పి-1…పి-3 ఏది లాభం ఏది నష్టం?….ప్రముఖ వైద్యుల అభిప్రాయం ఇదీ!
ఆంధ్రప్రదేశ్ లో వైద్య కళాశాలల నిర్వహణ విధానం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పి అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య కళాశాలలు నిర్మించాలని తలపెట్టిన వైఎస్సార్సీపి కేవలం ఐదు…
ఆంధ్రప్రదేశ్ లో వైద్య కళాశాలల నిర్వహణ విధానం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పి అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య కళాశాలలు నిర్మించాలని తలపెట్టిన వైఎస్సార్సీపి కేవలం ఐదు మాత్రమే పూర్తి చేసింది. అయితే అవీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేలేకపోయిందన్నది అధికార టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వ వాదన. దీంతో కూటమి ప్రభుత్వం మిగిలిన 17 వైద్య కళాశాలలను పిపిపి(పి-3) అంటే ప్రభుత్వ, ప్రైవేటు, భాగస్వామ్యంతో పూర్తి చేయాలని నిర్ణయించింది. వైసిపి ప్రారంభించిన వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు వేల కోట్ల వ్యయంతో పాటు, ఏళ్లకు ఏళ్ల సమయం పడుతుందని కూటమి నాయకులు వాదిస్తున్నారు. అందుకే పి-3 విధానం వైపు మొగ్గు చూపించినట్లు చెబుతున్నారు. మరోవైపు వైద్య కళాశాలలను తమ అనుకూల వ్యాపారవేత్తలకు, వైద్య కళాశాలల యాజమాన్యాలకు భూమితో సహా కారు చౌకగా కట్టబెట్టేందుకే పి-3 విధానాన్ని కూటమి ప్రభుత్వం అమల్లోకి తెస్తోందని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. పి-3 విషయంలో ప్రజలకు కూడా కొన్ని సందేహాలు, అపోహలు ఉన్నాయి. ఈనేపథ్యంలో గతంలో ప్రైవేటు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదువుతుని, ప్రముఖ వైద్యుల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు దివాకరమ్ న్యూస్ ప్రయత్నించింది. దీనిలో భాగంగా బిసి రాయ్ అవార్డు గ్రహీత, ప్రముఖ మానసిక వైద్యులు కర్రి రామారెడ్డి, టిడిపి డాక్టర్స్ సెల్స్ కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, వైసిపి రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ చార్జి, ప్రముఖ వైద్యులు గూడూరి శ్రీనివాస్ అభిప్రాయాలను సేకరించింది.
క్రెడిట్ కూటమికి దక్కుతుందనే…వైసిపి దుష్ర్పచారం – రవిరామ్ కిరణ్
ప్రతీ జిల్లాలోనూ ఒక్కో మెడికల్ కళాశాల, అనుబంధంగా వెయ్యి పడకలతో ఆసుపత్రి నిర్మించాలన్నది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ విధానం…వైసిపి ప్రభుత్వ నిర్ణయం కాదు. వీటి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రూ. 1700 కోట్లు, నాబార్డు రూ. 2700 కోట్ల ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. దీనిలో భాగంగానే గత వైసిపి ప్రభుత్వం 22 మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని చేపట్టింది. ఐదేళ్లలో కేవలం 5 కళాశాలలను మాత్రమే అదీ పాక్షికంగా పూర్తి చేసింది. టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత త్వరతగతిన కళాశాలలను పూర్తి చేసి, పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు పిపిపి విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీనిపై వైసిపి దుష్ర్పచారం సాగిస్తోంది. పి-3 విధానంలో ఇప్పటికే ఆసుపత్రులు నిర్వహిస్తున్న టిటిడి, టాటా మెమోరియల్ వంటి సేవా భావం ఉన్న స్వచ్చంద సంస్థలకే కళాశాలల నిర్మాణ, నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించింది. 30ఏళ్లు మాత్రమే పిపిపి విధానం అమల్లోకి ఉంటుంది. తరువాత అవన్నీ ప్రభుత్వపరమవుతాయి.
జాతీయ వైద్య మండలి మార్గదర్శకాల ప్రకారమే కళాశాల నిర్మాణం, నిర్వహణ జరుగుతాయి. ఒక్కో కళాశాల నిర్మాణానికి సుమారు 300కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయినా 70శాతం పేదలకు ఉచితంగానే కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందుతాయి. మిగిలిన 30శాతంలో కూడా ఆరోగ్య బీమా, యూనివర్శల్ హెల్త్ వంటి బీమా సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. అయినా ప్రఫంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో కళాశాలల యాజమాన్యాలు కొంతమొత్తంలో లాభాలు ఆర్జిస్తే తప్పేమిటి. వచ్చే మూడేళ్లలో కళాశాలల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కళాశాలల్లో గత ప్రభుత్వం కన్నా మెరిట్ సీట్ల సంఖ్యను 42.5నుంచి 50శాతానికి పెంచింది. తద్వారా మొత్తం 1700 సీట్లలో ఉచిత సీట్ల సంఖ్య 850కు పెరుగుతుంది. వాస్తవానికి రూ. 15వేలు మాత్రమే ఉండే మెరిట్ సీట్ల ఫీజును 4.96లక్షలకు పెంచింది జగన్ ప్రభుత్వమే. తాము అధికారంలోకి వస్తే మెడికల్ కళాశాలల అనుమతులను రద్దు చేస్తామని బెదిరించడం తప్పు. ప్రభుత్వమే ఈకళాశాలలను నిర్మించాలంటే దాదాపు 10ఏళ్లకు పైగా పడుతుంది. తద్వారా దాదాపు 3కోట్ల మంది పేదలు కార్పొరేట్ స్థాయి వైద్యానికి దూరమవుతారు. కూటమి ప్రభుత్వ హయాంలో వైద్య కళాశాలలు పూర్తయి పేదలకు మంచి వైద్యం అందితే ఆ క్రెడిట్ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్న అక్కసుతోనే వైసిపి పి-3 విధానంపై వైద్యాన్ని ప్రైవేటుపరం చేస్తున్నారని దుష్ర్పచారం చేస్తోంది.
ఆరోగ్యశ్రీ అంతేగా….డాక్టర్ కర్రి రామారెడ్డి
పి-3 విధానంలో సానుకూల, ప్రతికూల అంశాలు రెండూ ఉంటాయి. కోట్ల రూపాయలు ఖర్చు చేసి, మెడికల్ కళాశాలలు నిర్మించే వారు లాభాలు ఆశించకుండా ఎలా ఉంటారు. పేదల ఉచిత వైద్యం ఖర్చుల భారం వైద్య విద్యార్థులపై పడే అవకాశాలు ఉంటాయి. స్వచ్చంద సంస్థలకే కళాశాల నిర్మాణ, నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రస్తుతం మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలన్నీ ఏదో ఒక సొసైటీ, ట్రస్టు పేరిట నడుస్తున్న సంగతిని గుర్తించాలి. పి-3 విధానంలో ప్రభుత్వంపై ఆర్థిక, నిర్వహణ భారం తప్పుతుంది. అలాగే అనుభవజ్ఞులైన ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో వైద్యం, ఇతర సేవల్లో నాణ్యత ఉంటుంది. అన్నీ ప్రభుత్వమే నిర్వహించాలంటే కష్టమే. ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నారన్న విషయాన్ని గుర్తించాలి. దేశవ్యాప్తంగా పలు కళాశాలలు, ఆసుపత్రులు పి-3 విధానంలో నడుస్తున్నాయి. చెన్నై ఐఐటిలో కొన్ని విభాగాలను చెట్టినాడ్ సంస్థ నిర్వహిస్తోంది. బెంగుళూరు, డిల్లీల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కొన్ని విభాగాలను నారాయణ హృదయాలయ, నెఫ్రోప్లస్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. పి-3 విధానంలో నిర్వహణ లోపాలను, ప్రజలపై భారాలను తగ్గించేందుకు ఏక్షణంలోనైనా కాంట్రాక్టును రద్దు చేసే అవకాశాన్ని ప్రభుత్వం వద్ద ఉంచుకుంటే తప్పులు, అక్రమాలకు ఆస్కారం ఉండదు. అలాగే వైద్య విద్యార్థులపై అదనపు భారం పడకుండా తగిన చర్యలు తీసుకోవాలి.
అంతా మోసం…..మెడికల్ మాఫియా..డాక్టర్ గూడూరి శ్రీనివాస్
పి-3 విధానం అంతా మోసం. తమ అనుకూల వైద్య కళాశాలల యాజమాన్యాలు, పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టేందుకు ఈవిధానాన్ని తీసుకొచ్చారు. కొత్త వైద్య కళాశాలల్లో మెరిట్ సీట్ల పెంపు, ఫీజుల తగ్గింపు, పేదలకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అంతా బూటకం. ప్రభుత్వం నిర్ధశేంచిన షరతులు అమలు కావు. తమకు అనుకూలమైన సంస్థలే కనుక ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోదు. సేవా భావం కలిగిన స్వచ్చంద సంస్థలకు అప్పగిస్తామని చెబుతున్నా ఎవరూ రాలేదని తాము అనుకున్న సంస్థలకే కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి. వైద్య కళాశాలలన్నీ సిండికేట్ గా మారి, పేదలను, వైద్య విద్యార్థులను దోచుకునే అవకాశాలున్నాయి. ఉచిత వైద్య, విద్య ప్రజల ప్రాథమిక హక్కు. పి-3 విధానంలో వైద్యాన్ని ప్రైవేటుపరం చేసి, ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ సౌకర్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఉందన్న విషయాన్ని గుర్తించాలి. వైసిపి హయాంలోనే పిజి కోర్సు ఫీజులను రూ. 12నుంచి 5లక్షలకు తగ్గించిన విషయాన్ని గుర్తించాలి. కళాశాలల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం వద్ద తగిన నిధులు లేకపోతే డబుల్ ఇంజన్ సర్కారు అంటున్నారు కనుక కేంద్రంలోని మరో ఇంజన్ గా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో పూర్తి చేయాలి. మూడేళ్లలో పూర్తి చేయకపోతే ఓపి సేవలు నిలిచి, కోట్లాది మంది ప్రజలు నష్టపోతారన్న వాదన తప్పు. అలా ఆలోచిస్తే ప్రైవేటు విద్యా, వైద్య కళాశాలలను ఇప్పటికే మూసుకోవాలి. ప్రభుత్వ వైద్య, విద్యాసంస్థలున్నా అవసరం, ఆర్థిక స్తోమత ఉన్న వారు తమకు అందుబాటులో ఉన్న సేవలను వినియోగించుకుంటారు.