కాపులు కాదు…పావులు!

మొన్నటి వైసిపి ప్రభుత్వ హయాంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వైసిపి ఎమ్మెల్సీ అనంత బాబు దళిత సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ ను హత్య చేసి…

 కాపులు కాదు…పావులు!

మొన్నటి వైసిపి ప్రభుత్వ హయాంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వైసిపి ఎమ్మెల్సీ అనంత బాబు దళిత సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ ను హత్య చేసి మృతదేహాన్ని నేరుగా డోర్ డెలివరీ చేస్తే…నేడు టిడిపి, జనసేన, కూటమి ప్రభుత్వ హయాంలో కాపు సామాజిక వర్గానికి చెందిన గాదె సాయికృష్ణను అదే సామాజిక వర్గానికి చెందిన కృష్ణలంక సిఐ నాగరాజు బూడిద కూడా మిగల్చకుండా ఏకంగా శవాన్నే మాయం చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే అంశం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి వరకు ఎల్లో మీడియా ప్రముఖంగా కనిపించి, వినిపించిన అనంతబాబు శవం డోర్ డెలివరీ కేసు సాయికృష్ణ లాకప్ డెత్ తరువాత కాస్త మసకబారినట్లు కనిపిస్తోంది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసు విషయంలో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా టిడిపి ఆత్మరక్షణలో పడగా…వైసిపి ఈఅంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. వైసిపి నాయకులంతా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నివాసంలో సమావేశమై రాష్ట్రవ్యాప్తంగా బాధిత కాపులకు అండగా ఉంటామని ప్రకటించారు. సాయికృష్ణ లాకప్ డెత్ తమ పార్టీకి ఇబ్బందికరంగా మారిందని గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాయికృష్ణ తల్లిని, కుటుంబ సభ్యులను పిలిపించుకుని ఊరడించే ప్రయత్నం చేశారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు కూడా సాయికృష్ణ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అప్పటి వరకు సాయికృష్ణపై రౌడీషీటర్ ముద్రవేసిన టిడిపి నాయకులు చంద్రబాబు పరామర్శల తరువాత వెనక్కి తగ్గారు. ఈపరిణామాలతో రాష్ట్రంలో కాపులు బలమైన సామాజికవర్గమన్నది స్పష్టమైంది. అయితే అనూహ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం తగ్గేదే లేదనట్లు వ్యవహరిస్తున్నారు. నేరస్తులు ఏవరైనా..ఏ కులమైనా తొక్కినార తీస్తామని స్పష్టం చేయడం చర్చనీయాంశంగా మారింది. కుల రాజకీయాలు చేయనని ఆయన చెప్పారు. పవన్ వ్యాఖ్యలపై ఒక వర్గానికి చెందిన కాపులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కనీసం సాయికృష్ణ లాకప్ డెత్ చేయడం దారుణమని ఖండించలేదని, చంద్రబాబునాయుడు పరామర్శించినా…జనసేన పార్టీకి చెందిన వారమని చెప్పుకుంటున్న సాయికృష్ణ కుటుంబానికి సానుభూతిని తెలియజేయకపోవడాన్ని తప్పుపడుతున్నారు.

ఏతావాతా ఈపరిణామాలతో తేలేదేమిటంటే కాపులు కేవలం అధికారానికి చేరుకోవడానికి పావులుగా మాత్రమే ఉపయోగపడుతున్నారన్నది సుస్పష్టం. పార్టీ ఏదైనా రాష్ట్రంలో ఇప్పటి వరకు కమ్మవారు…రెడ్లే ఎక్కువకాలం పాలన సాగించారు. దీంతో జనాభాపరంగా అత్యధికంగా ఉన్న కాపులు కూడా అధికారంపై ఆశలు పెంచుకున్నారు. మెజార్టీగా ఉన్న తాము ఎప్పుడూ అధికార పల్లకీలు మోయడమేనా…అధికారం అనుభవించలేమా అన్న ఆలోచన వారిలో మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినపుడు వారిలో ఆశలు కాస్త చిగురించాయి. కాపుల్లోని అనైక్యత వల్ల చిరంజీవి ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు. దీంతో ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి, చేతులు దులిపేసుకున్నారు. ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేనను ప్రారంభించి, దూకుడుగా రాజకీయాలు చేయడంతో మరోసారి కాపుల్లో అధికార ఆశలు చిగురించాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కాపుల్లో ఎక్కడ లేని ఐక్యత కనిపించింది. ఈనేపథ్యంలో జనసేన పోటీ చేసిన 21కి 21 స్థానాల్లో విజయం సాధించి రికార్డు సృష్టించింది. కూటమి ప్రభుత్వంలో పవన్ డిప్యుటీ సిఎంగా బాధ్యతలు స్వీకరించారు. గత ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్ ఎపిలో టిడికి ప్రాణంపోయడంతో పాటు, కింగ్ మేకర్ గా ఆవిర్భవించారు. పవన్ ఎపిలో భవిష్యత్ అధికారం కాపులదేనన్న భరోసా కాపుల్లో కలిగించారు. అయితే పవన్ కల్యాణ్ మరో పదేళ్లు చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలన్న ప్రకటన మెజార్టీ కాపులకు పెద్దగా రుచించడం లేదు. తాను కుల రాజకీయాలకు వ్యతిరేకమన్న ఆయన ప్రకటనతో కాపులు పల్లకీల మోతకే పరిమితమా అధికారం వారికి అందని ద్రాక్షేనా అన్న చర్చలు సాగుతున్నాయి. తమ నాయకుడికి ఎక్కడ తగ్గాలో తెలుసు కానీ ఎక్కడ హెచ్చాలో తెలిసినట్లు లేదన్న విమర్శ వినిపిస్తోంది. మరోవైపు వైసిపిలోనూ దాదాపు ఇదే పరిస్థితి. వైసిపి అధికారంలోకి వస్తే జగన్ తప్ప కాపు నాయకుడు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు. కాపులను ఆకట్టుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టినా, అది అలంకారప్రాయమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ సహజలక్షణాలైన ఆవేశం…అనైక్యత కాపులను అధికారానికి దూరం చేస్తున్నాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

కనీసం కల్యాణ మండపం నిర్మించుకోలేకపోతున్నారు

చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగరంలో కల్యాణ మండపాన్ని నిర్మించుకోవాలని కాపు సామాజిక వర్గీయుల చిరకాల వాంఛ. ఇది దశాబ్దాలు గడిచినా తీరనికోరికగానే మిగిలిపోయింది. కాకినాడ సహా జిల్లావ్యాప్తంగా పలు పట్టణాలు, మండల కేంద్రాల్లో కూడా కాపు కల్యాణ మండపాలు ఉన్నాయి. ప్రస్తుతం కాపు రాజమహేంద్రానికి కందుల దుర్గేష్ జనసేన పార్టీ తరుపున పర్యాటకశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. రాజమహేంద్రవరంలోని ప్రముఖులుగా చెలామణి అవుతున్నకాపు సామాజిక వర్గం పెద్దలకు, ఆ సామాజిక వర్గీయులు ఎంతో మంది ఉన్నా కల్యాణ మండపం లేకపోవడం పెద్ద వెలితిగా కనిపిస్తోంది. దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు కాలం నుంచీ….ఇంకా చెప్పాలంటే గత మూడు దశాబ్దాలుగా రాజమహేంద్రవరంలో కల్యాణ మండపం కల నెరవేరడం లేదు. ప్రతీ ఎన్నికల్లోనూ జనాభాపరంగా మెజార్టీగా ఉన్న కాపులను ఆకట్టుకునేందుకు ఇదో నినాదంగా కూడా పనికి వస్తోంది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా పనిచేసిన డాక్టర్ ఆకుల సత్యనారాయణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ గా, రాజానగరం ఎమ్మెల్యేగా పనిచేసిన జక్కంపూడి రాజా కాపు కల్యాణ మండపం నిర్మాణానికి కృషిచేస్తామని హామీలు గుప్పించారు కానీ, హామీని ఆచరణలోకి తేలేకపోయారు. దాదాపు 30ఏళ్ల క్రితం జక్కంపూడి హయాంలో కాపు కల్యాణ మండపం సాకారం అయినట్టే అయి చేజారిపోయింది. నాడు కాపు కల్యాణ మండపానికి ఎస్వీ మార్కెట్ వద్ద దివంగత మాజీ మంత్రి, పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ చేతుల మీదుగా శంఖుస్థాపన చేసినట్లుగా చెబుతున్నారు. శంఖుస్థాపనైతే జరిగింది కానీ కల్యాణ మండపం నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పడలేదు. కల్యాణ మండపానికి స్థలాన్ని విరాళంగా ఇస్తానన్న దాత యేరుకొండ శ్యామ్ సుందర్ స్థలాన్ని రిజిస్టర్ చేయలేదని చెబుతున్నారు. మొన్న కాపు కల్యాణ మండపానికి కలెక్టరేట్ సమీపంలో స్థలం కేటాయించినా అది తమ స్థాయికి సరిపోదన్న అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమకు కల్యాణ మండపం లేదన్న విషయం గుర్తు చేయగానే కొద్దిరోజులు హడావుడి చేస్తారు. తరువాత మర్చిపోతున్నారు.

మా వార్తలు నచ్చిన పాఠకులు వెబ్ సైట్ కు అడ్వర్టైజ్ మెంట్లు వచ్చే వరకు ఒక్కో వార్తకు కేవలం రూ. 2/ 9491659287 నెంబర్ కు ఫోన్ పే చేసి ప్రోత్సహించగరమని మనవి.
If our news items liked you please send only Rs 2/ by phone pay to 9491659287 for Encourage. until we get Adv.

Leave a Reply