రాజమహేంద్రవరం గడ్డా…ఆదిరెడ్డి అడ్డా..! మద్యం సిండికేట్ పది పెంపుపై భరత్ మౌనమేల!
ఒకప్పుడు మాజీ ఎంపి భరత్ రాజమహేంద్రవరం తన అడ్డాగా అని ప్రకటించుకున్నారు. కానీ నేడు అదిరెడ్డి వాసు అడ్డాగా మారిపోయింది. వందల రూపాయలు చేతిలో పట్టుకుని పశ్చిమగోదావరి…
ఒకప్పుడు మాజీ ఎంపి భరత్ రాజమహేంద్రవరం తన అడ్డాగా అని ప్రకటించుకున్నారు. కానీ నేడు అదిరెడ్డి వాసు అడ్డాగా మారిపోయింది. వందల రూపాయలు చేతిలో పట్టుకుని పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ నుంచి వచ్చిన ఆదిరెడ్డి వాసు కుటుంబం నేడు తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఆర్థికంగా…రాజకీయంగా…సామాజికంగా అత్యంత శక్తివంతంగా మారింది. ఆయన తండ్రి అప్పారావు ఎమ్మెల్సీగా .. తల్లి వీరరాఘవమ్మ మేయర్ గా పనిచేయగా సతీమణి భవానీ ఎమ్మెల్యే పనిచేశారు. ఈఎన్నికల ద్వారా రాజకీయంగా వారు విశేష అనుభవం గడించారు. ఎవరిని ఎక్కడ నొక్కాలో…ఎక్కడ పెట్టాలో…ఎలా తమదారిలోకి తెచ్చుకోవాలో ఆదిరెడ్డి కుటుంబానికి బాగా అనుభవంలోకి వచ్చిందని చెప్పుకుంటారు. ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత వారి కుటుంబ వ్యాపారమైన చిట్ ఫండ్ వ్యాపారం కూడా తమదైన శైలిలో వృద్ధిలోకి తీసుకుని వచ్చినట్లు చెబుతున్నారు. రాజమహేంద్రవరంలోని కోఆపరేటివ్ బ్యాంకులు, మద్యం సిండికేట్ కూడా ఎమ్మెల్యే వాసు కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రాజకీయంగా పార్టీలోని ప్రత్యర్థి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వర్గానికి చెందిన వారిని పక్కనపెట్టి నగరంలోని అన్ని డివిజన్లలో తన విధేయులనే ఇన్చార్జిలుగా నియమించుకున్నారు. అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకున్నారు. మిత్రపక్షమైన జనసేనలో అత్తి సత్యనారాయణ, వై శ్రీనివాస్ ల మధ్య నెలకొన్న నాయకత్వ విభేదాలు కూడా వాసు ఆధిపత్యానికి దోహదం చేస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు ఇప్పట్లో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ…నగరంలో తన నాయకత్వానికి ఎదురులేకుండా చేసుకున్నారన్న వాదన వినిపిస్తోంది.
వాసు అతిపెద్ద కోఆపరేటివ్ బ్యాంకు ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ గా తన పెదనాన్న చల్ల శంకరరావును గెలిపించుకున్నారు. ఆర్యాపురం బ్యాంకులో అవకతవకలు జరుగుతున్నాయని సొంత ఎల్లో మీడియాలో భాగమైన టివీ-5లో పలు వార్తలు ప్రసారమయ్యాయి. ఎమ్మెల్యే, శంకరరావు వర్గీయులు వివిధ రకాలుగా ఒత్తిడి తెచ్చి వాటిని నిలిపివేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే సొంత పాలనను సాగించేందుకు వీలుగా మ్యాక్స్ చట్టంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమైన ఇన్నీసుపేట కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ కోళ్ళ అచ్యుతరామారావు కూడా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే పనిచేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాదులకు కోటగా నిలిచిన జాంపేట కోఆపరేటివ్ బ్యాంకుకు చైర్మన్ గా సేవలందించిన వ్యాపారవేత్త దివంగత బొమ్మన రాజ్ కుమార్ తనయుడు జయకుమార్ తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకున్నా తరువాతే బ్యాంకు చైర్మన్ గా నియమితులు కావడం గమనార్హం. తద్వారా కోఆపరేటివ్ బ్యాంకులపై కూడా వాసు పూర్తి ఆధిపత్యాన్ని సాధించినట్టయ్యింది.
ఇక ఆదిరెడ్డి వాసు చిన మామగారు కింజారపు అచ్చెంనాయుడు రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బావమరిది కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్రంలోని ఎన్ డిఏ కూటమి ప్రభుత్వంలో కీలకమైన పౌరవిమానయాన శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. తద్వారా ఆదిరెడ్డి కుటుంబం పలుకుబడి డిల్లీ స్థాయి వరకు విస్తరించింది.
ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అయితే రాజమహేంద్రవరంలో ప్రతిపక్ష వైసిపి నాయకుల అనైక్యత ఆదిరెడ్డి వాసుకు కలిసివస్తున్నట్లు కనిపిస్తోంది. వైసిపి సిటీ ఇన్చార్జి, మాజీ ఎంపి మార్గాని భరత్ రామ్ కు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, గణేష్ కు మధ్య ఇప్పటికీ సయోధ్య లేదు. ఈసోదరులిద్దరూ వాసుకు సన్నిహితంగా ఉంటున్నారన్న ప్రచారం ఉంది. ఈనేపథ్యంలో భరత్ ఒంటరిపోరాటం చేయాల్సి వస్తోందన్న వాదన వినిపిస్తోంది. ప్రత్యర్థిని రాజకీయంగా బలహీనపరిచేందుకు వారి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలన్న సూత్రాన్ని విస్మరించి, మద్యం సిండికేట్ రెండునెలలుగా ఎంఆర్పీపై రూ. 10 పెంచి అమ్ముతున్నా మార్గాని భరత్ రామ్ నోరుమెదపకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మొన్నటి వరకు మద్యం సిండికేట్, ఎమ్మార్పీ ధరలపై ధ్వజమెత్తిన భరత్ కొద్ది రోజుల నుంచి మద్యంపై తప్ప అన్నీ అంశాలపైనా స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కనుసన్నల్లో పనిచేస్తున్న మద్యం సిండికేట్ భరత్ ను కూడా మేనేజ్ చేసి, మాట్లాడకుండా చేసిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈపరిణామాలను గమనిస్తే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం గడ్డను అడ్డాగా చేసుకుని ఆర్థికంగా, సామాజిక, రాజకీయంగా బలంగా ఉన్నారన్న విషయం అర్థమవుతోంది. భావి ముఖ్యమంత్రిగా ప్రచారం పొందుతున్న యువనేత లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం కన్నా వచ్చే ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ సాధిస్తానని లోకేష్ తోనే సవాల్ చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో కూడా సీటు ఖరారు చేసుకున్నట్టయ్యిందని విశ్లేషిస్తున్నారు. రాజకీయంగా సుస్థిర స్థానాన్ని సంపాదించడం కోసం మనవార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనా వాసును ఎదుర్కోనే అంశంపై ప్రత్యర్థి పార్టీలు ప్రత్యేక దృష్టి సారించకపోతే ఆయా పార్టీల నాయకులకు భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవు.
మా వార్తలు నచ్చిన పాఠకులు వెబ్ సైట్ కు అడ్వర్టైజ్ మెంట్లు వచ్చే వరకు ఒక్కో వార్తకు కేవలం రూ. 2/ 9491659287 నెంబర్ కు ఫోన్ పే చేసి ప్రోత్సహించగరమని మనవి.
If our news items liked you please send only Rs 2/ by phone pay to 9491659287 for Encourage. until we get Adv.