ఆత్మగౌరవం ఆయన ఆభరణం….అదే..
రాజకీయాల కోసం తన పేరు చివర రెడ్డి తగిలించుకున్న…కన్నకూతుర్ని కూడా దూరం చేసుకున్న నాయకులెవరైనా ఉన్నారంటే అది ముద్రగడ పద్మనాభమే. ఆత్మగౌరవం ఆయన ఆభరణం..మర్యాద…ఆతిధ్యం ఆయన ప్రత్యేకత.…
రాజకీయాల కోసం తన పేరు చివర రెడ్డి తగిలించుకున్న…కన్నకూతుర్ని కూడా దూరం చేసుకున్న నాయకులెవరైనా ఉన్నారంటే అది ముద్రగడ పద్మనాభమే. ఆత్మగౌరవం ఆయన ఆభరణం..మర్యాద…ఆతిధ్యం ఆయన ప్రత్యేకత. మొండితనం, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా చెప్పిన మాటకు, ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండటం ఆయన నైజం. ఈవైఖరి వల్ల కొన్ని సార్లు సామాజికపరమైన ప్రయోజనం చేకూరినా…ముద్రగడ రాజకీయంగా, వ్యక్తిగతంగా తీవ్రంగా నష్టపోయారని చెబుతారు. కాంగ్రెస్, తెలుగుదేశం, బిజెపి, చివరకు వైసిపిలో చేరారు. ఆత్మగౌరవానికి భంగం కలిగిన చోట ముద్రగడ ఇమడలేకపోయారు. అందుకే మిగిలిన రాజకీయ నాయకుల్లా ముద్రగడ పద్మనాభం రాజకీయంగా ఎదగలేకపోయారు. ముద్రగడ బిజెపిలో కొనసాగితే ఎంతో ఉన్నత స్థాయిలో ఉండేవారోనని ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించడం ఇక్కడ ప్రస్తావనార్హం.
హిందువుల్లో కొన్ని కులాల మినహా మిగిలిన అన్ని కులాల్లో భౌతికకాయాన్ని దహనం చేయడం సాంప్రదాయం. భర్త పోతే భార్య పసుపు..కుంకుమలు తొలగిస్తారు. 3వ రోజు చిన్నకార్యం, 11వ రోజు పెద్దకర్మ చేస్తారు. తన భౌతికకాయాన్ని తన నివాసం వద్దే పూడ్చాలని ముద్రగడ ముందే చెప్పారు. తద్వారా పాతకాలం నాటి ఈఆచార, సాంప్రదాయాలను పక్కన పెట్టించారు. ముద్రగడ మరణం కన్నా కుమార్తె బార్లపూడి క్రాంతి భారతి, మరణానంతర ఆచార వ్యవహారాలను పక్కన పెట్టించడమే పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక చరిత్రలో ముద్రగడ పద్మనాభంకు, ఆయన చేపట్టిన ఉద్యమాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కాపు సామాజిక వర్గాన్ని బీసీల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని ఆయన దశాబ్దాలుగా పోరాటాలు చేశారు. ముద్రగడ పద్మనాభం 1990 దశకం నుంచే కాపు రిజర్వేషన్ల అంశాన్ని బలంగా ముందుకు తెచ్చారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపులను బీసీల్లో చేరుస్తూ జీవో ఇచ్చేలా ఒత్తిడి తెచ్చారు. అనివార్యకారణాల వల్ల ఇప్పటికీ కాపులకు రిజర్వేషన్ల అంశం కాపులకు అందని ద్రాక్షగానే మారింది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ 2016లో తునిలో ముద్రగడ నిర్వహించిన కాపు ఐక్యగర్జన సభలో కార్యకర్తలు అదుపుతప్పడంతో హింసాత్మకంగా మారడం, రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను దహనం చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముద్రగడను విమర్శల పాలు చేయడంతో పాటు, న్యాయపరమైన ఇబ్బందులకు గురి చేసింది. తుని ఘటన తర్వాత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ముద్రగడ తన కుటుంబ సభ్యులతో కలిసి కిర్లంపూడిలోని తన నివాసంలో, రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో పలుమార్లు ఆమరణ నిరాహార దీక్షలకు దిగారు. ఈసందర్భంగా ముద్రగడను, ఆయన కుటుంబాన్ని నాటి తెలుగుదేశం ప్రభుత్వం అవమానించిందని ఆయన అనుచరులు ఇప్పటికీ విమర్శిస్తుంటారు. నాటి నుంచి ముద్రగడ తెలుగుదేశం పార్టీకి బాగా దూరం జరిగి, వైసిపికి దగ్గరయ్యారు. ముద్రగడ ఉద్యమాల ఒత్తిడి కారణంగానే అప్పటి ప్రభుత్వం కాపుల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి జస్టిస్ మంజునాథ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆతరువాత కేంద్రం ప్రవేశపెట్టిన 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% కాపులకు కేటాయిస్తూ అప్పటి టిడిపి ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ఆమోదించినా తరువాతి కాలంలో చట్టపరమైన చిక్కుల్లో పడింది. ఈనేపథ్యంలోనే కాపుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులతో కాపు కార్పొరేషన్ ఏర్పాటైంది. కాపు సామాజిక అభ్యున్నతి కోసం ముద్రగడ అలుపెరగని పోరాటం చేశారు. కాపులకు సామాజికంగా పెద్ద దిక్కుగా ఉన్న ముద్రగడ పద్మనాభం మరణం వారికి తీరనిలోటే. అందుకే ముద్రగడ భౌతికకాయాన్ని సందర్శించేందుకు రాజకీయ, ఆర్థిక స్థాయిలకు అతీతంగా కాపులంతా కిర్లంపూడికి బారులుతీరారు. ముద్రగడ లాంటి నేతను మరి చూడలేమని వారంతా ముక్తకంఠంతో ఆవేదన వ్యక్తం చేశారు.