ఉండవల్లి విభజన గోడుకు 11ఏళ్లు….ఆశలన్నీ పపన్ పైనే…

రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించి ఫిబ్రవరి 18 నాటికి 11ఏళ్లు పూర్తయింది. గత 11 ఏళ్లుగా విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయంపైనా, విభజన తీరుపైనా అలుపెరగని…

 ఉండవల్లి విభజన గోడుకు 11ఏళ్లు….ఆశలన్నీ పపన్ పైనే…

రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించి ఫిబ్రవరి 18 నాటికి 11ఏళ్లు పూర్తయింది. గత 11 ఏళ్లుగా విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయంపైనా, విభజన తీరుపైనా అలుపెరగని న్యాయ, రాజకీయ పోరాటం చేస్తూ ప్రతీ ఏటా ఈరోజున మాజీ ఎంపి, ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఎపికి జరిగిన నష్టాన్ని పూడ్చాలని, ఎపి లాంటి అన్యాయం మరో రాష్ట్రానికి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూనే ఉన్నారు. ఆయన గోడును గత తెలుగుదేశం, వైసిపి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈనేపథ్యంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసి, రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని నిగ్గు తేల్చిన, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆశాకిరణంగా ఉండవల్లి భావిస్తున్నారు.  రాష్ట్ర విభజన తీరుపై తాను సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ పై కేంద్రం నుంచి అఫిడవిట్ వేయించడంతో పాటు జగన్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన అఫిడవిట్ ని కొనసాగిస్తూ ప్రభుత్వం వాదనలు వినిపించేలా చేయాలనీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ తాజా మీడియా సమావేశంలో విజ్ఞప్తి  చేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఉప ముఖ్యమంత్రి కావడం, ఆయన మద్దతు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేకు కీలకం కావడం వల్ల పవన్ ఒత్తిడితో ఫలితం ఉంటుందని, పైగా ఇదే తగిన సమయమని భావిస్తున్నానని ఉండవల్లి అన్నారు. ఈవిషయమై గత డిసెంబర్ లో పవన్ కి లేఖ రాసానని ఆయన గుర్తుచేశారు. 

   రాష్ట్ర విభజన అన్యాయం చేసారని సాక్షాత్తూ ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పలు సందర్భాల్లో పార్లమెంట్ ఉభయసభల్లో వ్యాఖ్యానించారని ఉండవల్లి గుర్తుచేస్తూ,  అందుకే పార్లమెంట్ లో  నోటీసు ఇస్తే తగిన చర్చ జరిగి మనకు జరిగిన అవమానానికి కనీసం  ఊరట కలుగుతుందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టులో తాను  దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరుగుతూ ఉందని, అయితే  ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కనీసం కౌంటర్ దాఖలు చేయలేదని ఉండవల్లి తెలిపారు. పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుంటే కేంద్రం నుంచి కౌంటర్ దాఖలు చేయించవచ్చని ఆయన అన్నారు. 

  2018ఫిబ్రవరి  18న పవన్ కళ్యాణ్  ఏర్పాటు చేసిన  ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన బకాయిలు రూ. 74, 542 కోట్లుగా లెక్క తేల్చిందని  ఉండవల్లి గుర్తుచేసారు. 2019 ఎన్నికల తరువాత ఎవరు అధికారంలోకి వచ్చినా, ఎపికి జరిగిన అన్యాయం విషయమై పార్లమెంటులో చర్చించాలని, సుప్రీంకోర్టులో ప్రస్తావించాలని ఆ రోజున ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సమావేశంలో తీర్మానించుకున్నామని పవన్ కు గుర్తు చేశారు. మచ్చలేని పవన్ కళ్యాణ్ తలచుకుంటే,   మన రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టుకోవడానికి, జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఇదే సరైన సమయమని ఉండవల్లి అన్నారు. మరో రెండు రోజుల్లో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో విభజన అంశం ప్రస్తావించాలని పవన్ కు విజ్ఞప్తి చేశారు. ఈవిషయంలో పవన్ రాష్ట్రానికి ఆశాజ్యోతిగా భావిస్తున్నట్లు ఉండవల్లి పేర్కొన్నారు. 

 

అదంతా ఉత్తిదే…

 

   వైసిపిలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై ఉండవల్లి ప్రస్తావిస్తూ, తాను పదేళ్ల క్రితమే స్వచ్ఛంద రాజకీయ విరమణ చేసానని, ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశ్యం లేదని, ఏ పార్టీలో కూడా పనిచేయలేనని స్పష్టం చేసారు. ఈజీవితమే తనకు బాగుందని బిపి, షుగర్లు నియంత్రణలో ఉన్నాయని వ్యాఖ్యానించారు.  

 

డయాఫ్రంవాల్ నిర్మాణంలో మతలబు

 

గతంలో కోట్లాది రూపాయలతో నిర్మించిన పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని అంచనాలు పెంచి మళ్లీ అదే కంపెనీకి ఇవ్వడంలో ఎదో మతలబు ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. పునరావాసానికి నిధులు ఇవ్వలేక పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని చూస్తున్నారని ఉండవల్లి చెప్పారు. ఈవిషయాన్ని పోలవరం ఇంజనీర్లే తనకు ఒక సందర్భంలో చెప్పారని తెలిపారు.

 

ఆరోజునే కేసు వదిలేస్తా…

 

మీడియా మొఘల్ గా పేరుగాంచిన, అందరికీ ఆదర్శంగా దివంగత రామోజీరావు మార్గదర్శి విషయంలో తప్పు చేసినట్లు ఒక్క మాట చెబితే చాలని తాను మార్గదర్శి కేసును వదిలేస్తానని స్పష్టం చేశారు. మార్గదర్శి కేసులో రామోజీరావుకు శిక్ష పడాలని  ఎప్పుడూ అనుకోలేదని, ఆయనపై కక్ష ఏమాత్రం లేదని, తప్పు జరిగిందా లేదా అనేది  ప్రజలకు తెలియాలనేదే తన ఉద్దేశ్యమని ఆయన పునరుద్ఘాటించారు. రామోజీరావు మరణించిన తరువాత ఆయన కుమారుడు కిరణ్ తాను కర్తగా స్వచ్చందంగా కోర్టు ముందుకు వచ్చారని ఉండవల్లి వెల్లడించారు.

Leave a Reply