పాపం మెగాస్టార్ ఒంటరయ్యారా?….ఖండిచేవారే కరవయ్యారా?!
సినీనటుడు నందమూరి బాలకృష్ణ మొన్న అసెంబ్లీలో నెత్తిపైన కూలింగ్ గ్లాసులు…జేబులో చేతులు పెట్టుకున్న తీరు… అసందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్ ముందు చిరంజీవితో…
సినీనటుడు నందమూరి బాలకృష్ణ మొన్న అసెంబ్లీలో నెత్తిపైన కూలింగ్ గ్లాసులు…జేబులో చేతులు పెట్టుకున్న తీరు… అసందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్ ముందు చిరంజీవితో సహా ఎవడూ గట్టిగా మాట్లాడలేకపోయారంటూ చేసిన వ్యాఖ్యలు సభలో ఉన్న మెజార్టీ సభ్యులతో పాటు, తెలుగు ప్రజలకు కూడా పెద్దగా నచ్చకపోయి ఉండవచ్చు. అయినా ప్రభుత్వ పెద్దలతో సహా ఎవరూ కిమ్మనలేకపోయారు. ఈతేనెతుట్టను కదిపిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తాను మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగించాలని స్వచ్చందంగా కోరారంటే బాలకృష్ణ అసందర్భంగా మాట్లాడినట్టు ఒప్పుకోవడమే. సాధారణంగా కమ్మ సామాజిక వర్గీయుల్లో 90శాతం మంది వివాదాలకు దూరంగా, ఇతరుల పట్ల సౌమ్యంగా ఉండి, నేర్పుగా వ్యవహరిస్తారు. అయితే నా బ్రీడే వేరని చెప్పుకున్న బాలకృష్ణ మాత్రం మాటతీరు…వ్యవహారికంలోనూ వేరని నిరూపించుకున్నారు. ఆయన అభిమానులకు మాత్రం బాలకృష్ణ తీరు పిచ్చగా నచ్చేసి ఉండవచ్చు. ఎవరి పిచ్చ వారికి నచ్చుతుంది. బాలకృష్ణ తన ధోరణిలో ఏదో మాట్లాడితే పర్వాలేదు. కానీ అసందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని అవమానించేలా మాట్లాడం అటు సినీ, రాజకీయ రంగాల్లో తీవ్ర దుమారం లేపింది. కాపు సామాజిక వర్గీయులు సహజంగానే కాస్త దూకుడుగా ఉంటారు. ఈవిషయంలో చిరంజీవి స్టైలే వేరు..బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి కూడా తీవ్రంగా స్పందించి, వైసిపి అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమను సాదరంగా ఆహ్వానించి, గౌరవంగా వ్యవహరించారని బాలకృష్ణ వ్యాఖ్యలపై ఖండన విడుదల చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు ప్రభుత్వ పెద్దల నుంచి గానీ, ఆర్ నారాయణ మూర్తి మినహా సినీ పెద్దల నుంచి గానీ బహిరంగ ప్రకటన రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. చిరంజీవితో కలిసి జగన్ ను కలిసిన ప్రముఖ హీరోలు, నిర్మాతలు, దర్శకులు కూడా బాలకృష్ణ వ్యాఖ్యలపై మౌనంగా ఉండటం గమనార్హం.
ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న చిరంజీవి సోదరులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎమ్మెల్సీ నాగబాబు కూడా తమ సోదరుడికి జరిగిన అవమానంపై స్పందించకపోవడం విడ్డూరంగా ఉంది. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఎందుకో మౌనంగా ఉంటున్నారు. అనవసరమైన విషయాల్లో ఆవేశం కట్టలు తెంచుకుంటారని చెప్పుకునే కాపు సామాజిక వర్గీయుల్లోనూ..కనీసం మెగా అభిమానుల్లో కూడా పెద్దగా కదలిక లేకపోవడం ప్రస్తావనార్హం. సినీ పరిశ్రమలో ఏకంగా మెగా కాంపౌండ్ నే సృష్టించిన చిరంజీవిని సమర్థించేవారు…బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించేవారే కరవయ్యారా అన్నది చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి లేకపోతే పవన్, నాగబాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ వంటి వారు సినీ రంగంలో ఈస్థాయిలో ఉండేవారు కాదేమో. ముఖ్యంగా పవన్, నాగబాబులకు సినీ, రాజకీయ స్ఫూర్తిని, మద్దతును ఇచ్చింది కూడా మెగాస్టారే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. బాలకృష్ణ యథాలాపంగా ఈవ్యాఖ్యలు చేయలేదని, దీని వెనుక ఒక మర్మం ఉందని కూడా కొంత మంది పవన్ అభిమానులు, కాపు సామాజిక వర్గీయులు అనుమానిస్తున్నారు. తన అల్లుడు కూటమి ప్రభుత్వంలో పవర్ సెంటర్ గా ఉన్న నారా లోకేష్ ముఖ్యమంత్రి కాకుండా పవన్ వ్యూహాత్మకంగా అడ్డుకుంటున్నారని, తన అల్లుడికి ఎప్పటికైనా పవన్ పోటీ వస్తారన్న దీర్ఘాలోచనతోనే బాలకృష్ణ పవన్ ను, ఆయన అభిమానులను రెచ్చగొట్టేలా ఈవ్యాఖ్యలు చేసి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈఅంశాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రత్యర్థి వైఎస్సార్సీపి వెంటనే రంగంలోకి దిగి, బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించి…మండించి సామాజిక, రాజకీయ స్పర్థలు పుట్టించేందుకు ప్రయత్నిస్తోంది.