గోరంట్లకు తీరని కోరిక అదే….!
మొత్తం 10 సార్లు పోటీ చేసిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం ద్వారా రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం సీనియర్ ఎమ్మెల్యేల్లో రాజమహేంద్రవరం రూరల్…
మొత్తం 10 సార్లు పోటీ చేసిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం ద్వారా రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం సీనియర్ ఎమ్మెల్యేల్లో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఒకరు. ఆయనతో సమానంగా రాజకీయాల్లో కొనసాగుతున్నది స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాత్రమే. అయితే 2019 ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం చెంది 23 సీట్లకు మాత్రమే పరిమితం కాగా, అయ్యన్నపాత్రుడు కూడా ఓడిపోయిన వారిలో ఉన్నారు. గోరంట్ల మాత్రం హ్యాట్రిక్ విజయాలతో అప్పటి ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడంలో ముందున్నారు. తెలుగుదేశం పార్టీలో పార్టీ అధినేత చంద్రబాబునాడు కన్నా సీనియర్ అయిన గోరంట్లకు మంత్రి పదవి మాత్రం అందని ద్రాక్షగా మారిందని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024 విజయం తరువాత సీనియర్ గా గోరంట్లకు మంత్రి పదవి తధ్యమని, ఆయనతో పాటు, ఆయన అనచురులు కూడా ఆశించినా నిరాశే ఎదురైంది.
అప్పుడెప్పుడో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కు జరిగిన వెన్నుపోటుకు ముందు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా, ఆయన సతీమణి లక్ష్మీపార్వతి చక్రం తిప్పుతున్న సమయంలో కేవలం కొద్ది నెలల పాటు మాత్రమే గోరంట్ల పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో లక్ష్మీపార్వతి వర్గంలో ఉన్న ఆయన తదనంతర పరిణామాల్లో చంద్రబాబు చెంతన చేరారు. ఆతరువాత చంద్రబాబు పలుసార్లు అధికారంలోకి వచ్చినా గోరంట్లకు మంత్రి పదవి మాత్రం దక్కలేదు. అయితే అసెంబ్లీ సీటును సాధించడంలో మాత్రం ఆయన ఎప్పుడూ వెనుకబడకపోవడం విశేషం. ఒకప్పటి తన అనుచరుడు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో విభేదాలు పొడసూపిన తరువాత ఆయన సీటు రూరల్ మారడం గమనార్హం. పొత్తులు, రాజకీయ సమీకరణలు, అధిష్టానం నిర్ణయాల నేపథ్యంలో గోరంట్ల రూరల్ కు మారక తప్పలేదు. అక్కడా హ్యాట్రిక్ విజయాలు సాధించడం గోరంట్ల రాజకీయ చతురతకు నిదర్శనం. రాజమహేంద్రవరం సిటీలో ఆదిరెడ్డి కుటుంబం హవా మొదలైన తరువాత పొలిట్ బ్యూరో సభ్యుడైనా సిటీ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేని పరిస్థితుల్లో గోరంట్ల ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటైన ఒకప్పటి సిటీ పార్టీ కార్యాలయం మూతపడింది.
గోరంట్ల 81వ జన్మదినోత్సవ వేడుకలు ఎన్నడూ లేని విధంగా ఘనంగా జరిగాయి. సిటీ, రూరల్ లో పెద్దఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. ఆయన రాజకీయ వారసుడు, టిడిపి వైద్యవిభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ ఈసందర్భంగా ఐదు రోజుల పాటు భారీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 2029 ఎన్నికల నాటికి గోరంట్ల దాదాపు 84 ఏళ్లకు చేరుకుంటారు. 81వ పడిలోకి అడుగు పెట్టినా గోరంట్లలో ఉత్సాహం తగ్గలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీకి కూడా ఆయన ఉత్సాహంగా ఉన్నారు. అసెంబ్లీ చర్చల్లో కూడా గోరంట్లను ఆదర్శంగా తీసుకోవాలని స్వయంగా చంద్రబాబునాయుడే చెప్పడం విశేషం. మరోవైపు రవిరామ్ కిరణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం టిడిపిలో చక్రం తిప్పుతున్న భావి ముఖ్యమంత్రిగా ప్రచారం పొందుతున్న లోకేష్ టీంలో రవిరామ్ కిరణ్ కీలక సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈనేపథ్యంలో 2029 ఎన్నికల్లో రవిరామ్ కిరణ్ రాజమహేంద్రవరం సీటు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే గోరంట్ల అమాత్యపదవి పొందకుండానే రాజకీయాల నుంచి విరమిస్తారా అని ఆయనతో పాటు అభిమానులు, అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. పూర్తిస్థాయిలో మంత్రి పదవిని చేపట్టకలేకపోవడం, తాను ఒకప్పుడు ఏలిన రాజమహేంద్రవరం రాజకీయాల్లో తన ప్రత్యర్థి ఆదిరెడ్డి అప్పారావు కుటుంబానికి సరైన విధంగా చెక్ పెట్టలేకపోవడం గోరంట్ల రాజకీయ జీవితంలో వెలితిగానే భావించవచ్చు.
గోరంట్ల జన్మదినోత్సవం సందర్భంగా……