మేయర్ కాకపోతే రుడా చైర్మన్…. . జనసేన జబర్దస్త్ గా ఉంది…కానీ.. అత్తి సత్యనారాయణ
జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇమేజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖల మంత్రిగా ఆయన పనితీరు వల్ల జనసేన పార్టీకి ప్రజల్లో ఆదరణ బాగుందని జనసేన పార్టీ రాజమహేంద్రవరం…
జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇమేజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖల మంత్రిగా ఆయన పనితీరు వల్ల జనసేన పార్టీకి ప్రజల్లో ఆదరణ బాగుందని జనసేన పార్టీ రాజమహేంద్రవరం నియోజకవర్గ ఇన్చార్జి అత్తి సత్యనారాయణ వెల్లడించారు. కానీ సినిమా పంపిణీ వ్యాపారం క్షీణించడంతో తన ఆర్థిక, రాజకీయ పరిస్థితులే కాస్త అటు ఇటుగా ఉన్నాయని రాజమహేంద్రవరంలో జనసేన పార్టీని మోస్తున్న సత్యనారాయణ వెల్లడించారు. చలన చిత్ర పంపిణీ సంస్థలో చిన్న స్థాయి ఉద్యోగి నుంచి పంపిణీదారుడిగా ఎదిగి, రాజకీయ నేతగా ఎదుగుతున్న బిసి సామాజిక వర్గానికి చెందిన అత్తి సత్యనారాయణ మార్చి 14న జనసేన ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా దివాకరమ్ న్యూస్ తో ప్రత్యేకంగా ముచ్చటించారు.
రాజమహేంద్రవరంలో జనసేన పార్టీ బలంగా ఉందని, 2025లో 10వేల మంది పార్టీలో సభ్యులుగా చేరితే ఈఏడాది వారి సంఖ్య దాదాపు 15వేలకు చేరే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో తమ అధినేత పవన్ కల్యాణ్ ఇమేజ్ బాగా పనిచేయడమే ఇందుకు కారణమన్నారు. కూటమి ధర్మం ప్రకారం రాజమహేంద్రవరం మేయర్ సీటుతో పాటు, 30శాతం కార్పొరేటర్ సీట్లు జనసేనకు కేటాయించాల్సి ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు, రుడా చైర్పన్, రూరల్ ఎమ్మెల్యే టిడిపికి చెందిన వారే ఉన్నారని, బిజెపికి ఎంపి సీటుతో పాటు, ఎమ్మెల్సీ పదవిని కేటాయించారని, జనసేన పార్టీకే రాజమహేంద్రవరంలో ఏ పదవీ లేదన్నారు. సామాజిక, రాజకీయ సమీకరణలు మారితే తప్ప రాజమహేంద్రవరం మేయర్ సీటు జనసేనదేనని, తానే మేయర్ గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మేయర్ పదవికి జనసేనకు కేటాయించాలన్న విషయంలో తన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా సానుకూలంగా ఉన్నారన్నారు. జనసేనకు మేయర్ పదవిని కేటాయించలేని పక్షంలో బొడ్డు వెంకటరమణ చౌదరి తరువాత రుడా చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ అదీ కుదరకపోతే నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఎమ్మెల్యే సీటు కోరుకుంటానన్నారు. మేయర్, రుడా పదవుల కన్నా తనకు ఎమ్మెల్యేగా సేవ చేయడమే ఎక్కువ ఇష్టమని అత్తి సత్యనారాయణ చెప్పారు. అయితే రాజమహేంద్రవరంసిటీలో తాను ఆదిరెడ్డి వాసుకు పోటీ కాదని స్పష్టం చేశారు. వాసు నగరాభివృద్ధికి కృషిచేస్తున్నారని, ఆయన పాలన బాగుందని కితాబునిచ్చారు. కూటమి నాయకుల మధ్య సమన్వయం బాగుందని తెలిపారు. తనకు జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీనివాస్ కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. తాము కలిసి పనిచేస్తున్నామన్నారు. రాజకీయంగా ఎదగాలన్న ఆయన వైఖరిలో తప్పు లేదన్నారు. తాను 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశానని, ప్రస్తుతం జనసేన ఇన్చార్జిగా పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్నానన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి, నియోజకవర్గ ఇన్చార్జిగా ఆర్థికంగా కోట్లాది రూపాయల వ్యయం చేశానని, మరోవైపు సినీ పంపిణీ వ్యాపారం కూడా నష్టాల బాటలో ఉందని అత్తి సత్యనారాయణ వివరించారు. రాజమహేంద్రవరంలో తనకు రాజకీయంగా తగిన గౌరవం, పదవి కల్పించాలన్న విషయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దే తుది నిర్ణయమని, ఆయన ఆదేశాల మేరకే పనిచేస్తానని చెప్పారు.
సశేషం……