రాజమహేంద్రవరంలో కూటమి కకావికలం!

ప్రస్తుతం ఎపిలో అధికారంలో ఉన్న టిడిపి, జనసేన, బిజెపి కూటమి పార్టీలు మరో 15ఏళ్ల పాటు కూటమి పార్టీలు కలిసే ఉంటాయని జనసేనాని, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్…

 రాజమహేంద్రవరంలో కూటమి కకావికలం!

ప్రస్తుతం ఎపిలో అధికారంలో ఉన్న టిడిపి, జనసేన, బిజెపి కూటమి పార్టీలు మరో 15ఏళ్ల పాటు కూటమి పార్టీలు కలిసే ఉంటాయని జనసేనాని, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదేపదే ప్రకటిస్తున్న నేపథ్యంలో ఉండగా రాజమహేంద్రవరంలో మాత్రం కూటమి కకావికలం కావడం చర్చనీయాంశంగా మారింది. రాజమహేంద్రవరంలోని ఎపి పేపరుమిల్లు గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈవిచిత్రం చోటు చేసుకుంది. బిజెపి అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ సైద్ధాంతికంగా బద్ధశత్రువైన సిపిఎం అనుబంధ సిఐటియుతో జత కట్టగా, వామపక్షానికి చెందిన సిపిఐ పార్టీ అనుబంధ ఏఐటియుసి జనసేనతో కలిసి ఇక్కడ పోటీ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ మాత్రం ఒంటరిగా పోటీ చేస్తుండటం గమనార్హం. ఈనెల 29వ తేదీన ఎపి పేపరుమిల్లు గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు 711 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
పేపరుమిల్లు ఎన్నికల్లో కూటమి పార్టీలకు సంబంధించిన కార్మిక సంఘాలు, విడివిడిగా పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. పేపరుమిల్లు ఎన్నికల్లో తమ రాజకీయ పార్టీల సిద్ధంతాలకు విరుద్ధమైన పార్టీలకు చెందిన కార్మిక సంఘాలు కలిసి పోటీ చేయడం గమనార్హం. ఐఎన్టీయుసి, వైఎస్సాసిఇయూ, సిఐటియూ, ఎస్ డబ్ల్యూ. డబ్ల్యూ. ఏ, భారతీయ మజ్దూర్ సంఘ్ ఒక కూటమిగా పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐఎన్టీయూసి, సిపిఎంకు చెందిన సిఐటియూతో కలిసి బిజెపి అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ కలిసి పోటీ చేయడం విశేషం. అలాగే వామపక్ష పార్టీ అయిన సిపిఐకి చెందిన ఎఐటియుసి సిఐటియుతో కాకుండా జనసేన కార్మిక సంఘంతో కలిసి పోటీ చేస్తోంది. ఏఐటియూసి, ఎంప్లాయిస్ యూనియన్, యునైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్, జనసేన ట్రేడ్ యూనియన్ యునైటెడ్ ఫ్రంట్ గా కలిసి పోటీ చేస్తున్నాయి. గతంలో గుర్తింపు సంఘంగా ఉన్న అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన టిఎన్టీయూసి పోటీలో నామమాత్రంగా మిగిలింది. టిఎన్ టియుసి ఎస్ కె ఎస్ అనే చిన్న కార్మిక సంఘంతో కలిసి పోటీ చేస్తోంది. అందుకే స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, టిడిపి సీనియర్ నేత గన్ని కృష్ణ వంటి వారు ఎన్నికల పగ్గాలు వదిలేసినట్లు చెబుతున్నారు. కూటమి పార్టీలను కలిసి పోటీ చేసేలా ఒప్పించేందుకు ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్న ప్రచారం జరుగుతోంద.
ఈఎన్నికల్లో జనసేన పార్టీ చెందిన యూనియన్ ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫ్రంట్ బలంగా ఉందని అంచనా వేస్తున్నారు. అయితే పేపరుమిల్లు ఎన్నికలను పర్యవేక్షిస్తున్న టిఎన్టీయూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు మాత్రం గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఈఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ చేశారు. గెలిస్తే ఎమ్మెల్యే, తన ఘనత అని, ఓడిపోతే కార్మికుల తప్పిదమేనని పేర్కొనడం గమనార్హం. ఒకప్పుడు టిడిపిలో పనిచేసి, తరువాత వైసిపిలో చేరి, మళ్లీ ఇప్పుడు టిడిపి వైపు మొగ్గు చూపుతున్న పేపరుమిల్లు కార్మికసంఘం మాజీ నేత ప్రవీణ్ చౌదరి పేపరుమిల్లు పరంపర స్కీమ్ లో వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో టిఎన్టీయూసి, వైఎస్సార్సీయూలకు ప్రతికూలంగా మారిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అలాగే కడియం పేపరుమిల్లు లాకౌట్ విషయంలో అధికార పార్టీ నాయకులు స్పందించిన తీరుపై కూడా కార్మికులు అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. మరోవైపు కూటమి పార్టీలు విడిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం పార్టీలపై పడకుండా ఉండేందుకు ఎన్నికల ప్రచారానికి ఎపి పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్, జనసేన, టిడిపి, బిజెపి నాయకులు దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.

మా వార్తలు నచ్చిన పాఠకులు వెబ్ సైట్ కు అడ్వర్టైజ్ మెంట్లు వచ్చే వరకు ఒక్కో వార్తకు కేవలం రూ. 2/ 9491659287 నెంబర్ కు ఫోన్ పే చేసి ప్రోత్సహించగరమని మనవి.
If our news items liked you please send only Rs 2/ by phone pay to 9491659287 for Encourage. until we get Adv.

Leave a Reply