పవన్ పర్యటన ప్రకంపనలు!….కూటమిలో గాలి బీటలు
పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు మొట్టికాయలు…..పర్యాటకశాఖ చేపట్టిన పుష్కర పనులపై సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కినుక వహించడం….ఎపి పేపరుమిల్లు కాలుష్యం పట్ల…
పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు మొట్టికాయలు…..పర్యాటకశాఖ చేపట్టిన పుష్కర పనులపై సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కినుక వహించడం….ఎపి పేపరుమిల్లు కాలుష్యం పట్ల పట్ల స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లిప్తత…ఇలా ఒకరోజు అనుకుని రెండురోజులు సాగిన ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరం పర్యటన ప్రకంపనలు సృష్టిస్తోంది. గాలి బీటలు అంటే తెలుసుకదా…వైద్య పరిభాషలో ఎయిర్ లైన్ ఫ్యాక్చర్ అంటారు. అంటే పైకి కనిపించని బీటలు అని అర్థం. పవన్ పర్యటన తరువాత కూటమి నాయకుల మధ్య మునపటి సఖ్యత కానరావడం లేదన్నది ప్రజాభిప్రాయం. అంతకు ముందురోజు వరకు తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్న రాజమహేంద్రవరం ఎంపి దగ్గుబాటి పురందేశ్వరి పార్లమెంటు సమావేశాలు లేకపోయినా పవన్ పర్యటనకు ముందు రోజే వెళ్లిపోవడం గమనార్హం. ఎపి పేపరుమిల్లు గోదావరిని కాలుష్య కాసారం చేస్తున్న విషయం గురించి, ఇసుక దోపిడీ గురించి నగర ప్రజలతో పాటు, ప్రజాప్రతినిధులకు కూడా పూర్తి అవగాహన ఉన్నా పవన్ వచ్చి పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేసే వరకు స్పృహలోకి రాకపోవడం గమనార్హం. పేపరుమిల్లు కాలుష్యం గోదావరిలో కలుస్తున్న వెంకటనగరం ప్రాంతం సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోకి వస్తుంది. పేపరుమిల్లు ప్రధాన కార్యాలయం ఉన్న ప్రాంతం అత్యధిక సిఎస్ఆర్ నిధులు తెస్తున్నానని ప్రకటించుకున్న ఆదిరెడ్డి వాసు ప్రాతినిధ్యం వహిస్తున్న సిటీ నియోజకవర్గంలో ఉంది. పేపరుమిల్లు కాలుష్యాన్ని స్థానికంగా సెటిల్ చేసుకుంటున్నారని పవన్ వ్యాఖ్యానించడం ఈసందర్భంగా గమనార్హం.
గోదావరి ఇలా ఉంటే పుష్కర స్నానం చేస్తే పుణ్యం సంగతి దేవుడెరుగు…రోగాలు మాత్రం ఖాయమని పవన్ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈసందర్భంగా అక్కడే ఉన్న జిల్లాకు చెందిన మంత్రి దుర్గేష్ ను ఉద్దేశించి పుష్కరఘాట్ అంటే అందంగా తీర్చిదిద్దడం కాదు కదా మీదే బాధ్యత వహించాలి కదా అని పవన్ వ్యాఖ్యానించడంతో దుర్గేష్ తీవ్ర ట్రోలింగ్ కు గురయ్యారు. తమ మధ్య ఉన్నది ప్రజా సంక్షేమ సంకల్పం మాత్రమే కానీ రాజకీయ కాలుష్యం కాదని పవన్ వ్యాఖ్యలను దుర్గేష్ తేలిగ్గా తీసుకున్నా…దుర్గేష్ గురించి తెలిసిన వారు మాత్రం దుర్గేష్ ను పవన్ బహిరంగంగా మందలించడం సరికాదని వ్యాఖ్యానించడం విశేషం. మరోవైపు మిత్రపక్షానికి చెందిన బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు దుర్గేష్ ను ఉద్దేశించి, సగం మంత్రిగా అభివర్ణించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై బిజెపి వర్గాలను ఆరా తీయగా నియోజకవర్గం నిడదవోలులో ఆయన పరిస్థితిని ఉద్దేశించే అలా వ్యాఖ్యానించారని, దుర్గేష్ కు వ్యతిరేకంగా కాదని వివరణ ఇచ్చారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో పుష్కరాలరేవులో చేపట్టిన పుష్కర పనుల విషయంలో కందులకు, సిటీ ఎమ్మెల్యేకు మధ్య విభేదాలు చోటుచేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాసుకు ప్రమేయం లేకుండా దుర్గేష్ తనకు సన్నిహితుడైన కాంట్రాక్టర్ కు పనులు అప్పగించడం…పవన్ వచ్చే ముందురోజు జిల్లా అధికారులతో కలిసి దుర్గేష్ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వెళ్లడం విభేదాలకు మరింత ఆజ్యం పోసిందని చెబుతున్నారు.
ఏది ఏమైనా పవన్ పర్యటన తరువాత గోదావరిలో కాలుష్యం, పేపరుమిల్లు వ్యర్థాలకాలుష్యంపై కదలిక వచ్చి కాలుష్యం నిరోధానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడం స్వాగతించదగిన పరిణామం. పుష్కరాల నాటికి ఇది ఎంతవరకు సాకారం అవుతుందన్నది మాత్రం ప్రశ్నార్థకం. పుష్కరాల పనుల ప్రగతి, ప్రతిపాదనలపై అధికారుల తీరుపై కూడా పవన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పుష్కర పనుల్లో కూడా వేగం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మా వార్తలు నచ్చిన పాఠకులు వెబ్ సైట్ కు అడ్వర్టైజ్ మెంట్లు వచ్చే వరకు ఒక్కో వార్తకు కేవలం రూ. 2/- 9491659287 నెంబర్ కు ఫోన్ పే చేసి ప్రోత్సహించగలరని మనవి.
If our news items liked you please send only Rs 2/- by phone pay to 9491659287 for Encourage. until we get Adv.