నెయ్యి కల్తీ నిజం…. కానీ నిజమే కల్తీ!

భక్తులు ఎంతో భక్తి భావంతో…ఇష్టంగా తినే తిరుమల లడ్డూ కల్తీ జరుగుతోందన్నది ముమ్మాటికి నిజం. నెయ్యి కల్తీ కాలేదని ప్రతిపక్ష వైసిపి పార్టీ కూడా ఖండించకపోవడం కల్తీని…

 నెయ్యి కల్తీ నిజం…. కానీ నిజమే కల్తీ!

భక్తులు ఎంతో భక్తి భావంతో…ఇష్టంగా తినే తిరుమల
లడ్డూ కల్తీ జరుగుతోందన్నది ముమ్మాటికి నిజం. నెయ్యి కల్తీ కాలేదని ప్రతిపక్ష వైసిపి పార్టీ కూడా ఖండించకపోవడం కల్తీని ఖరారు చేస్తోంది. అయితే ఎప్పటి నుంచి కల్తీ అవుతోంది…ఏవిధంగా కల్తీ అవుతోందో ఇప్పటికీ స్పష్టత లేదు. ఈవిషయంలో భక్తుల్లో అయోమయం నెలకొంది. ఎల్లో మీడియాలో చూస్తే వైసిపి హయాంలోనే కల్తీ జరిగినట్లు తెలుస్తోంది. వైసిపి నేత, మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాటలు వింటే 2014-2019 నాటి నుంచే కల్తీ జరుగుతున్నట్లు అనుమానం కలుగుతోంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో టిడిపి, వైసిపి నేతల పరస్పర ఆరోపణలు, విమర్శల పర్యవసనమే వైసిపి నేత అంబటి రాంబాబు బూతు పురాణం, ఆయన ఇంటిపై టిడిపి కార్యకర్తల దాడి.
ఎపిలో రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం కల్తీ లడ్డూలతో పాటు నిజాల కల్తీ కూడా జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలోనే లడ్డూల్లో కల్తీ జరుగుతోందని తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా దుమ్మెత్తిపోస్తోంది. జాతీయ డైరీ డెవలప్ మెంట్ బోర్డు గత నివేదిక ఆధారంగా నెయ్యిలో పంది, ఆవు కొవ్వు కలిశాయని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈఅంశాన్ని టిడిపి, ఎల్లో మీడియా ఊరూవాడా ప్రచారం చేశాయి. తిరుమల లడ్డూలో వినియోగించిన నెయ్యిలో జంతువుల
కొవ్వు కలిసే అవకాశం ఉండవచ్చన్న అనుమానాన్ని ఎన్ డిడిబి నివేదిక వ్యక్తం చేసింది. దానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు నియమించిన నివేదిక రావడం తెలుగుదేశం పార్టీకి మింగుడుపటడం లేదన్నది ఎల్లో మీడియా వార్తల ఆధారంగా తెలుస్తోంది. సెంట్రల్ డెయిరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(సిడిఆర్ఐ) నివేదిక ఆధారంగా రసాయనాలతో కల్తీ చేశారని సిట్ తన నివేదికలో పేర్కొంది. ఈనివేదిక పై తెలుగుదేశం పార్టీతో పాటు, ఎల్లో మీడియా కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తద్వారా సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ అధికారి సభ్యుడిగా ఉన్న సిట్ నివేదికనే టిడిపి, ఎల్లో మీడియా విశ్వసించడం లేదన్న అనుమానాలు కలుగుతున్నాయి. అనుకున్నదొక్కటీ అయినది ఒక్కటీ అన్న రీతిలో ఎల్లో మీడియా సిట్ నివేదికపై తీవ్ర అసంతృప్తితో వార్తలు ప్రచురించింది. అసలు సిడిఆర్ఐకి పూర్తిస్థాయిలో నెయ్యిని పరీక్షించే సౌకర్యలే లేవని విమర్శలు ఎక్కుపెట్టింది. కల్తీ నెయ్యి కేసులో నిందితులు సిడిఆర్ఐ మాజీ అధికారులేనని ఆరోపించింది. వాస్తవానికి నిపుణులైన అధికారులనే నాణ్యత పరీక్షలకు ఎంపిక చేస్తారన్న విషయాన్ని ఎల్లో మీడియా ఈసందర్భంగా విస్మరించింది. మరోవైపు రాధాకృష్ణ తాజాగా పంది కొవ్వు, ఆవు కొవ్వు కంటే ప్రమాదకరమైన రసాయానాలతో నెయ్యిని కల్తీ చేశారని కొత్త పలుకు పలకడం గమనార్హం. కల్తీ నెయ్యి కేసులో డిల్లీ మద్యం కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేసినట్లు సిట్ నివేదిక ఆధారంగా నాటి చైర్మన్, వైసిపి అధినేత జగన్ పై చర్యలు తీసుకోవాలన్నది టిడిపి నేతలు, ఎల్లో మీడియా డిమాండ్ అన్నది స్పష్టమవుతోంది.
నోరు మెదపని సనాతని…బిజెపి
తనని తాను సనాతన హిందువుగా చెప్పుకునే జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈమధ్య నోరువిప్పకపోవడం జనసైనికులతో పాటు, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిని వినియోగించారని ఆరోపిస్తూ ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపట్టిన పవన్ సిట్ నివేదికపై నోరెత్తకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. మరోవైపు వైసిపి హయాంలో బాలికలు అదృశ్యమయ్యారంటూ ఆందోళన వ్యక్తం చేసిన ఆయన తన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళకు ఐదుసార్లు అబార్షన్ చేయించిన విషయంపై కూడా ఆయన నోరువిప్పకపోవడం విమర్శలకు తావిస్తోంది. అలాగే హిందువుల పార్టీగా పేరొందిన బిజెపి, దాని అనుబంధ హిందూ సంస్థలు కూడా కల్తీ నెయ్యిపై గట్టిగా నోరు విప్పకపోవడం రాజకీయ చర్చకు దారితీయడంతో పాటు, ప్రధాన మిత్రపక్షమైన టిడిపికి ఇబ్బందికర పరిస్థితిని కల్పిస్తోంది.
మరోవైపు ప్రతిపక్ష వైసిపి నాయకులు లడ్డూ నెయ్యిలో పంది, ఆవు కొవ్వు కలవలేదన్న సిట్ నివేదికతో చంకలు గుద్దుకుంటున్నారు తప్ప నెయ్యిలో కల్తీ జరగలేదన్న విషయాన్ని మాత్రం ఖండించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. అంటే నెయ్యి రసాయన కల్తీ జరిగినట్లు ఒప్పుకున్నట్లే కనిపిస్తోంది. అయితే టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి, 2014 నుంచీ నెయ్యి కొనుగోళ్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేయడం భక్తులను మరింత ఆందోళనకు, అనుమానాలకు గురిచేస్తోంది. ఈపరిణామాలను బట్టి నెయ్యి కొనుగోళ్లలో అక్రమాలు ఏనాటి నుంచో అంతర్గతంగా, అధికారుల స్థాయిలో జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply