జిఎస్టీ 2.0 ఎవరికి ప్రయోజనం?!….పప్పులు…ఉప్పులు తగ్గలేదేమిటీ?

కూడు-గూడు-గుడ్డ ప్రతీ మనిషికి ప్రాథమిక అవసరాలు. అయితే దేశవ్యాప్తంగా అంబరాన్నంటుతున్న జిఎస్టీ 2.0 సంస్కరణల సంబరాల్లో నిత్యావసరాలైన బియ్యం, పప్పులు, ఉప్పులు, నూనెలు, పాల ప్యాకెట్ల వంటి…

 జిఎస్టీ 2.0 ఎవరికి ప్రయోజనం?!….పప్పులు…ఉప్పులు తగ్గలేదేమిటీ?

కూడు-గూడు-గుడ్డ ప్రతీ మనిషికి ప్రాథమిక అవసరాలు. అయితే దేశవ్యాప్తంగా అంబరాన్నంటుతున్న జిఎస్టీ 2.0 సంస్కరణల సంబరాల్లో నిత్యావసరాలైన బియ్యం, పప్పులు, ఉప్పులు, నూనెలు, పాల ప్యాకెట్ల వంటి ధరల తగ్గింపు ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. వాడవాడలా ధరలు దిగివచ్చాయని జరుగుతున్న ప్రచారహోరులో ఎంతో ఆశతో సామాన్యుడు కిరాణా షాపులకు వెళ్లి విచారిస్తే బియ్యం, పప్పులు, ఉప్పులు, పాల ప్యాకెట్ల వంటి నిత్యం వాడే వస్తువుల ధరలేమీ తగ్గలేదన్న యజమానుల సమాధానంతో కాస్త నిరాశ చెందుతున్నారు. వీటిలో కొన్నింటిపై 0-5శాతం పాత జిఎస్టీ ధరలు కొనసాగుతున్నాయని ఎపి ఫెడరేషన్ చాంబర్ కామర్స్, అండ్ ఇండస్ట్రీస్ తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ బూర్లగడ్డ సుబ్బారాయుడు వెల్లడించారు.
సంబరాలన్నీ కార్లు, ఆటో షోరూములు, టీవీలు, ఫ్రిడ్జ్ లు, ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాల వద్దే జరుగుతున్నాయి. కిరాణా కొట్లు, బట్టల దుకాణాలు, పాల బూత్ లను కూటమి నాయకులు పట్టించుకున్నట్లు లేదు.
దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని జిఎస్టీ సంస్కరణలను అమల్లోకి తెచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పొగాకు, లగ్జరీ వస్తువులు మినహా అన్ని వస్తువుల ధరలు అమాంతం దిగి వస్తాయని ఆమె వెల్లడించారు. జిఎస్టీ శ్లాబులను 4 నుంచి రెండుకు కుదించామని, గతంలో ఉన్న 12,28 శాతం శ్లాబులను తొలగించి, 5,18 శ్లాబులను మాత్రమే అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. పేదా, ధనిక తారతమ్యం లేకుండా వాడే పప్పూ, ఉప్పు, నూనెలు, కిరాణా వస్తువులు, పాలప్యాకెట్లు, దుస్తుల విషయాన్ని ఆర్థిక మంత్రి విస్మరించారు. రొట్టెల్లోని కొన్ని రకాలు, బేకరీ ఐటెమ్ వంటి వాటి ధరలను తగ్గించడం గమనార్హం. అయితే సబ్బులు, పేస్టులు, మందులు, బీమా, విద్యావస్తువులు వంటి వాటి ధరలు తగ్గించడం కాస్త ఊరట కలిగించే అంశం. స్థూలంగా ఆలోచిస్తే తగ్గిన ధరలు పేదలకు పెద్దగా ప్రయోజనం లేనివే. అన్ని కిరాణా సామాగ్రి పై పూర్తిగా జిఎస్టీని ఎత్తేస్తే నిజంగా పేదలకు పండుగే. దీపావళి పండుగ సందర్భంగా ప్రకటించి జిఎస్టీ సంస్కరణల్లో చిన్నా పెద్దా ఆనందంగా జరుపుకునే దీపావళి బాణాసంచాకు చోటు లేకపోవడం మరింత విడ్డూరం. ఇక ఒకే దేశము..ఒకే పన్ను నినాదంతో 2017లో జిఎస్టీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అప్పటి నుంచి వసూలు చేస్తున్న జిఎస్టీని బీహార్ ఎన్నికల సందర్భంగా తగ్గించినట్లు ప్రచారం జరుగుతోంది. మొన్నటివరకు అధిక పన్నులు చెల్లించామని భావించే వారు కూడా ఇప్పుడు పన్నులు తగ్గాయని సంబడపడటం భారతీయులు సగటు వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది.

Leave a Reply