- June 17, 2026
తండ్రి కోరిక తీర్చిన తనయుడు….ఒక పోలీసు అధికారి జీవిత విశేషాలు!
గత ఏడాది ఆపరేషన్ సిందూర్ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితులను తెలుసుకునేందుకు సిసిసి చానల్ తరుపున శాంతిభద్రతల విభాగంగా అదనపు ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు వాయిస్…
గత ఏడాది ఆపరేషన్ సిందూర్ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితులను తెలుసుకునేందుకు సిసిసి చానల్ తరుపున శాంతిభద్రతల విభాగంగా అదనపు ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు వాయిస్ తీసుకునేందుకు వెళ్లాను. ఆతరువాత ఆయన దర్యాప్తు చేసిన అంతర్ రాష్ట్ర చోరీ సంఘటనపై ఒక స్టోరీ రాశాను. అప్పటి నుంచి సుబ్బరాజుకు, నాకు మధ్య స్నేహబంధం బలపడింది. మధ్యలో ఆయన దీర్ఘకాలిక సెలవుపై అమెరికాలో స్థిరపడిన తన కుమారులు అల్లూరి వికాస్ వర్మ, సంతోష్ వర్మల వద్దకు వెళ్లి కొన్నాళ్లు గడిపి వచ్చే నాటికి ఆయన నాన్ కేడర్ ఎస్పీగా ఉద్యగోన్నతి పొందారు. తాజాగా సిఐడి ఎస్పీగా విజయవాడ బదిలీ అయ్యారు. వచ్చే ఆగస్టులో ఆయన పోలీసుశాఖ నుంచి పదవీ విరమణ పొందబోతున్నారు.
ఈసందర్భంగా తన గురించి రాయాలని కోరుతూ పూర్తి వివరాలు పంపారు. అందులో ఎన్నో ఆసక్తికర విశేషాలు ఉన్నాయి. సుబ్బరాజును మర్యాద పురుషోత్తముడిగా కనిపిస్తారు. తన వద్ద పనిచేసే సిబ్బందితో పాటు, తన వద్దకు వచ్చే వారి పట్ల కూడా ఎంతో మర్యాదగా, నిజాయితీగా, మానవతా దృక్పథంతో వ్యవహరిస్తారని పోలీసు సిబ్బంది చెబుతారు. కఠినంగా ఉంటూ..కరుకుగా మాట్లాడే పోలీసు శాఖలో ఆయన చేరికే ఆసక్తిని కలిగిస్తుంది. ఎస్ఐ నుంచి పోలీసుశాఖలో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేసి, ఎస్పీ స్థాయికి చేరిన ఆయన ప్రస్థానంలో వివాదరహితుడిగా, ఫ్రెండ్లీ పోలీసుగా పేరు గడించారు.
విజయనగరం జిల్లా మెరక ముడిదాం మండలం రాచగుమడాoలో జన్మించిన సుబ్బరాజు రాజకీయ నాయకుడైన తన తండ్రి అల్లూరి చిన నరసింహరాజు కోరిక మేరకు పోలీసు అధికారి అయ్యారు. కాంగ్రెస్ నాయకుడైన చిన్న నరసింహరాజు రాచగుమడాo గ్రామానికి 25 సంవత్సరాల పాటు ఏకగ్రీవ సర్పంచ్ గా, చీపురుపల్లి సమితి ప్రెసిడెంట్ గా 2 సంవత్సరాలు సేవలందించారు. మెరకముడిదాం మండల తొలి వైస్ ప్రెసిడెంట్ పనిచేశారు. ప్రజాసమస్యల పరిష్కారంలో భాగంగా విద్యార్థి దశలో సుబ్బరాజు తండ్రితో పాటు అధికారులను కలిసేందుకు వెళ్లేవారు. ప్రజల్లో పోలీసుల పట్ల ఉన్న భయభక్తులను గమనించిన చిన నరసింహరాజు తన కుమారుడ్ని పోలీసు అధికారి కావాలని కోరారు. తండ్రి కోరిక మేరకు సుబ్బరాజు ఎస్ఐగా ఎంపికయ్యారు. సామాజిక స్పృహ, సేవాభావం మెండుగా ఉన్న సుబ్బరాజు పార్వతీపురంలోని ఎస్‌వీడి డిగ్రీ కళాశాల ఎన్ సిసి అండర్ ఆఫీసర్ గా 1985 డిసెంబర్ నుంచి 1986 జనవరి వరకు వరకట్నం నిషేధం, జాతీయసమైక్యత చాటుతూ పార్వతీపురం నుండి న్యూఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేయడం విశేషం. జనవరి 26న డిల్లీ ఎర్రకోటలో జరిగిన గణతంత్ర పేరేడ్ లో పాల్గొన్నారు.
1989వ సంవత్సరంలో సివిల్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా, 2001లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గా, 2010లో డిఎస్పీగా , 2020లో అదనపు ఎస్పీగా పోలీసుశాఖలో తనదైన ముద్ర వేసిన సుబ్బరాజు నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి పొంది తండ్రి ఆశయం కన్నా ఉన్నతంగా ఎదిగారు. 1990 మే తొలి వారంలో సుబ్బరాజు చింతపల్లి ఎస్ఐగా విధుల్లో చేరిన రోజే భారీ తుపాను సంభవించింది. శారదానది ఉప్పొంగింది. అనకాపల్లి పోలీసుస్టేషన్ తో పాటు, క్వార్టర్లు కూడా ధ్వంసమయ్యాయి. ఏజెన్సీలోని ఘాట్లన్నీ కొండచెరియలు విరిగిపడి రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. నాటి చింతపల్లి డిఎస్పీ సూర్యనారాయణతో కలిసి 16రోజుల పాటు నిర్విరామంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న విషయాన్ని సుబ్బరాజు గుర్తు చేసుకున్నారు. అనంతగిరిలో పనిచేస్తున్న కాలంలో గిరిజనుల సమస్యల సత్వర పరిష్కారానికి మూడు టెంట్ల విధానాన్ని నిర్వహించారు. దీనిలో ఒక టెంట్ లో ఎస్పీ, ఇతర పోలీసు అధికారులు ఉండి వినతిపత్రాలు స్వీకరించేవారు. వాటిని సంబంధిత అధికారులకు పంపేవారు. మరో టెంట్ లో ప్రజలు మావోస్టుల పట్ల ఆకర్షితులు కాకుండా వారిలో చైతన్యం కల్పించేందుకు జననాట్య మండలికి పోటీగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వారు. మరో టెంట్ లో ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించే వారు. కొత్తూరు సిఐగా పనిచేసిన కాలంలో బత్తిలి వద్ద జరిగిన మావోస్టులతో జరిగిన ఎన్ కౌంటర్ లో పాల్గొని, ఒక మావోయిస్టును మట్టుబెట్టారు.
పోలీసుశాఖలో ఏ విభాగం ప్రాధాన్యత దానిదేనని, దేన్నీ తక్కువగా చూడలేమని, ఎస్బీ, ఇంటెలిజెన్స్ విభాగం రాజకీయ, సామాజికాంశాలను విశ్లేషిస్తే..డిసిఆర్బీ విభాగం పోలీసుశాఖ ఏ విధంగా పనిచేయాలన్నది సూచిస్తుందని సుబ్బరాజు వివరించారు. డిసిఆర్బీ విభాగం చోరీల నివారణకు అమావాస్య రాత్రి పక్షాన్ని గుర్తించి, పోలీసుశాఖను అప్రమత్తం చేస్తుందన్నారు. తన హయాంలో సుబ్బరాజు విశాఖపట్నం, శ్రీకాకుళం గిరిజన ప్రాంతాల్లో పలు వైద్యశిబిరాలు, శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాల్లో న్యాయ అవగాహన శిబిరాలు నిర్వహించారు. ప్రజా ఫిర్యాదులకు రసీదులు ఇచ్చే విధానాన్ని అమలు చేశారు. సుబ్బరాజు సేవలకు గుర్తింపుగా పలు అవార్డులు, రివార్డులు, పురస్కారాలు పొందారు. 2025 ఉగాది సందర్భంగా సుబ్బరాజుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ సేవా పతకం లభించింది. 2015 గోదావరి పుష్కరాల సందర్భంగా అందించిన విశిష్ట సేవలకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుండి ప్రశంసా పత్రం అందు కున్నారు. డీజీపీ, ఐజీ, కలెక్టర్లు, ఎస్పీల పలు మెరిట్ సర్టిఫికేట్లు, 141 నగదు బహుమతులు పొందారు.