సిండికేటైతేనే చిల్లర మిగులుతుంది… వ్యవహారాలు సీక్రేట్ గా ఉంటాయి!
ఎపిలో నకిలీ మద్యం….మద్యం సిండికేట్ ప్రస్తుతం ఇటీవల వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోని ములకలచెరువులో వెలుగుచూసిన నకిలీ మద్యం…
ఎపిలో నకిలీ మద్యం….మద్యం సిండికేట్ ప్రస్తుతం ఇటీవల వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోని ములకలచెరువులో వెలుగుచూసిన నకిలీ మద్యం కుంభకోణం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈదందాలో టిడిపి నాయకులే సూత్రధారులుగా, పాత్రదారులుగా ఉండటంతో టిడిపి-వైసిపి మధ్య మాటలు, ఆందోళనల యుద్ధం సాగుతోంది. తాజాగా నకిలీ దందా వెనుక వైసిపి మాజీ మంత్రి జోగి రమేష్ హస్తం ఉందని ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్థనరావు వీడియో విడుదల చేయడంతో ఎపిలో మద్యం రాజకీయం మరింత వేడెక్కింది. ఇసుక, మద్యం విధానంలో జోక్యం చేసుకుంటే సహించేది లేదని, బెల్టుషాపులను ఏర్పాటు చేస్తే రూ. ఐదు లక్షల జరిమానా విధించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలోనే ఆదేశించారు. అయితే ఆయన ఆదేశాలు ఇప్పటి వరకు అమలు కాలేదన్నది నకిలీ మద్యం కుంభకోణం వెలుగులోకి తెచ్చింది.
మద్యనిషేధాన్ని అమలు చేస్తామన్న వైసిపి నాయకులు సొంత బ్రాండ్లతో వ్యాపారం చేసి కేసుల్లో ఇరుక్కోగా….నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెస్తామని అధికారంలోకి వచ్చిన టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం…అధిక ధరలపై మందుబాబులు రానున్న రోజుల్లో ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి.
మద్యం వ్యాపారంపై ఆరా తీయగా పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యాపారం చేస్తే మిగిలేదేమీ ఉండదని తేలింది. ఒక్కో వ్యాపారి రూ. 2లక్షలతో దరఖాస్తు చేసి, లాటరీ ద్వారా మద్యం షాపులు కైవసం చేసుకున్నారు. ఒక షాపును దక్కించుకునేందుకు పదుల సంఖ్యలో దరఖాస్తులు వేయాల్సి వచ్చింది. షాపును ఏర్పాటు చేసేందుకు మరో కోటి వరకు వెచ్చించాల్సి వచ్చింది. తొలుత ప్రభుత్వం 20శాతం మార్జిన్ ఇస్తామని ప్రకటించిందని, అయితే ప్రస్తుతం వారికి 10-14శాతం మాత్రమే మార్జిన్ లభిస్తోంది. దీంతో వ్యాపారులు పక్కదారిపడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులన్నీ దాదాపు కూటమి నాయకులు, కార్యకర్తల గుప్పిట్లోనే ఉన్నాయి. టిడిపి నేతలతో ఉన్న సాన్నిహిత్యం వల్ల రాజమహేంద్రవరం లాంటి చోట్ల వైసిపి నాయకులు కూడా మద్యం షాపులు దక్కించుకున్నారు. ఈనేపథ్యంలో మద్యం వ్యాపారులంతా సిండికేట్ గా మారారు. మద్యాన్ని ఒక్కో సీసాకు రూ. 10-20 పెంచి అమ్మేస్తున్నారు. కొన్ని చోట్ల తక్కువ ధరకు లభించే మిలట్రీ మద్యాన్ని కూడా సేకరించి, షాపుల్లో అమ్మేస్తున్నారు. వ్యాపారులంతా కూటమి నాయకులే కావడంతో ఎక్సైజ్ అధికారులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. మరోవైపు మద్యం షాపుల్లో ధరకే బార్లకు మద్యాన్ని సరఫరా చేస్తామన్న నిబంధనతో ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా బార్లను నిర్వహించేందుకు వ్యాపారులు ఆసక్తి చూపించలేదు. ఇప్పటికే మద్యం వ్యాపారాలు నిర్వహిస్తున్న వారే బార్లను తీసుకోవడం గమనార్హం. తమ మద్యం షాపుల నుంచి మద్యాన్ని బార్లకు సరఫరా చేసి, తద్వారా లాభాలు ఆర్జించాలన్నది వారి పథకంగా కనిపిస్తోంది. వ్యాపారులంతా సిండికేట్ అయితేనే ఇలాంటి వ్యవహారాలు గుట్టుచప్పుడు కాకుండా చేసుకోవచ్చు.
నాడు…నేడు సిండికేట్ డాన్ ఒక్కరేనా…
2009-2014లో మద్యం వ్యాపారులు సిండికేట్ గా మారి, రాష్ట్రవ్యాప్తంగా చక్రం తిప్పారు. తెల్లరేషన్ కార్డుదారులను కూడా బినామీ మద్యం వ్యాపారులుగా మార్చేశారు. తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వైసిపికి చెందిన మండలిలో ప్రతిపక్ష నేత, నాడు మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ పై చార్జీషీటు కూడా దాఖలైన విషయం గమనార్హం. నాడు సిండికేట్ మద్యం వ్యాపారంపై అవినీతి నిరోధక శాఖ కేసులు నమోదు చేసింది. ఆ కేసులో రాజమహేంద్రవరం సిండికేట్ లో చక్రం తిప్పిన కీలక మద్యం వ్యాపారి జైలుకు కూడా వెళ్లాడు. ఇప్పుడు ఆ వ్యాపారే మద్యం మళ్లీ సిండికేట్ చక్రం తిప్పుతూ గత అనుభవాలను అమల్లోకి తెస్తున్నాడు. దీనిలో భాగంగా మీడియా మేనేజ్ మెంట్ కూడా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ హయాంలో సిండికేట్ వ్యాపారులు ఎంఆర్పీ ధరలను ఉల్లంఘిస్తున్నారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, నాటి బిజెపి ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఎక్సైజ్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం, కొద్దిరోజుల తరువాత వారు గమ్మునుండిపోవడం గుర్తుండే ఉంటుంది. ఈమధ్య టిడిపి భజన చేస్తున్న సోము వీర్రాజులో ఆమాత్రం స్పందన లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.