రెవెన్యూ కథలు…బీరమ్మ కోసం….క్రిమినల్ కేసు నెత్తిన వేసుకున్నా….

1988-90 …అవి నేను రావులపాలెం మండల రెవెన్యూ అధికారి గా పనిచేసిన రోజులు. అప్పటికీ ఇంకా నేను డిప్యూటీ తహసిల్దార్ హోదాలోనే ఎమ్మార్వోగా ఉన్నాను. 1989లో ఒక…

 రెవెన్యూ కథలు…బీరమ్మ కోసం….క్రిమినల్ కేసు నెత్తిన వేసుకున్నా….

1988-90 …అవి నేను రావులపాలెం మండల రెవెన్యూ అధికారి గా పనిచేసిన రోజులు. అప్పటికీ ఇంకా నేను డిప్యూటీ తహసిల్దార్ హోదాలోనే ఎమ్మార్వోగా ఉన్నాను. 1989లో ఒక రోజు నేను ఆఫీసులో ఉండగా సర్పంచ్ మారే బుద్దుడు, లంక భూముల సొసైటీ అధ్యక్షుడు నాయకత్వంలో పొడగట్లపల్లి గ్రామానికి చెందిన షెడ్యూలు కులస్తులు ఓ పది మంది వచ్చారు. వారిలో తో పాటు ఒక స్త్రీ ఉంది. జుట్టు తెల్ల ముగ్గు బుట్టలా ఉంది. ఆమెకు సుమారు 64 -65 ఏళ్ళు ఉండవచ్చు. ఆ ఊర్లో చాలా మంది షెడ్యూలు కులాలవారికి లంక భూములు ఏటా లీజుచెల్లింపు పద్దతి పై చాలా సంవత్సరాల క్రితమే ఒక్కరికి ఎకరం చొప్పున భూమి జిల్లా కలెక్టర్ గారు కేటాయించారు. ముసల్మతో వచ్చిన కుల పెద్దలు, వీరమ్మను చూపిస్తూ అయ్యా ఈ ముసలమ్మకు ముగ్గురు కూతుర్లు. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. వాళ్ళు వేరే ఊర్లలో ఉంటున్నారు. ముసలమ్మ భర్త చనిపోయినందున, తాను వయసు రీత్యా సాగు చేయలేక తన చెల్లి మనవడయిన పల్లి రాజుకు సాగు చేసు కోవడానికి ఇచ్చింది. గత రెండు సంవత్సరాలు నుంచి ముసలమ్మకు ఏ విధమైన లీజు చెలించడం లేదు. భూమిని ఖాళీ చేయడం లేదు అని చెప్పారు. మీరు ఇంత మంది ఉన్నారు కదా ఖాళీ చేయించలేరా అన్నాను. అమ్మోవాడు చాలా మొండి వాడు.దెబ్బలాటకు ముందుంటాడు. వాడంటే మాలపల్లి లో అందరికి భయమే అన్నారు. .ఏకంగా కత్తి వేసుకుని దెబ్బలాటకు వస్తాడు అని చెప్పారు. అందుకే మీకు చెప్పడానికి వచ్చాం…మీరే వాణ్ణి పిలిపించి ఆ భూమిని ముసలమ్మ కు తిరిగి ఇప్పించండి.. లేదా కౌలు సొమ్ము పక్క రైతులు ఎలా చెల్లిస్తే అలా ,చెల్లించమని,బకాయిలు లేకుండా కౌలు సొమ్ము ఇప్పించే లాగా మీరే చెయ్యాలి అని చెప్పి ,కాగితం ఇచ్చి వెళ్లిపోయారు.
నాలుగు రోజుల తర్వాత పల్లి రాజును గ్రామ నౌఖరు ద్వారా పిలిపించాను. వీరమ్మ భూమి ని కౌలుకు తీసుకొని రెండు సంవత్సరాలు గా కౌలు ఇవ్వడం లేదటకదా! నీకు కౌలు ఇవ్వడానికి కష్టమైతే భూమిని వదిలిపెట్టు. ఆమె వేరే వాళ్లకు కౌలుకు ఇచ్చుకుంటుంది అన్నాను. ఇది మా కుటుంబ సమస్య, దీంతో మీకు సంబంధం ఏమిటి అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. ఆమె నీకు బంధువే కానీ మొన్న వచ్చి నీ పై ఫిర్యాదు ఇచ్చింది. అందుకే నిన్ను పిలిపించాను. లేకుంటే నేను ఎందుకు నిన్ను పిలిపిస్తాను అన్నాను. ఏమైనా నేను భూమి వదలను అని చెప్పాడు. అప్పుడు అర్థమయ్యింది తాను ఎంత మొండివాడో. ఎమ్మార్వోనే లెక్క చేయకుండా మాట్లాడుతున్నాడంటే ఊరివాళ్ళు రాజు అంటే ఎందుకు భయపడుతున్నారో నాకు తెలిసొచ్చింది. నువ్వు వీరమ్మకు భూమిని అప్పగించక పోతే నీ పై పోలీసులకు చెప్పి కేసు పెట్టిస్తాను అని చెప్పాను. పెడితే పెట్టుకోండి అంటూ ,ఎవరైనా లెక్కలేదు ,లెక్కచేయను అనే తన ధోరణికి విస్తుపోయాను.సరే వెళ్ళు అని చెప్పి వెంటనే ఎస్ ఐకి లేఖ వ్రాసాను. ఎస్ ఐ పసుపులేటి రామారావుకు ఫోన్ చేసి చెప్పాను. పసుపులేటి రామారావు నిడదవోలు లో డిగ్రీ కాలేజ్ లో నా సీనియర్. ఎన్ని రోజులయినా పోలీస్ లు ఏమి చర్య తీసుకోలేదు. అడిగితే వాడు చాలా మొండి వాడు. ఇద్దరూ బంధువులే అంటూ ఎటూ తేల్చకుండా ఉండి పోయారు. ఎస్ ఐ కూడా. మళ్ళీ వచ్చారు పెద్దలు. మరోసారి పిలిపిస్తానని చెప్పి పంపించాను.
సరిగ్గా వారం రోజులకు అదే లంక భూముల దగ్గరలోని లక్ష్మిపోలవరం గ్రామంలోని భూమి విషయంపై సర్వేయర్ తో కలసి వెళ్ళాను. అక్కడికి నేను రావడం చూసిన పొడగట్లపల్లి వ్యక్తి(వీరమ్మ భూమి విషయమై పిర్యాదు చేయడానికి వచ్చిన వాళ్ళ లో ఒక వ్యక్తి.) ఎమ్మార్వో వీరమ్మ భూమి ఇక్కడికి దగ్గరే అని చెప్పాడు. సరే చూద్దాం పద అని చెప్పి అక్కడ నుంచి సర్వేయరు, గ్రామ నౌకర్ల తో కలిసి గోదావరి ఇసుక పాయలో నడుచుకుంటూ వెళుతుంటే, ఇసుక మేటల్లో దుబ్బుగడ్డి పొదలు తెల్లటి పూలతో విరగకాసి ఉన్నాయి. సిరిసిరిమువ్వ సినిమాలో గోదారి పై రాసిన వేటూరి పాటలు గుర్తుకు వచ్చింది. ఆ లంక భూములు చూస్తుంటే లీజు భూములైన చాలా సారవంతమైనవిగా ఉండి గోదావరి బయట ఉండే మాగాణి భూములకు పోటీ గా ఉన్నాయి. ఆ భూములను మోతుబరి రైతులకు కౌలుకు ఇస్తే అందులో పశువుల కోసం గడ్డి పెంచి, ఏటా పదివేలు కౌలు ఇచ్చేవారు. అప్పటికే నేను వచ్చిన విషయం తెలిసి, పొడగట్లపల్లి మాల పెద్దలు నాకు ఎదురు వచ్చారు. ఆ భూములన్నీ ఏటా గోదావరి వరద నీటితో మునగడం వల్ల ఒండ్రు మట్టి తో మంచి కూరగాయ సాగులు చేస్తున్నారు.ముసలమ్మ చేను వద్దకు చేరుకున్నాం. చేను మూడు భాగాలు గా చేసి,వంగ, టొమోటో, చిక్కుడు పంటలు వేశాడు. కాపు కాస్తున్నాయి. పల్లి రాజు అప్పుడు చేనువద్ద లేడు. వీరమ్మ కూడా లేదు. ఓ 20 మంది సరిహద్దు లీజు దారులు ఉన్నారు. సరిగ్గా సూరీడు పడమర దిక్కున వాలుతూ ఎర్రటి గుండ్రటి ప్రతిబింబాన్ని విస్తరించినట్లుగా ఉన్నాడు. ఒక్క సారిగా పంటమొత్తం పీకెయ్య మని చెప్పాను. ఎందుకో అప్రయత్నంగా ఆ మాట నా నోట జారింది. వాళ్లు మరే ఆలోచన లేకుండా పొద్దువాలి కను చీకటి పడనుండగా గంట లో ఎకరం చేలోని 3 పంటలను లాగేశారు. నేను చెప్పినట్లు చేసేసారు. ఎమ్మార్వోగారు చూసుకుంటారు లే అని ధైర్యంగా వాళ్ళు నేను చెప్పినట్లు చేశారు. కానీ మనస్సులో తప్పు చేసానేమో అన్న భావన. మరోవైపు వాడు వదులుతాడా అని ఆలోచిస్తూనే ,వాళ్లకు అభినందనలు తెలిపి రావులపాలెం బయలుదేరాను.
రెండు రోజులకు పంట పీకి విధ్వంసం చేసినట్లుగా ఫొటోల తో సహా ఆంధ్ర భూమి దిన పత్రిక లో వార్త వచ్చింది. అప్పటికి ఆంధ్రభూమి కూడా ఓ స్థాయి పత్రికగానే ఉంది. ఆ విలేఖరి నాకు సన్నిహితంగానే ఉంటాడు, కానీ వార్త నన్ను అడక్కుండానే రాశాడు. పేపర్ చూసి విలేఖరికి కబురు పంపాను. వీరమ్మ, ఊరి మాలపెద్దలతో వచ్చి పిటీషన్ ఇచ్చినప్పటినుంచి పంటపీకేసే దాకా జరిగిన వాస్తవాలు అన్ని చెప్పి,నేను చేయించింది అంటే పంట పీకించిన విషయం నిజమే. నేను చేసింది వీరమ్మకు న్యాయం జరగడం కోసమే. ఎవరడిగినా నాకు సంబంధంలేదు అనే చెబుతాను అని అన్నాను. అర్థం చేరుకున్న విలేఖరి ఇక నుంచి దీనిపై ఏమి రాయను అని చెప్పాడు. పల్లిరాజు ఫోటోలు తీసుకొని ఎస్ ఐ వద్దకు వెళ్ళాడు కేసు పెట్టమని. పల్లి రాజు కు భయపడి ఏమి చేయలేని ఎస్ ఐ నా మీద గౌరవం తో కేసు కట్టలేదు. ఇలా ఉంటే ఆ చేనులో మాలపెద్దలు ఉమ్మడిగా సాగు మొదలెట్టారువీరమ్మ కోసం. ఇక పల్లిరాజు ఆ చేను జోలికి వెళ్లడం లేదు. సమస్య పరిష్కారం అయిందని సంతోషించే లోపల పల్లి రాజు నా మీద,ఆ రోజు పంట పీకేసిన వారిపైన కొత్తపేట మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేసాడు. ఫోటోలు(పంట పీకేసిన తర్వాత తీసినవి) ఎవిడెన్స్ ఉంది కదా అని మేజిస్ట్రేట్ గారు కేసు రిజిస్టర్ చేసి పోలీస్ వారికి తదుపరి విచారణకు పంపారు. ఓ మూడు నెలలకు అంటే 1990 మే 8,9 తారీఖుల్లో పెద్ద తుఫాను వచ్చి తూర్పుగోదావరి నుంచి నెల్లూరు దాకా పెద్ద నష్టం జరిగింది. రాజకీయ కారణాలతో 1989 లో కొత్త గా వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్టుదల వల్ల నాకు అక్కడనుంచి డిప్యుటేషన్ పై ఓఎన్జీసికి బదిలీ అయ్యింది. కొత్తపేట కోర్ట్ నుంచి సమన్లు వచ్చాయి. పల్లి రాజు పెట్టిన కేసు వల్ల నా తో పాటు మరో 15 మంది మాల పెద్దలు , వీరమ్మ కూడా హాజరయ్యేవారు. ప్రైవేటు క్రిమినల్ కేసు కాబట్టి నా తరపున గవర్నమెంట్ ప్లీడర్ వాదించరు. పైగా ఫీజు చెల్లించాలి. కొత్తపేటలో ఈమని అన్నపూర్ణ శర్మ గారు మంచి పేరున్న వకీలు. ఆయనది పొడగట్లపల్లి గ్రామమే. పొడగట్లపల్లి పండిత గ్రామం. ఆ గ్రామంలో వేదపాఠశాల, సంస్కృత పాఠశాల ఉండేవి. పంచాంగం రాయడంలో ఆ గ్రామంలో కొంతమంది ప్రసిద్ధులు. ఆ గ్రామం నుంచి రామకృష్ణ గారు అని ఐఏఎస్ అధికారి కూడా ఉండేవారు. కేసులో ఉన్న మాల కులస్తుల్లో కొంతమంది అన్నపూర్ణ శర్మ గారి వ్యవసాయ భూములు కౌలుకు చేస్తారు. అందువల్ల ఫీజు లేదు. నా తరపున కూడా ఫీజు లేకుండానే, మాల పెద్దలే ఒప్పించారు. రెండు మూడు నెలలకు ఒక సారి వాయిదాకు హాజరవుతున్నా. అదే సమయంలో పల్లి రాజు గొడవపడి కేసులో ఉన్నవారిపై దాడి చేసి ఇద్దర్ని గాయ పరిచాడు. అందువల్ల పోలీసులు పల్లి రాజు పైనా క్రిమినల్ కేసు పెట్టారు. నాలుగు నెలలు పోయాక, నా పైన ఉన్న ప్రైవేటు కేసు పోవడం కోసం ,మాల పెద్దలు రాజు తో రాజీపడి అతని మీద ఉన్న కేసు కొట్టివేయడానికి సహకరించేందుకు ఒప్పుకున్నారు. అందుకు ప్రతిఫలంగా నా పైన రాజు పెట్టిన ప్రైవేటు కేసులో రాజీ పడేందుకు రాజు ఒప్పుకున్నాడు. ఆ విధంగా కేసు పేట్టిన రెండు సంవత్సరాలు నేను కోర్ట్ కి 5,6 సార్లు వెళ్లాల్సి వచ్చింది. ఏమయితేనే ఆ భూమి వీరమ్మకి దక్కింది ఆ విధంగా కథ సుఖంతం అయ్యింది(.వీరమ్మ ముగ్గురి కుతుళ్ల లో ఒక కూతురి కుమారుడు జ్యోతిబసు అని టీచర్ గా పనిచేస్తున్నారు.తను యుటిఎఫ్ యూనియన్ నాయకుడు కూడా ప్రస్తుతం రావులపాలెం లో ఉంటున్నాడు
మారిశెట్టి జితేంద్ర
రిటైర్డ్ స్పెషల్ డిప్యుటీ కలెక్టర్

Leave a Reply