పోలవరం ప్రాజెక్టులో జరగరానిది జరిగితే….పెను విషాదం తప్పదు!

పోలవరం ప్రాజెక్టులో జరగరానిది జరిగితే….సుమారు 7 కిలోమీటర్ల మేర ఉన్న డయాఫ్రం వాల్ బద్ధలై భారీ బండ రాళ్లు, కొండ చరియలు రాజమహేంద్రవరం వరకు ఉన్న ఊళ్లను…

 పోలవరం ప్రాజెక్టులో జరగరానిది జరిగితే….పెను విషాదం తప్పదు!

పోలవరం ప్రాజెక్టులో జరగరానిది జరిగితే….సుమారు 7 కిలోమీటర్ల మేర ఉన్న డయాఫ్రం వాల్ బద్ధలై భారీ బండ రాళ్లు, కొండ చరియలు రాజమహేంద్రవరం వరకు ఉన్న ఊళ్లను నేలమట్టం చేస్తాయి. అదే జరిగితే భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు భద్రతపై మాజీ ఐపిఎస్, టిడిపికి సన్నిహితుడిగా భావించే ఎబి వెంకటేశ్వరరావు ఇటీవల ఆందోళన వ్యక్తం చేయగా, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎపి విద్య, మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కు బహిరంగ లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎపి వరదాయిని, బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టును ఆమోదిత డిజైన్లకు విరుద్ధంగా ఇష్టానుసారం నిర్మిస్తున్నారని, దీనివల్ల భవిష్యత్ లో ప్రాజెక్టు భద్రతపై ఉండవల్లి ఆందోళన వ్యక్తం చేశారు. పౌర మరియు నీటిపారుదల నిపుణుల వివరణాత్మక నివేదికలు, సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) ఇతర అధికారిక సమాచారాన్ని క్రోఢీకరించిన ప్రాజెక్టు భద్రతపై ఆందోళన చెందుతున్నట్లు ఉండవల్లి తెలిపారు. ప్రాజెక్టును పూర్తి సాంకేతిక డిజైన్ ఆమోదాలు లేకుండా నిర్మాణ పనులు చేపట్టడం వల్ల ఆనకట్ట సమగ్రత, ప్రజా భద్రత, దీర్ఘకాలిక స్థిరత్వానికి తీవ్రమైన ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తన లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టు గ్యాప్-2 వద్ద ఎర్త్ కోర్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ఏకకాలంలో జరుగుతుండగా, సిడబ్ల్యూసి లోపాలను గుర్తించి, డిజైన్ మార్చాలని సూచించిందని గుర్తు చేశారు.
జనవరి 19-21 తేదీల్లో పోలవరం ప్రాజెక్ట్ సైట్‌లో నిర్వహించిన సమావేశంలో కేంద్ర జల సంఘం లేవనెత్తిన అనేక ఆందోళనలు, బహుళ సాంకేతిక సంస్థలు, నిపుణుల ప్యానెల్ AFRY వంటి అంతర్జాతీయ కన్సల్టెంట్ల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇలాంటి సమస్యల నడుమ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తే
అనవసరమైన నష్టాలను ఆహ్వానించడమే కాకుండా, నిర్మాణానంతర దిద్దుబాట్లకు కూడా అవకాశం ఉండదని ఉండవల్లి స్పష్టం చేశారు. గతంలో కాపర్ డ్యామ్ లు నిర్మించకుండా డయాఫ్రం వాల్ నిర్మించడం వల్ల డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతిందని గుర్తు చేశారు. గత తప్పుల నుండి గుణపాఠాలు నేర్చుకోకుండా తాజాగా రూ. 3వేల కోట్లతో చేపట్టిన డయాఫ్రం వాల్ నిర్మాణంలో కూడా ఇటువంటి ఖరీదైన లోపాలను పునరావృతం చేయడం ప్రాజెక్ట్ విశ్వసనీయతను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుపై సిడబ్ల్యూసి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆందోళనలు, నివేదికలను బహిర్గతం చేయడకుండా ప్రభుత్వం గోప్యత పాటిస్తోందని ఉండవల్లి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి ముప్పు లేకుండా సాంకేతిక లోపాలను సరిదిద్ది, సిడబ్ల్యూసి డిజైన్లు, మార్గదర్శకాల ప్రకారం నిర్మించాలని, ఈవిషయంలో ఉన్నతస్థాయిలో జోక్యం చేసుకోవాలని లేఖలో ఉండవల్లి కోరారు.
పోలవరం ప్రాజెక్టు నాణ్యతపై రిటైర్డ్ ఐపిఎస్ అధికారి, తెలుగుదేశం పార్టీకి సన్నిహితుడైన ఎబి వెంకటేశ్వరరావు కూడా ఇటీవల ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. డయాఫ్రమ్ వాల్‌లో కాంక్రీట్ బ్లీడింగ్, అక్రమంగా గోడ ఎత్తు తగ్గించడం వంటి పనులు ప్రాజెక్టు భద్రతకు ముప్పుగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2023లో దెబ్బతిన్న అప్‌స్ట్రీమ్ గైడ్ బండ్ మరమ్మతులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ప్రమాదకరమని హెచ్చరించారు. గ్యాప్-I లో ట్రెంచ్ లోతును నిబంధనలకు విరుద్ధంగా 23 మీటర్ల నుండి 24 మీటర్లకు పెంచడం వల్ల పునాది స్థిరత్వం దెబ్బతినే అవకాశం ఉందని సిడబ్ల్యుసి (CWC) ఆందోళన వ్యక్తం చేసిందని ఆయన గుర్తు చేశారు. అప్రోచ్ ఛానల్ తవ్వకం పనులలో తప్పుడు లెక్కలు చూపుతున్నారని, 38.55 లక్షల క్యూబిక్ మీటర్ల బదులు కేవలం 5 లక్షల క్యూబిక్ మీటర్లేనని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
ప్రాజెక్టు భద్రతను నిర్ధారించడానికి అంతర్జాతీయ నిపుణులతో స్వతంత్ర ఆడిట్ నిర్వహించాలని, అప్పటివరకు ఎర్త్ కోర్ రాక్ ఫిల్ డ్యాం పనులను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply