• October 2, 2024

పేపరు బాయ్ నుంచి ప్రజా రాష్ట్రపతిగా….

  పేపరుబాయ్ గా పనిచేసి ఆతరువాత ఆయనే ప్రముఖంగా వార్తల్లో నిలిచారు..యుద్ధ విమానాల పైలెట్ కావాలని ఆశించి, ఏకంగా అణుపరీక్షల్లోనే కీలక భూమిక పోషించారు. మిస్సైల్ మ్యాన్…

Rare photo of Dr. APJ Abdul Kalam when ...

 

పేపరుబాయ్ గా పనిచేసి ఆతరువాత ఆయనే ప్రముఖంగా వార్తల్లో నిలిచారు..యుద్ధ విమానాల పైలెట్ కావాలని ఆశించి, ఏకంగా అణుపరీక్షల్లోనే కీలక భూమిక పోషించారు. మిస్సైల్ మ్యాన్ గా ఖ్యాతి పొందారు. ప్రముఖ గుండెవ్యాధి నిపుణులు సోమరాజుతో కలిసి స్టంట్ ను అభివృద్ధి చేసి వైద్యరంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. పేదల కోసం చౌకగా టాబ్లెట్ కంప్యూర్ ను అభివృద్ధి చేశారు. తరువాత ప్రజల రాష్ట్రపతిగా పేరెన్నికగన్నారు. ఆయనే ఎపిజె కలామ్. ఆయన అసలు పేరు అవుల్ పకీర్ జైనులబ్ధీన్ కలామ్.

 తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931అక్టోబరు 15 న జన్మించారు. తండ్రి జైనులబ్ధీన్, పడవ యజమాని. తల్లి ఆషియమ్మ గృహిణి. పేద కుటుంబం కావటంతో కుటుంబ అవసరాల కోసం పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉండటానికి వార్తా పత్రికలు పంపిణీ చేసేవారు. పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవటానికి తపన పడేవారు.  రామనాథపురం స్క్వార్ట్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక, కలామ్ తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్స్ కళాశాలలో చేరి, 1954 లో భౌతికశాస్త్రంలో పట్టా పొందారు. 8 పోస్టుల యుద్ధ విమానాల పైలెట్ పరీక్షలో తొమ్మిదో స్థానం పొంది యుద్ధ పైలట్ కావాలనే తన కలను సాకారం చేసుకునే అవకాశాన్ని తృటిలో కోల్పోయారు. 1960 లో, కలామ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డివో) వారి ఏరోనాటికల్ డెవెలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లో శాస్త్రవేత్తగా చేరారు. కలామ్ భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చెయ్యటం ద్వారా శాస్త్రవేత్త జీవితాన్ని ప్రారంభించారు.  కానీ డిఆర్‌డివోలో ఉద్యోగం చేయడంతో ఆయన సంతృప్తి చెందలేదు. 1969 లోభారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో (ఇస్రో) చేరిఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం ఎస్ ఎల్ వి-3 తయారీలో పాలుపంచుకున్నారు.  1980 జూలైలో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్యలో విజయవంతంగా చేర్చింది. ఇస్రో చరిత్రలో ఇదో మైలురాయి. SLV-III పరీక్ష విజయం తరువాత తనను కలవాల్సిందిగా ఇందిరాగాంధీ నుంచి పిలుపువచ్చినపుడు ఆయన కాలికి బూట్లు కూడా లేకపోవడం విశేషం. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా కలామ్ పేర్కొనేవారు. కలామ్ 1992 జూలై నుండి 1999 డిసెంబరు వరకు ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుగాడిఆర్‌డివో ముఖ్యకార్యదర్శిగా పనిచేసారు. అదే సమయంలో జరిపిన పోఖ్రాన్ అణు పరీక్షలలో కలామ్ కీలక భూమిక పోషించి, భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చేందుకు కృషిచేశారు. 1998 లో హృద్రోగ వైద్య నిపుణుడైన డాక్టరు సోమరాజుతో కలిసి సంయుక్తంగా ఒక స్టెంటును (stent) అభివృద్ధి చేసారు. దీనిని “కలామ్-రాజు స్టెంట్” అని అంటారు.[6][7] 2012లో, వీరిద్దరూ కలిసి, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించడంలో సహాయపడే ప్రత్యేకంగా ఒక ట్యాబ్లెట్  కంప్యూటరును తయారు చేసారు. దీన్ని “కలామ్రాజు ట్యాబ్లెట్” అని అంటారు.  2002 జూలై 18 న కలామ్ 90శాతం ఓట్ల భారీ ఆధిక్యతతో భారత రాష్ట్రపతిగా ఎన్నికై, జూలై 25న ప్రమాణ స్వీకారం చేశారు.

కలామ్ 2002 నుంచి 2007 వరకు భారత ప్రజా రాష్ట్రపతిగా తన సేవలను అందించారు. రెండవసారి రాష్ట్రపతి పదవి కోసం పోటీ చేయాలనుకున్నా… చివరి క్షణాలలో వద్దని నిర్ణయించుకున్నారు.

 

కలామ్ వివిధ రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా పలు విశ్వవిద్యాలయాల నుండి 7 గౌరవ డాక్టరేట్లను పొందారు. ఇస్రో, డిఆర్డిఓలతో కలిసి పనిచేసినందుకు, ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం 1981 లో పద్మ భూషణ్, 1990 లో పద్మవిభూషణ్ తో సత్కరించింది. భారతదేశంలో రక్షణ సాంకేతిక పరిజ్ఞానం యొక్క శాస్త్రీయ పరిశోధన, ఆధునీకరణకు చేసిన కృషికి 1997 లో కలామ్ భారతదేశపు అత్యున్నత పౌర గౌరవం భారతరత్న అందుకున్నారు.  2013 లో “అంతరిక్ష-సంబంధిత పథకానికి నాయకత్వం వహించి విజయవంతంగా నిర్వహించినందుకు” అమెరికాకు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ నుండి వాన్ బ్రాన్ అవార్డును అందుకున్నారు.  

ఆయన జన్మదినం అక్టోబరు 15 ను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం “యువ పునరుజ్జీవనోద్యమ దినోత్సవంగా జరుపుతుంది. అలాగే”డాక్టర్ ఎ. పి. జె. అబ్దుల్ కలామ్ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. పురస్కారం కింద 8 గ్రాముల బంగారు పతకం, ప్రశంసాపత్రం, ఐదు లక్షల నగదును బహూకరిస్తారు. శాస్త్రీయ వృద్ధిని, మానవీయ శాస్త్రాలను, విద్యార్థుల సంక్షేమాన్ని ప్రోత్సహించడంలో కృషి చేసిన రాష్ట్రప్రజలకు 2015 నుంచి ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని ఇస్తోంది.

కలామ్ పుట్టిన 84వ వార్షికోత్సవం సందర్భంగా, 2015 అక్టోబరు 15 న ప్రధాని నరేంద్ర మోడీ, న్యూఢిల్లీలోని డిఆర్‌డిఓ భవన్‌లో కలామ్ జ్ఞాపకార్థం తపాలా బిళ్ళలను విడుదల చేశారు. అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కొత్త బాక్టీరియంకు కలామ్ గౌరవార్థం ‘సోలిబాసిల్లస్ కలామీ‘ అని పేరు పెట్టడం విశేషం.  2015 అక్టోబరు 15న భారతదేశ రక్షణశాఖా మంత్రి మనోహర్ పారికర్ హైదరాబాద్‌లోని డిఆర్డీవో మిస్సైల్ కాంప్లెక్స్ పేరునుడాక్టర్ ఏపిజె అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్‌గా మార్చారు. భారత మిస్సైల్ మ్యాన్ గా పేరొందిన కలామ్

2015 జూలై 27న  షిల్లాంగ్‌లోని ఐఐఎంలో  ఉపన్యాసం ఇస్తూ కుప్పకూలి గుండెపోటుతో 83 సంవత్సరాల వయసులో అవివాహితుడిగానే మరణించారు. కలామ్ అంత్యక్రియలు ఆయన సొంత ఊరు రామేశ్వరంలో జాతీయ స్థాయి ప్రముఖుల మధ్య, వేలాది ప్రజల సమక్షంలో జరిగాయి.

====================================

 

 

Leave a Reply