తిరుమల నెయ్యి కల్తీకి శాశ్వత పరిష్కారం“హెరిటేజ్” ?!

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కల్తీ లడ్డూ రాజకీయాలు శృతి మించి నడుస్తున్నాయి. భక్తులు పరమపవిత్రంగా భావించి స్వీకరించే తిరుమల లడ్డూను కల్తీ నెయ్యితో తయారు చేశారని కూటమి…

 తిరుమల నెయ్యి కల్తీకి  శాశ్వత పరిష్కారం“హెరిటేజ్” ?!

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కల్తీ లడ్డూ రాజకీయాలు శృతి మించి నడుస్తున్నాయి. భక్తులు పరమపవిత్రంగా భావించి స్వీకరించే తిరుమల లడ్డూను కల్తీ నెయ్యితో తయారు చేశారని కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా, కూటమి నేతలు పవన్ కల్యాణ్, పివిఎన్ మాధవ్ తాజాగా మీడియా సమావేశంలో పునరుద్ఘాటించారు. పాలే లేకుండా బాత్రూమ్ లు కడుక్కునే రసాయనాలతో, జంతు కొవ్వుతో నెయ్యిని తయారు చేశారని ధ్వజమెత్తారు. ఈమాటలు వింటే తిరుమల లడ్డూ అంటేనే అసహ్యించుకునే స్థాయికి రాజకీయాలు దిగజారాయి. నెయ్యి కల్తీ వెనుక హిందూ మతాన్ని, తద్వారా తిరుమల పవిత్రతను దెబ్బతీయాలన్న వైసిపి అధినేత వైఎస్ జగన్ కుట్ర దాగి ఉందని చంద్రబాబు ఆరోపించారు. మరోవైపు వైసిపికి చెందిన టిటిడి మాజీ చైర్మన్లు, జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు టిడిపి హయాంలోనే కల్తీ జరిగిందని ఎదురుదాడికి దిగుతున్నారు. ఏది ఏమైనా నెయ్యి కల్తీ జరుగుతోందన్నది మాత్రం వాస్తవంగా తేలుతోంది.
నెయ్యి కల్తీ వెనుక సూత్రధారులు, పాత్రధారులను కనిపెట్టేందుకు సుప్రీంకోర్టు నియమించిన సిట్ రసాయనాలతో నెయ్యిని తయారు చేశారని నివేదిక ఇచ్చింది. ఈసిట్ లో సిబిఐ అధికారితో పాటు, ఎపి పోలీసు అధికారి కూడా సభ్యులుగా ఉన్నారు. సిట్ నివేదికలో జంతు కొవ్వు కలవలేదని తేల్చడంతో పాటు, తాము అనుకున్న అసలైన సూత్రధారులను గుర్తించలేకపోయారన్న అసంతృప్తితో కూటమి ప్రభుత్వం తాజాగా ఏక సభ్య కమిషన్ వేసింది.
ఈరాజకీయ దుమారం సద్దుమణిగాక అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై మళ్లీ కల్తీ నెయ్యి కొనుగోళ్లను నిలిపివేస్తారన్న గ్యారంటీ లేదు. ఈవ్యవహారంలో రాజకీయ నేతలు కలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తిరుమల శ్రీవారు తమ ఇంటి ఇలవేల్పని, ఆయన దయ వల్లే అలిపిరి దాడిలో బతికి బట్టకట్టానని తిరుమల క్షేత్రం ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలుసార్లు చెబుతుంటారు. ఈనేపథ్యంలో చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన డెయిరీ ఉత్పత్తుల సంస్థ హెరిటేజ్ తిరుమలకు నాణ్యమైన నెయ్యి సరఫరా చేయడమే శాశ్వత పరిష్కారం కావచ్చు. తద్వారా చంద్రబాబు ఎంతో భక్తిగా కొలిచే శ్రీవారి లడ్డూ పవిత్రత ఎప్పటికీ చెక్కుచెదరదు. అయితే అధికారంలో ఉన్న సిఎం కుటుంబానికి చెందిన సంస్థ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో పాలుపంచుకోవడం చట్టపరంగా, నైతికంగా ఇబ్బందికరంగా మారవచ్చు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయిన హెరిటేజ్ సంస్థ సామాజిక బాధ్యత కింద ఏటా దాదాపు 3కోట్లకు పైగా నిధులు వెచ్చిస్తోంది. ఈనిధులను తిరుమల శ్రీవారి నెయ్యి కొనుగోలుకు వెచ్చించే అంశాన్ని పరిశీలించి, తన భక్తిని నిరూపించుకునే అవకాశాన్ని దక్కించుకోవాలి. ఇంటి ఇలవేల్పు శ్రీవారి కోసం సొంత లాభం కొంత మానుకుని, నెయ్యి కొనుగోళ్లకు మరిన్ని నిధులు వెచ్చించినా స్వామి భక్తులకు హెరిటేజ్ సంస్థ చిరస్థాయిగా గుర్తుండిపోవడంతో పాటు, హిందూ ధర్మరక్షకుడిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు. టిటిడి ప్రస్తుత బడ్జెట్ నిధులతోనే మిగిలిన నెయ్యిని ఖరీదు ఎక్కువైనా నాణ్యమైనది కొనుగోలు చేయవచ్చు. అయినా వడ్డి కాసులవాడు..ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన శ్రీవారి నెయ్యి కొనుగోళ్లలో ఈకక్కుర్తి ఏమిటో కోట్లాది రూపాయల కానుకలు సమర్పించే భక్తులకు అర్థం కాదు…

Leave a Reply