కూటమి నేతల అత్యుత్సాహం….ఆనక అబాసుపాలు!
మే 30 నుంచి జూన్ 1 వరకు రాజమహేంద్రవరంలోని గోదారిలో అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ -2026 ప్రారంభం…. 25 దేశాల నుంచి 1200 మంది అథ్లెట్ల…
మే 30 నుంచి జూన్ 1 వరకు రాజమహేంద్రవరంలోని గోదారిలో అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ -2026 ప్రారంభం…. 25 దేశాల నుంచి 1200 మంది అథ్లెట్ల హాజరు….ఇదంతా నిజమని నమ్మేరు. అంతా కూటమి నాయకుల అత్యుత్సాహమే తప్ప పోటీలే జరగలేదు. దాదాపు 2నెలల క్రితం రాజమహేంద్రవరంలో అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ – 2026 ఈవెంట్ లాంచ్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. భారతదేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో థింక్ అవుట్ సైడ్, ఇండియన్ కయాకింగ్ అండ్ కానోయింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్-2026 పోటీలు రాజమండ్రి కేంద్రంగా నిర్వహించనున్నట్లు ప్రజా ప్రతినిధులు, నిర్వాహకులు అట్టహాసంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన లోగోను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, శాప్ చైర్మన్ అనిమీని రవి నాయుడు ఆవిష్కరించగా, జెర్సీని బలరాం నాయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, బొడ్డు వెంకటరమణ చౌదరి ఆవిష్కరించారు. టీజర్‌ను ఎమ్మెల్సీ సోము వీర్రాజు విడుదల చేశారు. అధికారిక బ్యానర్‌ను కూటమి నాయకులు విడుదల చేశారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈసందర్భంగా కూటమి నాయకులు భారీ ప్రసంగాలు చేశారు. దీంతో రాజమహేంద్రవరం ఖ్యాతి క్రీడా, పర్యాటకరంగాల్లో అంతర్జాతీయ స్థాయికి చేరుతుందని ఆశపడ్డారు. ముహూర్తం ముంచుకొస్తున్నా డ్రాగన్ బోటు పోటీల జాడ కనిపించలేదు. టిడిపి మహానాడు తరువాత పోటీలు ప్రారంభమవుతాయని ఆశించినా ఎలాంటి హడావుడి లేదు. ఈపోటీలు రద్దయినట్లు తెలుస్తోంది. పోటీల నిర్వహణ విషయాన్ని అట్టహాసంగా ప్రకటించిన నాయకులు రద్దు విషయాన్ని వెల్లడించకపోవడం గమనార్హం. ఈపోటీల ప్రకటన కార్యక్రమానికి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరుకాకపోవడం మరో విశేషం. ఈపోటీల నిర్వహణ ద్వారా రాజమహేంద్రవరం కీర్తి అంతర్జాతీయ స్థాయికి చేరుతుందని ఆశించగా, నాయకుల తీరుతో అబాసుపాలైంది. ఈపోటీల గురించి నాడు కూటమి నేతలు చేసిన ప్రకటనలు, ప్రసంగాలు ప్రజలు మర్చిపోయారని భావించి, రద్దు విషయాన్ని కూడా గుట్టుచప్పుడు కాకుండా దాచేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈపోటీలు రద్దు కావడానికి నిధుల కొరతా…క్రీడా సౌకర్యాల లేమా…లేక క్రీడాకారుల అనాశక్తా…సమన్వయ లోపమా..అన్నది తెలియరాలేదు. డ్రాగన్ బోటు పోటీలు ఎందుకు రద్దయ్యాయన్న విషయాన్ని ఇప్పటికైనా కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలకు తెలియజేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మా వార్తలు నచ్చిన పాఠకులు వెబ్ సైట్ కు అడ్వర్టైజ్ మెంట్లు వచ్చే వరకు ఒక్కో వార్తకు కేవలం రూ. 2/ 9491659287 నెంబర్ కు ఫోన్ పే చేసి ప్రోత్సహించగలరని మనవి.
If our news items liked you please send only Rs 2/ by phone pay to 9491659287 for Encourage. until we get Adv.