బెంబేలెత్తిస్తున్న యువ బొద్దింకల పార్టీ!
భారతదేశంలోని జెన్ జెడ్ యువ బొద్దింకలు సంచలనం సృష్టిస్తున్నాయి. సామాజిక మాధ్యమాలకే పరిమితం కాకుండా రోడ్లపైకి వచ్చి వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. బొద్దింకల దెబ్బకు…
భారతదేశంలోని జెన్ జెడ్ యువ బొద్దింకలు సంచలనం సృష్టిస్తున్నాయి. సామాజిక మాధ్యమాలకే పరిమితం కాకుండా రోడ్లపైకి వచ్చి వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. బొద్దింకల దెబ్బకు బలంగా వేళ్లూనుకున్న, శ్రీలంక, నేపాల్ జెన్ జెడ్ ఉద్యమాలు చూసిన బిజెపి, కాంగ్రెస్ వంటి పార్టీలతో పాటు, బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల ఆలోచనా విధానంలో కూడా మార్పు కనిపిస్తోంది. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కొంతమంది యువతను ఉద్దేశించి పరాన్న జీవులైన బొద్దింకలతో పోల్చినట్లు వార్తలు రావడంతో మహారాష్ట్రలోని శంభాజీనగర్ కు చెందిన అభిజిత్ దిప్కే కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పేరుతో వ్యంగ్యాత్మకంగా సోషల్ మీడియాలో పార్టీని స్థాపించారు. ఈపార్టీని స్థాపించిన కొన్ని గంటల్లోనే వేలాది మంది యువత అందులో చేరిపోయారు. కొద్ది రోజులకే ఈసంఖ్య కోట్లకు చేరుకోవడంతో సిజెపి సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించాల్సి వచ్చింది. తమను పరాన్నజీవులతో పోల్చడంతోనే ఆన్లైన్లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో ఒక పేరడీ పార్టీని ఏర్పాటు చేసినట్లు అమెరికాలో విద్యను అభ్యసిస్తున్న అభిజిత్ చెప్పారు. ఈ పార్టీలో చేరడానికి, సోమరులు, నిరుద్యోగులు, నిరంతరం ఆన్లైన్లో ఉండేవారే అర్హులనే నిబంధన పెట్టారు. దీనికి యువత వెర్రెక్కిపోయారు. కాక్రోచ్ జనతా పార్టీ’కి ఫాలోవర్లు పెరగడంతో పాటు రాష్ట్రాల వారీగా పేజీలు క్రియేట్ అవుతున్నాయి. ‘కాక్రోచ్ జనతాపార్టీ తెలంగాణ’ పేరుతో ఓ ఇన్ స్టా పేజ్ క్రియేట్ అయింది. కాక్రోచ్ పార్టీలో చేరేందుకు ప్రముఖులు కూడా ఆసక్తి చూపించడం విశేషం. మాజీ క్రికెటర్, ఎంపీ కీర్తి ఆజాద్ ఆ పార్టీలో చేరాలనుకుంటున్నట్టు చెప్పారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు కూడా దీనికి మద్దతు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రాల వారీగా నాయకులు తయారుకావడం విశేషం.
బొద్దింకల జనతా పార్టీ మ్యానిఫెస్టో కూడా చాలా ఆసక్తికరంగా ఉంది.”ఈ మ్యానిఫెస్టో భారత ప్రజాస్వామ్యం ప్రస్తుత స్థితిని, రాజకీయ పరిస్థితిని ప్రతి బింబిస్తుందని విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు ఉన్నత పదవులు పొందడాన్ని ప్రశ్నిస్తోంది. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండాలని, . న్యాయవ్యవస్థ కూడా ప్రభుత్వ ప్రభావంలో పడితే ఇంకేం మిగులుతుందని సిజెపి నిలదీస్తోంది. అప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడతారని ప్రశ్నిస్తున్నారు. చిన్నప్పటి నుంచి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇస్తారని వింటూనే ఉన్నామని, కానీ ఇప్పటికీ అది జరగలేదు. మీరు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే వారికి 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తోంది.
బిజెపి విధానాలకు వ్యతిరేకంగానే కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించిందన్నది బిజెపి అనుమానం. దీంతో ఆపార్టీకి వ్యతిరేకంగా బొద్దింకలను చంపేందుకు వినియోగించే హిట్ పేరుతో హిట్ జనతా పార్టీని బిజెపి మద్దతుదారులు ప్రారంభించి, సామాజిక మాధ్యమాల్లో ఎదురుదాడికి దిగుతున్నారు. సిజెపి ప్రభావం ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యల్లో కూడా కనిపించడం గమనార్హం. ఇటీవల ఆయన మాట్లాడుతూ పార్టీ నేతలు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా, యువతకు చేరువగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక ఎపిలో ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్, వైసిపి అధినేత వైఎస్ జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ లను యువతకు ప్రతీకలుగానే భావిస్తారు. అయితే వారు తమ రాజకీయ, పాలనా విధానాలను సమీక్షించుకుని, పాలన సాగించకపోతే కొత్తగా పుట్టుకొచ్చే యువ బొద్దింకలు ప్రభావం చూపే అవకాశాలున్నాయి. మరోవైపు బొద్దింక జనతా పార్టీ భవిష్యత్తు ఏంటీ, సామాజిక మాధ్యమాలకే పరిమితమా…లేక దేశంలో మార్పుకు నాంది పలుకుతుందా అన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది. నేపాల్, శ్రీలంకల్లో జెన్ జెడ్ ఉద్యమాలు కనిపించాయి. నేపాల్లో నిరసనల తర్వాత ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది. శ్రీలంక కొత్త అనురకుమార దిశనాయకే జెన్ జెడ్ ప్రతినిధే కావడం గమనార్హం. అయితే తాము హింసను ప్రేరేపించడానికి వీధుల్లోకి రామని, ఒకవేళ రేపు వీధుల్లోకి వచ్చినా, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగానే వస్తామని కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. దేశంలోని వ్యవస్థలు, రాజకీయ పార్టీల పట్ల యువతలో పేరుకుపోయిన నైరాశ్యానికి ఈమార్పు నిదర్శనంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న పార్టీలకు ప్రత్యామ్నాయాలను కోరుకుంటున్నాయన్నది కాక్రోచ్ జనతా పార్టీకి లభిస్తున్న ఆదరణను బట్టి తెలుస్తోంది.
మా వార్తలు నచ్చిన పాఠకులు వెబ్ సైట్ కు అడ్వర్టైజ్ మెంట్లు వచ్చే వరకు ఒక్కో వార్తకు కేవలం రూ. 2/ 9491659287 నెంబర్ కు ఫోన్ పే చేసి ప్రోత్సహించగలరని మనవి.
If our news items liked you please send only Rs 2/ by phone pay to 9491659287 for Encourage. until we get Adv.