ఆసమయంలో రాజమహేంద్రవరంనకు చెందిన ఎపి పర్యాటకశాఖ మంత్రి ఫోన్ చేసి, బంద్ కు పిలుపునిచ్చిన వారి పేర్లు చెప్పమంటే దిల్ రాజు తదితర నలుగురి పేర్లు విలేఖర్ల సమావేశంలోనే ప్రకటించానన్నారు. ఇప్పటికీ సినిమాల పంపిణీ, ధియేటర్ల వ్యాపారం నష్టాల్లోనే కొనసాగుతోందన్నారు. పెద్ద సినిమాలు విడుదలైనా వారంరోజుల్లోనే ధియేటర్లు ఖాళీ అవుతున్నాయని వివరించారు. అందుకే నిర్వహణ సాధ్యం కాక ధియేటర్లను మూసివేస్తున్నామన్నారు. చిన్న సినిమాల తరహాలో వచ్చిన ఆదాయంలో పంపిణీదారులు- ధియేటర్ల నిర్వాహకులకు 60:40 నిష్పత్తిలో పంచితేనే ధియేటర్లు, పంపిణీ వ్యవస్థ మనుగడ సాధ్యమవుతుందని అత్తి సత్యనారాయణ వివరించారు. అలాగే ప్రతీ పెద్ద హీరో ఏడాదికి కనీసం 2 సినిమాల్లో నటిస్తేనే ధియేటర్లు కళకళలాడతాయని చెప్పారు.

Leave a Reply